జై సాయినాదా !!
విశ్వాసం తో వున్నవారికి “సర్వ రోగ నివారిణి- సర్వ శక్తి ప్రదాయిని ” అయినటువంటి సాయి విభూతి మహిమ ని తెలుసుకుందాము.
పోలీసు ఆఫీసర్గా రిటైరయిన బి. ఉమామహేశ్వరరావుగారికి 1960 నుంచి గుండె జబ్బు, తరచుగా గుండెనొప్పితో 2,3 రోజులు స్పృహ లేకుండా వుండేవారు. వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు గాని ఆయన యిష్టపడలేదు. బంధువుల ప్రోద్బలంతో 1980లో శిరిడి దర్శించి అక్కడొక చిత్రమైన అనుభూతి పొంది, నాటినుంచీ సాయిని ప్రార్థిస్తున్నారు. సెప్టెంబరు 1983లో ఆయన గుండెనెప్పితో స్పృహ కోల్పోయారు. నాడి 40కి పడిపోయింది. 3వ రోజు తెల్లవారుఝామున 3 గం.లకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట ఉదీ పెట్టి, బాధ తగ్గుతుందని చెప్పారు. ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు. కలలో విభూతి పెట్టబడినదానికి గుర్తు గా,ఆయన నొసట విభూతి వున్నది. తరువాత ఆయనకు గుండెనొప్పి రాలేదు. నవంబర్ 16, 1983 రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తుండగా ఆ పటంనుండి చిత్రమైన కాంతి వారి గుండెమీద పడి, శరీరంలో కరెంట్ ప్రవహించినట్లయింది. చూస్తే,వారి ఎడమ రొమ్ముచుట్టూ వలయంలో చర్మం కాలినట్లు మచ్చవున్నది. అప్పటినుంచీఆయన ఆరోగ్యంగా వున్నారు.
నవంబర్ 28, 1984న ఆయనకు బాబా కలలో కన్పించి, “రేపు నీకు గండమున్నది. బంధువులను పిలిపించుకో! నేనున్నాను, భయంలేదు” అన్నారు. ఉదయమే అందరూ సిద్ధంగా వున్నారు. ప్రొద్దునే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు. హాస్పిటలకు తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు. వారి శ్రీమతి బాబాను ప్రార్ధించాక ఆయన కోల్కొని, అప్పటి నుండి సాయి సేవ చేస్తున్నారు.
సేకరణ : శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి కృపాశీస్సులతో