ఒక వ్యక్తి తన కర్మల ఫలి లను అనుభవిస్తున్నప్పుడు ,అజ్ఞానంవల్ల అట్లాంటి సంస్కారాలే అతనితో వుంటాయి. కనుక అట్టి కర్మలే మళ్ళీ మళ్ళీ చేస్తూ యింకా యింకా అదే కర్మ వలయంలో చిక్కుకుపోతుంటాడు. మరి దీనిలోంచి బయటకు వచ్చే మాటేమిటి ?
ఏయే కర్మలైతే ఇంతకుముందు చేసి వున్నామో, వాటి ఫలితాలు యిప్పుడు అనివార్యంగా అనుభవించవలసిందే. కాని మళ్ళీయిట్లాంటి కర్మ చక్రంలో యిరుక్కునే అవసరం లేకుండా తప్పించుకోవడానికి కావలసిన మనస్తత్వం ఏర్పడడడానికి నికి ఒక అవగాహనను, ప్రార్థనను చేసుకోవాలి. ఎలాగంటే ఇంట్లో మనకు ఆర్ధికమైన యిబ్బంది వున్నది, అప్పుడేం చేస్తున్నాం? ఒకచేత్తో అప్పు తీసుకు వచ్చి కుటుంబం గడుపుతున్నాం. రెండవచేత్తో అప్పు తీసుకోవలసిన అవసరం లేకుండా, అప్పు తీర్చుకొనే పద్ధతి వుండేటట్లు కృషి చేస్తున్నాము. ఈ ఆధ్యాత్మికతలో గూడా అంతే. ఒక ప్రక్క మనం కర్మానుభూతిని పొందుతూనే వున్నాము. ఎన్ని పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా అనివార్యంగా కర్మానుభూతి కలుగుతూనే వున్నది. అయితే ప్రార్థన ఎందుకు? అన్నది ప్రశ్న. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా మళ్ళీ యిటువంటి ముళ్ళ చక్రంలో దిగ వలసిన ఆవశ్యకత లేని స్థితికి రావడం కోసం ప్రయత్నమే అది. ఈ సమన్వయము దొరికేలోపల అందరూ దైవాన్ని కోరికలు తీరడం కోసమేననుకొని దైవాన్ని ప్రార్థిస్తూ వుంటారు. అసలు దైవాన్ని దేనికోసం ప్రార్థిస్తున్నారు? మనకే కష్ట మొచ్చినా ఆయనను ప్రార్థిస్తే తొలుగుతుంది అని. అంటే మొత్తం మీద వాళ్ళకు ఏ కష్టమొచ్చినా తొలగడమే కావాలి. అంటే కష్టాలే లేని స్థితి కావాలి. అంటే దుఃఖమే లేని స్థితి కావాలి. అయితే దానిగురించి, అంటే దుఃఖమేలేని స్థితి గురించి కొద్దో గొప్పో అవగాహన వుంటే అది ఎట్లా వస్తుందో తెలుస్తుంది. అదే ఆధ్యాత్మికతకు శక్తినంతా వినియోగించి కృషి చేయడమంటే. అట్టి అవగాహన వాడికేర్పడేలోపల వాడు చేసే పూజలు, ప్రార్థనలు మొదలైనవి పిల్లల బొమ్మ లాటలాగా వుంటాయి. అంటే అలా చేస్తూపోతూ వుంటే సుదీర్ఘ కాలానికి ఆ స్థితి రాదా? వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు, వచ్చి తీరుతుందని చెప్పడానికి అవకాశం లేదు. అలా జపమో, పూజో జన్మజన్మలుగా ఏదో ఒక రకంగా చేస్తూ పోతూ వుంటే రాదా?
