శ్రీ సాయినాథాయనమః
సాయినాధుడు తన వద్ద కు వచ్చే భక్తులను దక్షిణ అడుగుచుండేవాడు. భక్తుల వద్ద ఒక్కొక్కరిని ఒక్కో మొత్తం అడిగేవాడు. ఒకవేళ వారి వద్ద బాబా అడిగిన పైకం లేకపోయినట్లయితే, ఎవరివద్ద నుండి అయినా అడిగి ఇవ్వమనేవాడు భక్తులు యివ్వదలచుకున్న మొత్తం నుండి తాను వారి వద్ద నుండి ఎంత తీసుకోవాలనుకున్నారో అంతే తీసుకుని మిగితా మొత్తం వారికే తిరిగి ఇచ్చేవాడు .బాబా కి దక్షిణ సమర్పించుకునే అదృష్టం పొందిన వారికీ మేలు జరిగెడిది. ఇహము మరియు పరము విషయాల్లో కూడా భక్తుల మేలు కొరకే బాబా దక్షిణ అడిగే వారు . బాబా కి ఒక రూపాయి దక్షిణ మనం సమర్పించుకుంటే, దానికి పది రేట్లు బాబా మనకి తిరిగి ఇస్తారు. “నేను ఎవరివద్దనయినా ఒక రూపాయి తీసుకుంటే, దానికి పది రేట్లు వారికీ తిరిగి ఇచ్చెదను ” అనే బాబా భక్త వత్సలత ఈ నాటికీ భక్తులకి నిరూపితం అవుతోంది పలు సందర్భాల్లో ..దీనికి ఎన్నో ఉదంతాలు నేను చూసాను. నా విషయం కి వస్తే,నేను నా చిన్నప్పటి నుండీ బాబా మందిరాలకు అపుడపుడు నా పాకెట్ మనీ లో నుండి కొద్దీ మొత్తం ఎం.ఓ చేసేదాన్ని. తరువాత నాకు బాబా దానికి పదింతలు శాలరీ వచ్చే వుద్యోగం ప్రసాదించి నన్ను పోషిస్తున్నారు.
అలాగే భక్తులు ధనం విషయం లో లోభం, వ్యామోహం ఎంత వరకు వదిలిపెట్టారో పరీక్షించడానికి కూడా బాబా భక్తులను దక్షిణ అడిగేవాడు.బాబా భక్తులను దక్షిణ అడగడం , వారికి ధనం పట్ల వైరాగ్యం నేర్పడానికి, మరియు వారి మనసులను శుభ్ర పర్చడానికే, ఈ విధం గా దక్షిణ చెల్లించడం ద్వారా భక్తులు ఎంతో మేలు పొందుతారు .బాబా ఒక భక్తుడిని మాటి మాటి కీ దక్షిణ అడుగుతుండటం తో , ధనం దాచుకునే సంచీ తీసి బాబా ముందు గుమ్మరిస్తాడు , ఆ తరువాత ఆ భక్తుడు తన జీవితం లో ఎప్పుడు కూడా లోటు ని అనుభవించలేదు
తాను గా బాబా కి దక్షిణ ఎవరయినా సమర్పిద్దామనుకున్నా, ఒక్కోసారి బాబా తీసుకోక తిరస్కరించేవారు. “ఈ మసీదు తల్లి ఎవరికి రుణపడి ఉండునో వారి వద్ద నుండే నేను దక్షిణ స్వీకరించెదను ” అని బాబా అంటారు. నేడు కూడా ,మనకి బాబా కి దక్షిణ ఇవ్వాలనే ఆలోచన వచ్చి,బాబా కి దక్షిణ చెల్లించడము అంతా వారి సంకల్ప ప్రకారమే. ఎవరయినా బాబా కి దక్షిణ సమర్పించాలనుకొని మర్చి పోతే బాబా వారికీ ఆ విషయం జ్ఞాపకం తెచ్చి మరీ దక్షిణ స్వీకరిస్తారు.అలాగే,ఎంత దక్షిణ ఇవ్వాలనుకున్నామో , అంతే దక్షిణ మనం చెల్లించేవరకు వూరుకోరు సుమా ! అది బాబా భౌతికం గా షిరిడి లో వున్నప్పటి కాలం లోనూ మరియు నేటికీ కూడా.
