సాయిబాబా 1918 లో మహా సమాధి చెందినా, ఇప్పటికీ తన మహిమ , ఉనికి ని తన భక్తులకు నిరూపిస్తునే వున్నారు. బాబా తన శరీరం మాత్రమే వదిలారు .కానీ వారు చైతన్యం తో నేటికీ మన చుట్టూ ఉండి మనలను అనుక్షణం గమనిస్తూ , కాపాడుతూ మరియు ఎవరికి కావాల్సిన ఆధ్యాత్మిక శిక్షణ ని వారికి యిస్తూ వున్నారు.శరీరం తో వున్నప్పుడు భక్తులతో బాబా కి వుండిన అనుబంధం, వారు శరీరం విడిచినా అలాగే కొనసాగుతోంది. ఈ క్రింది లీలలు ఆ విషయాన్ని నిరూపిస్తాయి .
- కాక మహాజని కి నవంబర్ 13 న స్వప్నం లో సాయి కనిపించి , “నేను సమాధి చెంది నెల అయ్యింది , మాసిక పూజ చేయుము” అని ఆదేశించారు .అతడు నిద్ర లేచి చూస్తే ఆ మాట అక్షరాలా నిజమయ్యింది .ఆరోజు అతను సాయి ని పూజించి ప్రధాన్ , కాకా దీక్షిత్ , హేమాడపంత్ లకు భోజనం పెట్టాడు.
- అలాగే, నాగేష్ అనే భక్తుడు సమాధి పక్క గది లో నిద్రించేవాడు .అప్పుడతనికీ తోటి వారికీ బాబా సమాధి నుండి రక రకాల సంగీతం వినిపించేదట.
- కే,కే ప్రధాన్ కు అనేకసార్లు బాబా గురుస్థానం లో సాయి భౌతికం గా దర్శనమిచ్చారు .
- ఒకప్పుడు తాత్యా తీవ్రమయిన ఉబ్బసం తో బాధపడ్డాడు . వైద్యుడు మందు ఇచ్చి దాని ని అంజీర పండ్ల రసం తో తీసుకోమన్నాడు .అది ఆ పండ్లు దొరికే కాలం కాదు, ఒకరోజు ఆరాతయ్యాక, అతడింటికి వస్తూ ,” ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదా?.ఇప్పుడు ఆ పండ్లు దొరకవు కదా , ఏమి చెయ్యాలి ?” అనుకున్నాడు .ఆశ్చర్యం !!తలుపు తెరిచేసరికి , పూజ లో బాబా పటం వద్ద అపుడే కోసిన 14 అంజీరాలున్నాయి ! తన కి కావాల్సిన వాటిని తన ఇంట్లో నే తెచ్చిపెట్టిన బాబా ప్రేమ ని అనుభవించి అతడు ఎంతో ఆనందించాడు .
- ఒక చైత్ర మాసం లో, దాసగను షిర్డీ లో 17 రోజులు హరికథ చెప్పాడు .ఒక రోజు బాబా పాదాలనుండి గంగా–యమునా జలాలు వచ్చిన లీల విని కొందరు భక్తులు నమ్మలేదు. చిత్రం! నాటినుండి కొన్నిరోజులు సమాధి పడమర అంచున నీరు సన్నని ధారలా కారింది. అదెక్కడి నుండి వస్తున్నదో ఎవరికీ తెలియలేదు.
- సాయి దేహంతో వున్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తిశ్రద్ధలతో పూజించలేకపోయానని శ్యామా పరితపించాడు. ఆయన ప్రసాదించిన ఉదీ పొట్లం ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు. అతడు బొంబాయి వెళ్ళినపుడు ఒకరాత్రి బాబా కలలో కన్పించి, “నేనిచ్చిన ఉదీ పొట్లం రోడ్డుప్రక్కన చెత్తకుండీలో వున్నది. త్వరగా వెళ్ళు!” అని హెచ్చరించారు. శ్యామా యిల్లుచేరి చూస్తే పూజలో ఆ పొట్లంలేదు, ఇల్లు సర్దడంతో దానినెవరో తీసారు! ఇంటిప్రక్కనున్న చెత్తకుండీలో చూస్తే పొట్లం దొరికింది.తన భక్తుల పట్ల బాబా కి ఎంత అప్రమత్తతో చుడండి !!
- సం, 1942 నుండి శిరిడీవచ్చే భక్తులసంఖ్య పెరగవొచ్చింది. వారికోసం వసతిగృహాలు నిర్మించడానికి సంస్థానంవారు గురుస్థానం దగ్గర భూమిని కొనదలిచారుగాని, కేశవనారాయణ కులకర్ణి అది అమ్మనన్నాడు. వారు సాయికి మొర పెట్టుకోగా, తరువాతి గురువారంరోజు రాత్రి కులకర్ణి కి కలలో బాబా కన్పించి, “నిజానికాభూమి నాది; అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము, నీకు మూడింతలు లాభమొస్తుంది” అన్నారు. అతడు వెంటనే సంస్థానానికే అమ్మాడు. ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ ఆసామి అమ్మనన్నాడు. ఆ ఆసామికి కలలో బాబా కన్పించి, ఆ స్థలం అమ్మమని చెప్పారు. ఆ వ్యవహారం వలన కులకర్ణి కి మూడురెట్లు లాభమొచ్చింది.
- మహాసమాధి తర్వాత గూడ సాయి పల్కుతున్నా, అది ఆయన శరీరంతో వున్నదానితో సమానంగా కాదనుకొంటాము. దాసగణుతో కలసి 1924 లో శ్రీరామనవమికి శిరిడీ వెళ్ళి తిరిగి వస్తున్నారు రామచంద్ర పాఠేవర్, అతని భార్య. మధ్యలో శ్రీమతి పాఠేవర్ కి దాహమేస్తుంటే రైలుదిగి, దూరాన పంపు దగ్గరకు వెళ్ళగానే రైలు కదిలింది. ఆమె తొందరగా ఒక పెట్టెలో ఎక్కబోయి కాలుజారి, రైలుకూ, ప్లాట్ ఫారంకూ మధ్యలో పడిపోయింది. అందరూ కేకలు పెట్టి, గొలుసులాగారు. రైలు కొంచెం ముందుకుపోయి ఆగింది. ఆమె భద్రంగా ప్లాట్ ఫారం పైకెక్కి, కంగారుపడుతున్న జనంతో యిలా చెప్పింది : “కాలు జారగానే నాకేమీ తోచక బాబాను తలచాను. ఆయన నా ప్రక్కనే కనబడి, తమ చేతితో నన్ను ప్లాట్ ఫారం క్రిందకు అదిమిపట్టి, నా ప్రక్కనే వున్నారు. కనుక నాకిక భయమేయలేదు. నేను పైకొచ్చేవరకు ఆయన కనిపిస్తూనే వున్నారు!”ఈ విధం గా తన భక్తురాలిని ప్రమాదం నుండి బయట కి లాగడానికి స్వయంగా శరీరం తో దర్శన మిచ్చి, ఆమె ని కాపాడి ధన్యురాలిని చేసారు బాబా
సాయినాధుడి లీలలు చిత్రాతి చిత్రములు !!
సేకరణ : శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి కృపాశీస్సులతో