“సకల దేవతా స్వరూపుడు” సాయి

44180469_2151746104843692_6924223893813067776_o.jpg

బాబా యే విఠలుడు : రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని 1913లో శిరిడీ వెళ్ళాడు. ఆమె విఠలుని  భక్తురాలు గనుక త్వరగా పండరి వెళ్ళాలని అతనిని వత్తిడి చేయ పాగింది. అప్పటినుండి సాయి ఆమెతో, “నీవు పండరి ఎప్పుడు వెళతావు?” అని పదేపదే అడగసాగారు. ఒకరోజు ఆమెను పండరి తీసుకెళ్ళడానికి బాబా అనుమతి కోరదలచాడు పురందరే. నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మిణీ సమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చారు. అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసమేర్పడి, శిరిడీయే తనకు పండరి అని బాబాకు సమాధానమివ్వసాగింది.

బాబా యే శ్రీరాముడు : ఒక మమల్తదారుడు, ఒక డాక్టరును తనతో కూడ సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు. ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవ్వరికీ మొక్కేవాడుకాదు. ఫకీరైన సాయికి మొక్కడం తనవల్లగాదనేవాడు. ఆయనకు మొక్కాలన్న నిర్భంధమేమీ లేదని చెప్పాకనే అతను గూడ శిరిడీ వెళ్ళాడు. కాని మశీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాల పై వ్రాలి తన్మయత్వంతో అనంద భాష్పాలు కార్చాడు. అతడు లేవగానే, “పిచ్చివాడా! రాముడెక్కడ లేడు? చూడగలితే అంతటా వున్నాడు, లేకుంటే ఎక్కడాలేడు!” అన్నారు సాయి. తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమయింది. తర్వాత ఆ డాక్టరు చెప్పాడు: “సాయి నాకు శ్రీరామునిగా కన్పించారు. నమస్కరించి లేచేసరికి సాయిగా కన్పించారు. ఆ యిద్దరూ వేరుగాదు” తిరిగియిల్లు చేరాక రెండు వారాల వరకు అతనికి ఆ పారవశ్యం అలానే వున్నది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మీ అనే భక్తురాలికి గూడ సాయి యిలాంటి దర్శనమే ప్రసాదించారు .

బాబా యే దత్తాత్రేయుడు  ; సం. 1911లో దత్త జయంతినాడు సాయంత్రం 5  గంటలకు  బాబా అకస్మాత్తుగా. “నేను ప్రసవవేదన భరించలేకున్నాను!” అని అరిసి భక్తులందరినీమశీదునుండి తరిమివేశారు. కొద్ది సేపు తర్వాత అందరినీ మసీదులోకి పిలచారు. అలనాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవి తో బాబా తాదాత్మ్యం చెందారని భక్తులు అనుకున్నారు.అప్పుడు మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు.

అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన యిద్దరు భక్తులలో ఒకరినుండి రూ. 15/- లు దక్షిణ అడిగి తీసుకున్నా బాబా, కానీ రెండవ భక్తుడిచ్చిన దక్షిణ తీసుకోలేదు. అందుకు కారణమడిగిన శ్యామాతో బాబా యిలా చెప్పారు : “శ్యామా, నీకేమీ తెలియదు. నే నెవరినుండీ ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావలసిన ఋణాన్ని అడిగి తీసు కుంటుంది. ఇల్లు, కుటుంబము లేని నాకు పైకమెందుకు? అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా యిస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు. త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది. అతని మొదటి నెల జీతం రూ. 15/-లు. ఇప్పుడతని జీతం రూ. 700/- లు. కష్టం గడవడంతో అతడు మొక్కును మరచాడు. ఋణము, శతృత్వము, హత్య – వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు. అందుకే అతనినుండి రూ. 15/- లు అడిగి తీసుకున్నాను” అన్నారు. తాను మొక్కిన దత్తస్వామియే సాయి. అని ఆ భక్తుడు తెలుసుకున్నాడు.

అలానే బాబా సాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానాచందోర్కర్ మాటను త్రోసివేయలేక, 1900లో సాయిని దర్శించాడేగాని లోలోపల ఆయన ముస్లిం అన్న శంక వున్నది. కాని మశీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు. అంతటితో అతడు తన జీవితమంతా సాయి సేవకే అంకితం చేసాడు.

