♥పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు మరాఠి భాష లో మనము పాడుకునే షిరిడి ఆరతుల ను వాటి భావం తో పాటు, భక్తి గా పాడుకునేందుకు వీలు గా , ప్రతీ వాక్యానికి తెలుగు అర్థం వివరిస్తూ ,“షిరిడి ఆరతులు”అను పుస్తకం 1996 లో రచించడం జరిగింది. వారి కృపాశీస్సులతో ఆ పుస్తకం లోని , సాయి ఆరతుల తెలుగు అర్థములు మీ కోసం మన “సాయిసన్నిధి “ లో సాయినాధుని కృప తో పొందుపరుస్తున్నాను.
ఈ “సాయిసన్నిధి” నేను శ్రీ పూజ్య గురుదేవులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి “సాయిసన్నిధి” గ్రంధం ద్వారా పొందిన ప్రేరణ..నా గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి తో పాటు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు కూడా తమ అనుగ్రహ జల్లులని నా పై కురిపిస్తూనే వున్నారు వారి రచన లనూ నాకు ఏదో విధంగా వారి భక్తుల ద్వారా ప్రసాదించడం ద్వారా ..“సాయి ని, మన గురువుని సంపూర్ణంగా విశ్వసించినప్పుడు , సాయి వద్దకు చేర్చే ఏ ఇతర గురువు లో ను మన గురువే కనిపిస్తారు “ అనే వారి సందేశం నాకు అనుభవం లో కి వచ్చింది, ఈ సందర్భం గా ఈ ఇరువురు (ఇంకా భగవంతుడిని చేర్చే ఇతర అందరు మహాత్ములూ) గురుదేవుల దివ్య పాదాలకి నా సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటున్నాను ..
జై గురుదేవా !!
♣“షిరిడి ఆరతులు “గ్రంధం లో పూజ్య గురుదేవులు చెప్పిన ముందు మాట
“కేవలం భౌతికతత్వంతోనే నిండిన ఇతర దేశాల నాగరికత కోసం ఆయాస పడుతూ పరుగులు తీసే నేటి మన సమాజంలోని సామాన్య మానవుడు ఈర్య, స్వార్ధ, ద్వేషాలతో అహంకార, మమకార, అజ్ఞానాలతో ఏలాగైన సరే డబ్బు సంపాదించడమే జీవితధ్యేయంగా చేసుకొని అనవసరమైన ఆందోళనకు, అశాంతికి గురి అవుతున్న ఈ సమయంలో ఈ హారతులను అర్ధము తెలుసుకుంటూ పాడితే ప్రతిపదములోను శాంతి, ప్రతి చరణములోను పవిత్రత, ప్రతి పాటలోను అమృతం, ప్రతి మాటలోను జ్ఞాన సందేశము లభించగలవు. సాయి బంధువులారా !
ఈ హారతులకు అర్థము తెలుగులో తెలుసుకొని భావయుక్తముగా పాడుతూ బాబాకు హారతి యిస్తూ వుంటే క్రమక్రమంగా ప్రాపంచిక వ్యామోహాల నుండి దూరమై బాబాకు దగ్గర కావచ్చును. సమాజంలోని అనేక విషయాలతో సతమతమవుతున్న సామాన్యులమైన మనకు తెల్లవారు ఝామునే లేచి ఉదయహారతి చేసిన తరువాత కొంత టైము వరకు మనస్సు బాబాయందు లగ్నమైఉంటుంది. ఆ తరువాత మళ్లీ మనం బాబాను మరచే ప్రమాదం ఉన్నది. అందుకు మధ్యాహ్నము 12 గంటలకు అర్ధము పూర్తిగా తెలుసుకుంటూ మళ్లీ బాబాకు హారతి యిస్తే మరికొంత టైము వరకు మనసు బాబా యందు లగ్నమౌతుంది. యిదే విధంగా సూర్యాస్తమయ హారతి, ఆఖరికి రాత్రి శేజ్ (పవళింపు) హారతి యిస్తూ వుంటే బాబాను (భగవంతుని) తలచి మనస్సు అనవసరమైన విషయాలపైకి పరుగు తీయటం తగ్గుతుంది. క్రమంగా రోజుకు నాలుగు హారతులు బాబాకు యిస్తూ వుంటే ఆ స్థలము బాబా యొక్క శక్తికి కేంద్రస్థానమై బాబా యొక్క నివాసం కాగలదు. “
-పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు