అసలయిన భగవదారాధన :
ఈరోజటి విషయం – “భగవంతుడిని ఆరాధించే అసలయిన మార్గం” .అది ఎంతో సులువు గా మనలని సాయి సన్నిధి కి తీసుకెళ్తుంది..ఏంలేదండి, మనము ఏ పని చేస్తోన్న భగవదారాధన గా భావిస్తూ, ఆ పనిని శ్రద్ధ తో, దైవం పై ప్రేమ తో చేయడమే ..ఉదాహరణ; నిన్న శివరాత్రి పర్వదినం సందర్భం గా నేను త్వరగా ఇంటి పనులు ముగించుకొని ఎపుడెపుడు నా పూజ గది లో కి వెళ్ళాలా అనే తొందర లో , నేను ఆ పనులని విసుగు తో త్వర త్వర గా చేయ సాగాను. అప్పుడు సాయి సంకల్పం తో ఒక ఆలోచన వచ్చింది..ఏమిటీ యింత కంగారు పడుతూ అశాంతి పొందడమెందుకు, నేనిపుడు కడుగుతోన్న గ్యాస్ స్టవ్ నే శివ లింగం గ భావించొచ్చు అనుకుని భక్తి తో శివుడిని మనసులో తలుస్తూ , భావిస్తూ , ఆ పనులని చేసుకుని, తల స్నానం లో ను ,శివ లింగాన్ని స్మరిస్తూ అభిషేకం చేస్తోన్నట్లు ఫీల్ అయ్యాను. ఫలితం గా ఎంతో శాంతి అనుభవించాను. ఇక్కడ ఏంటంటే, పూజ చేయడం ఒక్కటే నిజమయిన పూజ కాదు. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితి లో వున్నా, చేసే ప్రతి పని ని ప్రేమ తో చేస్తే ఆ ప్రేమ మన ప్రేమాస్పదుడయిన భగవానుడికి తప్పకుండా చేరుతుంది. మనం పూజ లో, ఎన్ని ఆడంబరాలు చేయాలి , ఎన్ని నైవేద్యాలు పెట్టాలి అనే కంగారు అవసరం లేదు.భక్తి తో ఒక పండు అయినా ఇచ్చినా సాయి కి యిష్టము. సాయి మన ప్రేమ ని మాత్రమే చూస్తారు, సాయి కి ఇంకేమి అవసరం లేదు..”నేను నీ గూర్చే ఎదురు చూస్తున్నాను. నీ నుండి ప్రేమ, వాత్సల్యం నాకు కావాలి ” అని ఆ సాయి నాధుడే నోరు తెరిచి మనలని అడిగినా మనం పట్టించుకోకుండా అపుడపుడు భౌతిక విషయాల కోసం మన ప్రేమ మూర్తి అయిన దైవాన్ని విస్మరిస్తున్నాము.. మానసిక ఉల్లాసం కోసం ,ఎప్పుడు సాయి భజనలేనా , అని ఒకోసారి సినీ సంగీతం కోరుతుంటోంది మనసు,..అయితే ఇక్కడా పాడుకోవచ్చు ఏ సాంగ్ అయినా , కానీ మన మనసు సాయి కి అర్పితం అయినప్పుడు, ఏ శ్రావ్యమయిన సినీ సంగీతం అయినా భగవంతుడి కోసమే అన్నట్లు పాడుకున్నా, ఆ భావన భగవంతుడికి చేరుతోంది.. అలాగే నృత్యం చేస్తోన్నా, భగవంతుడి భక్తి అనే తాధ్యాత్మము తో, శరీరం పులకించి నృత్యం చేస్తుంటే, ఆ నృత్యమూ భగవంతుడి కి నివేదన లాంటిదే. జీవితం లో ని ప్రతి క్షణాన్ని యిలా సాయి సన్నిధి లో, ఎంజాయ్ చేస్తూ జీవించవచ్చు ఏ చింతా లేకుండా. వైరాగ్యం అంటే ఉన్నజీవితాన్ని బాధలో నిర్లిప్తం గా బ్రతకడం కాదు. జీవితం భగవంతుడి ప్రసాదం అని భావిస్తూ, ప్రతి పని భగవారాధన అనే భావన తో, వుత్సహం గా , ఉల్లాసం గా, దైవ సేవ చేసుకోవడం.
భగవంతుడి కోసం ఇంత ఖర్చుపెట్టి ఇన్ని చేసాము అని కాకుండా, దేవానికి ఒక పండు అయినా భక్తి గా సమర్పించుకుని, పేద వారికి అపుడపుడూ మీ ముంగిలి లో కూర్చోబెట్టి భోజనం పెట్టినపుడు , వారి కళ్ళు తడి తో మనలని కృతజ్ఞత తో చూస్తుంటే, మనకి కలిగే సంతృప్తి మనం ఏమిచ్చినా కొనలేనిది..ఆకలి బాధ అనేది అనుభవించేవారికి తెలుస్తుంది.” ఆకలితో వున్నవారికి పట్టెడన్నం పెడితే నాకు భోజనం పెట్టినట్లే” అని సాయి చెప్పినధీ మనం గుర్తుంచుకోవాలి..అలాగే ఆకలితో ఉన్న ప్రాణులనీ ఆహరం పెట్టి సంతృప్తి పరిచి ఆ సాయి కి నిజమయిన సేవ చేసుకుందాము. ఇంటి ముందుకొచ్చిన బిచ్చగాళ్ళని కసురుకొని వారి మనసు గాయ పరచకుండా, మనం తినేదాంట్లో కొంచం వారికిస్తె, వారి ఆకలి తీర్చే అవకాశం మనకి కల్గిందని సంతోషించొచ్చు. వారి దీవెనలు మనం సంపాదించుకునే పుణ్యం..వారిని కసిరినప్పుడు వారి మనసు పడే క్షోభ మనకి పాపం తెచ్చి పెడుతుందని గుర్తుంచుకుందాం.. ఈ విషయాలని ఈరోజు నుండే పాటిస్తూ సాయి ప్రేమ కి పాత్రులమవుదాం..లోకానికి ప్రేమని పంచాలన్న సంకల్పం ఉదయించిన రోజే, అసలయిన ప్రేమదినొత్సవము ..సాయిరాం.