భక్తులు:దేవుళ్ళను గుడికి వెళ్ళి పూజిస్తే మంచిదా? మనసులో తలచుకుంటే మంచిదా?
గురుదేవులు: దేవుళ్ళను గుడికి వెళ్ళి పూజిస్తే మంచిదా?మనసులో తలచుకుంటే మంచిదా? అంటే పూజ ఎప్పుడూ మనసులోనే మంచిది. మనసులో పూజించటం నిరాకారం అన్నమాట. మనసులో నిరాకారమైన దేవుడికి పూజ చెయ్యాలి. పూజ అంటే ఏమీవుండదు మనసులో భావనే. మనసులో పూజించటం అనేది నెంబరు 1, శ్రేష్ఠం అది. అయితే దీని గురించి చరిత్ర తెలుసుకోవాలి.
చరిత్రలో అసలు విగ్రహాలు లేవు. విగ్రహారాధన భారతదేశంలో మొట్టమొదట లేదు. చారిత్రిక కారణాల వలన బుద్దుని కాలంలో ప్రజలు ఆధ్యాత్మికమయిన ఒక తిరుగుబాటు చేశారు. బుద్దుడు వాటినన్నింటిని సమర్థించాడు. భౌద్దమతం భారతదేశంలో ” బాగా వ్యాపించింది ఒకానొక టైం లో . అప్పుడు ఈ బుద్దుని అనుయాయులు ఏంచేశారంటే దేవుడెక్కడున్నాడో మనకి తెలియదు, ఈయనే దేవుడు అని ఆయన విగ్రహాలు పెట్టారు. మొట్టమొదట భారతదేశంలో ఒక మనిషి విగ్రహం తయారైంది గౌతమ బుద్దుడిదే. సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ కి ఇది తెలుస్తుంది. భారతదేశం మొత్తంమీద మొట్టమొదటగా మనిషిదిగానీ, దేవుడిది గానీ ఒక విగ్రహం అనేది తయారైంది అంటే అది గౌతమ బుద్దుడిదే. అందరూ బౌద్దమతంలోకి వెళ్ళేటప్పటికి ఆచారవంతమైన ఈ విధానంలో కూడా ఏమైందంటే రాముడు, కృష్ణుడు వాళ్ళని తయారుచేయవలసి వచ్చింది. రామ, కృష్ణుల విగ్రహాలు బుదుడి విగ్రహం తర్వాతే వచ్చినవి. చరిత్ర చదువుకున్ననవారికి, దానిమీద రీసెర్చి చేసిన వారికి ఈ విషయం తెలుస్తుంది. తర్వాత తర్వాత విగ్రహారాధన వచ్చింది. మనం కూడా ఇప్పుడు బాబావారి విగ్రహాలు ప్రతిష్ట చేస్తున్నాము కదా. ఇదొక విధానం వచ్చేసింది..
భక్తులు: అసలు పుణ్యం జమకాని వ్యక్తి ఇతరులను శపిస్తే అది జరుగుతుందా?
గురుదేవులు: పుణ్యం జమకాని వ్యక్తి ఎన్ని తిట్టినా ఏమీ ” అవ్వదు. నీ దగ్గర పుణ్యబలం ” కొద్దిగా వుంటే నువ్వు ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది. పుణ్యబలం లేని మనిషి ఏమనుకున్నా అది జరగదు. నువ్వు అనుకున్నంత మాత్రాన ఏమీ అవ్వదు. ప్రపంచమంతా నాశనమైపోవాలి అనుకో ఏమీ అవ్వదు, ఒకవేళ అయితే నువ్వు నాశనమవుతావు. ఎందుకంటే నాశనం చేయటానికి శక్తి లేదు కదా ,అది నీవైపు తిరుగుతుంది. అందుకని పొరపాటున ఎప్పుడు ఎవరికీ అపకారం చెయ్యకండి. చెయ్యాలని కూడాఅనుకోకండి.