బాబా సమకాలీన భక్తుడు ప్రధాన్ షిరిడి సందర్శినప్పుడు జరిగిన విషయం ఇలా చెప్పారు..
”మొదటిసారి నేనొక్కడినే శిరిడీ బయలుదేరాను. అపుడు నాతో మూడు లేక నాలుగు బంగారు నాణాలు (‘గినియా’), కొద్ది నోట్లూ తీసుకున్నాను. బాబా దక్షిణ కోరితే యివ్వాలని ఒక నోటు మార్చి 20 రూపాయి నాణాలు తీసుకున్నాను. మేము శిరిడీ చేరేసరికి, మాకోసమే ఎదురుచూస్తున్నారా అన్నట్లు బాబా లెండీవద్ద నిలబడి వున్నారు. మేము వెంటనే బండి దిగి వారికి నమస్కరించాము. తరువాత మేము వాడాలో సాఠె, నూల్కర్ మొన వారితో కలిసి బస చేశాము. తరువాత కొద్ది సేపట్లో నేను పండ్లు, పూలు తీసుకొని మసీదుకు వెళ్ళి బాబాకు సమర్పించాను. వారి ముఖంలోకి, కళ్ళలోకీ చూడగానే ఆయన నిస్సందేహంగా గొప్ప మహాత్ముడనిపించింది. వారి దర్శనం ప్రసాదించినందుకు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకొన్నాను. వెంటనే బాబా నన్ను దక్షిణ కోరారు. మొదట నేను అనుకొన్నట్లు వారికి వెండి రూపాయలు సమర్పించే బదులు ఒక బంగారునాణెం వారి చేతిలో పెట్టాను. బాబా ఆది తీసుకుని తమ అరచేతిలో ఒకసారి బొమ్మ; మరొకసారి బొరుసు అని పైకి వుండేట్లు మూడుసార్లు త్రిప్పిచూస్తూ ప్రతిసారీ నూల్కర్ ను ‘ ఇదేమిటి?’ అని అడిగారు. దీనిని “గినియా’ అంటారు’ అన్నాడు నూల్కర్. ఆయన * దీని విలువెంత?’ అన్నారు. అతడు, రు.15/-లు అని చెప్పారు. అపుడు బాబా దానిని తిరిగి యిచ్చి ‘ఇది నాకు వద్దు, యిది నీవద్దే వుంచుకుని నాకు రు.15/-లు యివ్వు’ అన్నారు. నూల్కర్ సలహా ప్రకారం దానిని ప్రసాదంగా దాచుకొని పదిహేను వెండి రూపాయి కాసులు యిచ్చాను. బాబా వాటిని తిరిగి తిరిగి లెక్క పెడుతూ, ‘ఇవి పది రూపాయిలే! ఇంకా అయిదు రూపాయిలివ్వు’ అన్నారు. నిజానికాయన నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. వృత్తిరీత్యా వాదించడానికి అలవాటుపడ్డ నేను వాదిస్తానో లేదోనని చూస్తున్నారు. నేను సంతోషంగా వారికి మరో అయిదు రూపాయలిచ్చారు. నేను వారికి మొదట సమర్పిందలచినది రు. 20/-లు అని తెలిసే వారలా అన్నారు. నావద్ద డబ్బున్నా ఆయనింకేమీ అడగలేదు. అపుడు నేను బసకు వెళ్ళిపోయాను.”