ఈ సాధన వుండడం చేత రాగద్వేషాదులు క్రమంగా అంతరించుకుపోయి నానాటికి చిత్తశుద్ధి కలుగు అవకాశం వున్నది. అంటే అలా చేసేవాడు అవగాహనతో చేస్తున్నాడన్నమాట. వాడు చేస్తున్నది అర్థం చేసుకుని చేస్తున్నాడన్నమాట.కృష్ణుణ్ణి పెట్టుకున్నా, రాముణ్ణి పెట్టుకున్నా, ఈశ్వరుణ్ణి పెట్టుకున్నా, విఘ్నేశ్వరుని పెట్టుకున్నా, ఆ చేసే నామావళియొక్క, ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని మననం చేసుకుంటూ అన్ని రూపాలలో అదే వున్నదనే అవగాహన పెంచుకుంటున్నాడన్నమాట. అలా చేయగా చేయగా రాగద్వేషాదులు పలుచబడతాయి. తద్వారా చిత్తం శుద్ధమవుతుంది. అట్టివాడికి తప్పకుండా దుఃఖరాహిత్య స్థితి లభ్యమవుతుంది. అట్టి అవగాహన లేకుండా వూరికే చేస్తూ పోతూ వుంటే అలా చేస్తూనే వుంటాము. కాని మనలో వున్న దోషాలు తీర కుండా అట్లానే నిలబడి పోతుంటాయి. కాబట్టి ఈ పూజలూ, జపధ్యానాదులు చేసేవాళ్ళకు మరు జన్మలకు దుఃఖరాహిత్యస్థితి కలుగుతుందా అంటే అందరికీ కలుగుతుందని మాత్రం చెప్పలేము. ఎవరికైతే అవగాహన వుండి వీటిని చేస్తూ పోతూ వుంటాడో అట్టి అవగాహన ద్వారా రాగద్వేషాది భావాలను తొలగించుకుంటూ పోతూ వుంటాడో, వాడికి అట్టి సంస్కారమే మరుజన్మలో కలగడంచేత దుఃఖరాహిత్య స్థితి లభ్యమవుతుంది. అట్టి అవగాహన లేనివాడు ఏం చేస్తున్నాడంటే ఇటు మందూ తింటున్నాడు, అటు అపథ్యమూ చేస్తున్నొడు. వాడికి రోగం తగు తుందన్న గ్యారంటీ వున్నదా? మందు యొక్క విలువ, జబ్బు తగ్గవలసిన ఆవశ్య కత, డాక్టరు మీద వుండే విశ్వాసమూ చేత మందు తీసుకుంటూ పళ్ళు బిగించి యైనా సరే పథ్యం చేయగలిగిన వాడికి రోజు రోజుకూ మార్పు కనపడుతుంది. ఒకరోజులో కాకపోతే పదిరోజులలోనైనా కనపడుతుంది. పథ్యమూ చేయక, మందూ సమయానికి తీసుకోకపోతే వ్యాధి ఎలా తగ్గుతుంది? ఆధ్యాత్మికతలో రాగద్వేషాలు జయించడము, నిష్ఠ, సబూరీలు, అవగాహన పెంచుకోవడమూ పథ్యం వంటిది. జపధ్యానాదులు, పూజాదులు మందువంటిది. ఈ రెండూ కలిస్తేనే దుఃఖరాహిత్యం సాధ్యం. కాని ఊరికే జపధ్యానాదులు చేసుకుంటూపోతే సాధ్యం కాదు. లెక్కలు చేస్తూ వుంటే చేస్తున్న లెక్క ఏవిధంగా చేయాలో ఆ చేసే పద్దతి అవగాహన అవకుండా వంద లెక్కలు చేస్తే మాత్రం పరీక్ష పాసవుతాడా? అదృష్టం బాగుండి వాడు చేసిన లెక్కలు పరీక్షలో దిగితే పాసవగలడు గానీ లేకపోతే పాసవడు గదా! అలాగాక మూడు లెక్కలతోనైనా సరే వాడు లెక్క ఎలా చేయాలో సూత్రం నేర్చుకుంటే పాసవుతాడు. అందుకే ‘జ్ఞానాదేవతు కైవల్యం’ అన్నారు.
అందువలన అవగాహనతో చేసే కార్యక్రమాల వల్ల మనలో వున్న గుణాలన్నీ అదుపులోకొచ్చి సత్వగుణ, దైవీసంపదలు నానాటికీ అలవడుతూ ముందు జన్మలకు దుఃఖరాహిత్య స్థితికి మెల్ల మెల్లగా జారుకుంటాము. ఈ విధంగా జీవితం మొత్తాన్నీ మన ధర్మాన్ని మనం విర్వర్తించుకుంటూనే మన భావనను మాత్రం నిష్ఠ, సబూరీలతో నిలుపుకొంటూ, ఆ నిష్ఠ సబూరీలను ఎవరికర్పించామో, ఆ సద్గురువే అందరిలో వున్నాడనే భావాన్ని అనన్యచింతగా నిలుపుకుంటూంటే అప్పుడు రెండు ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. ఒక ప్రక్క యిటువంటి కర్మచక్రంలో తగులుకునేటటువంటి దుస్థితిలో చిక్కు కోకుండా అభివృద్ది చెందుతూ వున్నాము, రెండవప్రక్క కర్మను నిర్లిప్తంగా తీసుకునేటటువంటి, ద్వంద్వాలను జయించేటటువంటి, కష్ట సుఖాలను సమంగా తీసుకోగలిగేటటువంటి సాధనక్రింద జీవితాన్ని తీసుకోగలుగు తున్నాము.
ఈ విధంగా హృదయపూర్వకంగా, తన యావచ్చక్తినీ వినియోగించి సాధన చేయడానికి ఎక్కువమంది ఉపక్రమించేటంత వరకూ నిజమైన ఆధ్యాత్మికత మనకు తెలియలేదనే అర్థం.
సేకరణ: శ్రీ పూ జ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి ప్రవచనాలు