ఈ ఆరతుల ప్రత్యేకత ఏమిటి?
నాగపూర్ జిల్లాలోని బోరీ గ్రామస్తుడు, కృష్ణ శాస్త్రి జగదీశ్వర్ భీష్మ కు 1908 శ్రావణ మాసం లో, ఒక రాత్రి స్వప్నంలో, ముఖాన త్రిపుండ్రము, వంటినిండా చందనము కల ఒకనల్లని బ్రాహ్మణుడు కన్పించి ఒక వార్తా పత్రిక చూపించాడు. దాని పై “సచ్చిదానంద” అనే అక్షరాలు తరువాత “మంత్ర వ -శికావా” (“మంత్రము మరియు నేర్చుకో!’) అన్న వాక్యమూ కన్పించగానే కల ముగిసింది. తర్వాత దానివిషయమై అతడు ఒక సాధువును అడిగితే, సచ్చిదానంద స్వరూపియైన సద్గురువే అతనిని అనుగ్రహించగలడన్న దివ్య సంకేతమే ఆ స్వప్నమని చెప్పాడు.
కొంతకాలానికి అతడు దాదాసాహెబ్ఖాపర్డేతో కలిసి శిరిడీ వెళ్ళాడు. బాబా అతనిని చూస్తూనే “జై సచ్చిదానంద!” అని నవ్వుతూ చేతులు జోడించారు. అయినా శ్రీ సాయి ముస్లి మన్న అనుమానం అతనిని బాధిస్తుండేది. ఒకరోజు సాయి అతనికి చిలిం యిచ్చి, “సర్వత్రా నేనే వున్నాను. బొంబాయి, పూనా, నాగపూర్ సతారా- అంతా రామమయమే. తెలిసిందా మిత్రమా? సరే గాని, నాకు ఐదు లాడ్డూలు పెడతావా?” అన్నారు. తనకు స్వప్న దర్శనం తెల్పినట్లు, సచ్చిదానంద స్వరూపియైన సాయి తన సద్గురువని అతడు తెలుసుకున్నాడు. కాని బాబా తనను లడ్డూలు అడగడంలోని భావమేమో అతనికి తెలియలేదు.
తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెల్లు బికి, మరురోజుకల్లా అయిదు ఆరతిపాటలు దొర్లాయి. అప్పటి నుండి మొదట మేఘుడు, తర్వాత బాపూసాహెబ్జోగు, నిత్యమూ నాలువేళలా సాయి సన్నిధిలో ఈ పాటలతో బాబాకు ఆరతి యివ్వసాగారు. తర్వాత దాసగణు మహారాజు కొద్ది పాటలు చేర్చి, ఈ ఆరతు లను సర్వాంగ సుందరంగా చేసాడు. వీటినే “శ్రీ సాయినాథ సగుణోపాసన” అను పేర సాయి సంస్థానంవారు 1923లో ముద్రించారు. ఈ ఆరతి పాటలు కొన్నింటిలో ‘కృష్ణ’ అని, కొన్నింటిలో ‘గణూహ్మణే’ అన్న పదాలూ అందుకే విన్పిస్తాయి. ఆ భగవంతుడే సాయి రూపంలో అవతరించి, భీష్ముని ద్వారా ఈ ఆరతులు వ్రాయించుకున్నారు.
సేకరణ : సాయి బంధువు శ్రీ హేమంత్ గారు
శ్రీ పూజ్య ఎక్కిరాల భరద్వాజ గురువు గారు రచించిన “ఆరతులు” అను పుస్తకం ఆధారంగా ..