బాబా యే మారుతి : ఎప్పుడూ సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పనిమీద అహ్మద్నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ని ఆయన సేవకు వినియోగించాడు. అప్పుడొక రోజు తనకు కల్గిన అనుభవం గురించి అతడిలా చెప్పాడు , “సాయి స్థానంలో ఆయన రూపంలేదు. మారుతియే వున్నారు. అయితే ఆయనకు తోక వున్నదో లేదో నేను చూడలేదు. మసీదు మెట్ల పై కూర్చొనివున్న శ్యామాతో, అరుగో మారుతి, దర్శించుకో!’ అని చెప్పాను” అప్పటినుండి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు.

బాబా యే విఘ్నేశ్వరుడు : చిదంబరరావు గాఢిల్ అనే గణపతి భక్తుడు శిరిడీ దర్శించి, అప్పటినుండి యింటిదగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతను శిరిడీ వచ్చినపుడు ఆయన నవ్వి, “ ముసలాడు చాలా టక్కరి. ఎలుకే నా వాహనమని కని పెట్టాడుఅన్నారు.

ఒకసారి బాంద్రా నుండి ఒకామెవచ్చి సాయికి నమస్కరించి, ఆయన ఎదుట కూర్చోగానే, ఆమెను 7 సం లుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, “అమ్మా! నీ చిన్నతనమునుండి నాకు సమృద్ధిగా అన్నీతినబెడుతున్నావు” అన్నారు. ఆమెకేమీ అర్థంకాలేదు. బాబా నవ్వుతూ, నీవెవరిని పూజిస్తావు” అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిందామె. సాయి “నీవు అర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి” అన్నారు. విఘ్నేశ్వరుడు బోజనప్రియుడు. ఆ గణపతియే తామని బాబా సూచించారు.

బాబా యే నరసింహస్వామి : సదాశివజోషీ నిత్యమూ సాకేవాడాలో ఆరతికి హాజరయ్యే వాడు. ఒకప్పుడతనికి అక్కడ సాయి పటంలో వరుసగా మూడు రోజులు నరసింహస్వామి దర్శనమయింది. తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది, కొద్ది మిఠాయి ప్రసాదమిచ్చారు బాబా. అది చాలదంటే బాబా అతనికి 8 అణాలు యిచ్చి, “శిరిడీలో ఎక్కడైనా మిఠాయికొని తీసుకుపో, అదీ నా ప్రసాదమే!” అన్నారు. ఆయన సన్నిధిచేత పవిత్రమైన శిరిడీలోని పదార్థమంతా ఆయన ప్రసాదమే!

బాబా యే ఖండోబా : మహల్సాపతి కుమారుడు మార్తాండ్’ ఒకరోజు ఖండోబా ఆలయద్వారం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు.  అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడచి, అందులో లీనమయ్యారు. మార్తాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూచాడు. అక్కడెవరూలేరు. తిరిగి విగ్రహంనుండి బాబా వెలువడి, చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటకు వెళ్ళిపోయారు. నాటినుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు.

ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి, 1907లో గయలోని త్రివేణీ సంగమంలో శ్రాద్ధ  ప్రదానం చేసాడు. నడి మధ్యకు వెళ్ళి ఆ పిండాన్ని వదలగానే, అకస్మాత్తుగా రెండుచేతులు నీటి పైకివచ్చి దానిని స్వీకరించి మరల నదిలోకి అదృశ్యమయ్యాయి. అతనికి ఒకవంక అమిత సంతోషము, మరోవంక వీపరీతమైన భయమూ కల్లాయి. తర్వాత 1912లో అతడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ శిరిడీ చేరాడు. అతనిని చూచి నవ్వుతూ సాయి, “మరల ఎంతకాలానికి కన్పించావు! అన్నారు. తానదే ప్రథమం గదా శిరిడీ రావడం అనుకొంటుంటే ఆయన,“ఎందుకంత ఆలోచిస్తావు? నీవా గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులివిగావూ? గుర్తులేదా?” అంటూ చేతులు చూపారు! పట్టలేని ఆనందము, కృతజ్ఞతలతో అతని కళ్ళవెంటఆనందభాష్పాలు రాలాయి.

సేకరణ : శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి “శ్రీ సాయి లీలామృతం” గ్రంధం

 

 

1 thought on ““సకల దేవతా స్వరూపుడు” సాయి

  1. Chala baaga raasavu.keep it up.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close