అందుకే బాబా కి మనం దక్షిణ సమర్పించుకోవాలనే సంకల్పం మనలో ఉదయించినప్పుడు ఇక ఆలస్యం చేయక వెంటనే సమర్పించుకుంటే మంచిది. నేను ఈ మధ్య బాబా సచ్చరిత్ర పారాయణ చేసి బాబా కి దక్షిణ పారాయణ చివరి రోజున షిరిడి కి ఎం.ఓ చేద్దామనుకుని పక్క కి తీసి పెట్టి కూడా, పోస్ట్ ఆఫీస్ కి వెళ్లే తీరిక లేక ఎన్నో రోజులు పూజ గది లో ని బాబా పీఠం పై నే ఉంచేసాను.. షిరిడి కి బాబా శతాబ్ది ఉత్సవాలకు వెళ్ళినప్పుడు, ఆ మొత్తం తీసుకెళ్ళాను కూడా షిరిడి లో దక్షిణ కౌంటర్ లో దక్షిణ సమర్పిద్దామనుకుని. కానీ చిత్రం గా అక్కడికెళ్ళాక కూడా ఆ పని చేయలేకపోయాను. ఆ మూడు రోజులు మూడు నిమిషాల్లాగా బాబా ఉత్సవాలు,దర్శనాలు వీటిలో గడిచిపోయింది, దక్షిణ కౌంటర్ కి వెళ్లే సమయం చిక్కలేదు. కానీ బాబా ఊరుకుంటాడా, తనకి రావాల్సిన దక్షిణ ఎలాగయినా స్వీకరించే తీరుతాడు. నెళ్లురు జిల్లా వాకాడు కి చెందిన ,సాయి బంధువు హేమంత్ గారి ద్వారా బాబా తనకి రావాల్సిన దక్షిణ గుర్తు చేశారు. వారు నాకు దక్షిణ ఇంట్లో నుండే బాబా కి ఆన్లైన్ లో పంపే విధానం చెప్పడం జరిగింది . దాని గూర్చి ఇప్పటిదాకా నాకు అవగాహన లేదు. “దాన్ని మీ వెబ్సైటు లో అందరి ఉపయోగార్ధము ప్రచురించండి” అన్నారు. అలా ,నేను షిరిడి నుండి వచ్చాక కూడా, పోస్ట్ ఆఫీస్ కి వెళ్లే తీరిక లేని నాకు బాబా తనకి దక్షిణ చెల్లించే సుగమోపాయంకూడా తానే నాకు హేమంత్ గారిద్వారా చెప్పారని అనిపించింది.వారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.వారు నాకు పంపిన ఆ మెసేజ్ యధాతధం గా మీకోసం..
“షిరిడీ కి దక్షిణ పంపడం ఎలా? ..ఇప్పుడు ఆన్లైన్ లో పంపవచ్చు .ఉదాహరణకు:sbi ఆన్లైన్ లో థర్డ్ పార్టీ ట్రాన్సక్షన్ లో మేక్ ఏ డొనేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసిన, చాలా సంస్థల విరాళముల అడ్రెస్ లు వస్తాయి .అందులో షిరిడీ సంస్థాన్ వారివి చాలా ఉన్నాయి. దానిలో జనరల్(genaral) డొనేషన్ ఆప్షన్ లో మీ అడ్రెస్ మొత్తం టైప్ చేసి మీరు పంపవలసిన ధనం ను టైప్ చేసి పంపవచ్చు…50 rs పైన పంపేవారికి షిరిడీ సంస్థాన్ వారు వూది ప్రసాదం పంపుతారు. నెలకు ఎంతో కొంత బాబా కు దక్షిణ పంపాలి అనుకొనే వారికి ఇది చాలా సులువు..దక్షిణ (ఎంత చిన్న దైన) ప్రతినెలా పంపడం మన శ్రద్ద లో ఒక భాగం…..”
ఈ విధం గా మీరందరూ బాబా కి సమర్పించుకుందానుకున్న దక్షిణ ,తాత్సారం చేయకుండా , వీలయినంత త్వరగా ఆన్లైన్ లో పంపించి , సాయినాధుని ఆశీస్సులు పొందండి. జై సాయిరాం.