ఓం శ్రీ సాయి నాధాయనమః!!
ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భం గా , ఈరోజు సమాధి చెందిన కాలు రామ్ అనే యోగి గూర్చి తెలుసుకుందాము.
బల్వంత్ నాచ్నేకు చాలాకాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో శిరిడీ వచ్చారు. నాచ్నే భార్యకొక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను వత్తిడి చేశాడు శ్యామా. అపుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచ్నేకొక కొబ్బరికాయ ప్రసాదించి, నాచ్నేను తమ పాదాలోత్తమన్నారు. తర్వాత అతని వెన్ను నిమిరి అతనిని కౌగలించుకున్నారు. అతనికి 1919లో కొడుకు పుడితే కాలూరామ్ అని పేరు పెట్టారు.
వాడు 3వ యేటనే ‘హరేరామ్’ అని జపిస్తూండేవాడు! హెగ్డే అను పండితుడు వాణ్ణి గమనించి అతడు ఆ శ్రీకృష్ణుని బాల్య మిత్రులలో ఒకడని చెప్పాడు. కాలూ కృష్ణునితో తన ఆటపాటల గురించి యేరోజేమీ చెప్పేవాడో అదే ఆరోజు హెర్ల చేసే ‘హరి విజయము’ పారాయణలో వచ్చేది. “కృష్ణుడు నన్నేడిపించేవాడు. అతడు నా వీపు పైనెక్కి, నేను అతని కాలు గిచ్చి పైకి చూచేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు” ఇలా చెప్తుండేవాడు కాలూ , అప్పుడప్పుడతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి త్రిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు ‘సందేశ్ అనే పత్రికను తెప్పించి, దాని అట్టమీద ప్రణవంలోనున్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు. ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రాంఫోను ముందు కూర్చున్న కుక్కబొమ్మ చూపి, “అది శ్రీకృష్ణ సందేశం – ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్దగా వింటుందో! అలా చేస్తే నీకూ’ బాబా మాటలు విన్పిస్తాయి. నేనలాగే, చేస్తుంటాను” అన్నాడు కాలూ, “బాబా గొంతు నీకెలా తెలుసు!” అంటే అతడు చెప్పలేదు. అతనిని చూడ్డానికి మహాత్ములు, ఉపాసనీ బాబా మరియు గాఢ బాబా (అంధేరీ) వచ్చారు.
కాలూకు 1927లో వంటికి నీరుపట్టి జ్వరమొస్తే బాబా ఊధీ మాత్రమే యిచ్చారు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశినాడు అతడు తండ్రితో “జ్ఞానేశ్వరి’ 13 వ అధ్యాయం విన్పించు. నేను వెళ్ళిపోతున్నాను” అన్నాడు. తండ్రి దుఃఖంవలన చదవలేకపోతే, అతడా గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరు కార్చా రో నాచ్నే కు అర్ధం అయ్యింది..
ఎన్నో మంచి విషయాలను నేర్పుతుంది ఈ లీల. బల్వంత్ నాచ్నే వేరే వారి వద్ద ఉపదేశం తీసుకున్నా బాబా సేవను వదల లేదు.అందుకే కాలురామ్ అనే ముక్త పురుషుడిని వారి కుమారుడిగా పుట్టించి, వాళ్ళ వంశమును తరింప చేశాడు బాబా!
సేకరణ : సాయి బంధువు శ్రీ హేమంత్ కుమార్ గారు.
శ్రీ పూజ్య ఎక్కిరాల భరద్వాజ గురువు గారు రచించిన “శ్రీ సాయి లీలామృతం ” నుండి .