సాయి బంధువు వీర్రాజు గారి అనుభవం వారి మాటల్లోనే….
షిరిడి లో బాబా దర్శనం ఇచ్చుట:
1977 వ సం. లో పూజ్యగురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావుగారు వ్రాసిన శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర 9 వారములు (7X9 = 63 రోజులు) నిష్ఠ గా మా ఇంట్లో పారాయణ చేసిన తరువాత షిరిడీ బయలుదేరి వెళ్ళితిని. షిరిడిలో బస్ దిగి నన్ను పలకరిస్తూ గురువుగారు, “మీరిక్కడకు ఇది వరకు వచ్చారా” అని అడిగారు. ‘వచ్చాను’ అన్నాను. మీతో బాటు వీరికి ఇక్కడ అన్ని ప్రదేశములూ చూపమని ఇద్దరిని చూపుతూ అన్నారు. ముగ్గురం స్నానం ముగించి సాయిదర్శనానికి క్యూలో వెళ్ళాం .నాతో కలిసిన వారిద్దరూ ఒకరు నల్గొండ నుండి, మరిఒకరు వైజాగ్ నుండి వచ్చినారట.
నేను ద్రాక్షారామం నుండి బయలుదేరినపుడు బంధువులు, స్నేహితులు బాబా వారికి దక్షిణలు హుండీలో వేయమని ఇచ్చి ఉన్నారు. ఆ కానుకలు పొట్లాలుగా కట్టి వారి వారి పేర్లు వ్రాసి సంచిలో ఉంచుకున్నాను. బాబాకు టెంకాయ, పాలకోవా తీసుకుని క్యూలోవెళ్ళి మేము ముగ్గురం బాబా దర్శనం చేసుకున్నాము. మిత్రులు, బంధువులు ఇచ్చిన కానుకలు డిబ్సీలో వేసి నేను కూడా కొంత వేసి నమస్కరించుకుని ప్రసాదం తీసుకుని జరుగుతూ ఉండగా ఇంకో 5 రూ.లు దక్షిణ ఇస్తే బాగుండునని నా మనసుకు తోచింది. ఈ లోగా బయటకు వచ్చి వేయుట జరిగింది. సరే, సాయంకాలం వరకూ ఉంటాం కదా, వేయవచ్చులే అనుకున్నాను .తర్వాత బాబా ఎదురుగానూ, ఖండోబా ఆలయంలోనూ, ద్వారకామాయిలోనూ సాయి చరిత్ర పారాయణ చేశాను. నాతో వచ్చిన ఇద్దరూ ఒక్కొక్క అధ్యాయం పారాయణ చేశారు. తర్వాత ఒంటి గంట సమయంలో ఒక బండి వద్ద మేము బాబా వారి స్టిక్కర్లు, కేలండర్లు, దండలు, కేసెట్స్ వగైరా ముగ్గురకూ కలిపి బేరమాడుతున్నాం .నేను మధ్యగా నిలబడ్డాను .ఇంతలో ఒక ఆజానుబాహుడు, తలపై పచ్చటి కండువా చుట్టుకొని, తెల్లటి బారులాల్చీ ధరించి, వంపు తిరిగిన బూట్లు వేసుకుని ఒక చేత్తో తాబేలు డొక్కు లాటి భిక్షాపాత్ర, మరియొక చేత్తో సటకా పట్టుకొని మా వెనుక ఒక క్షణం ఆగి పది అడుగులు నడచి వెళ్ళారు .అక్కడ ఆగి మా వైపు చూస్తూ “ఇధర్ ఆవో” అన్నారు. “నన్నా’ అని నేనూ, “నన్నా’ అని మా మిత్రులూ అడిగారు .నన్ను చూపుతూ “తుమ్ ఆవో’ అన్నారు .ముందు నేను దగ్గరకు వెళ్ళగా వెనక నా మిత్రులు వచ్చారు. ఆయన నాతో “పాంచ్ రూప్యె లావో, బాత్ కర్తాహూ” అన్నారు. “పాంచ్ రూప్యె క్యా, బీస్ దేతా హూజీ” అని నేను 20 రూ/ ఇవ్వబోగా ‘నహీ’ పాంచ్ రూపె లావో” అని 5 రూ. మాత్రమే తీసుకుని మా నుండి 15 అడుగుల వేసి మేము చూస్తుండగానే ముందుకు వెళ్లి ఆదృశ్యమైనారు .నా మిత్రులు చెరొక పదిరూపాయిలూ ఇవ్వబోయినా తీసుకోలేదు .నేను ఎక్కువ ఇస్తానన్నా తీసుకోలేదు . మాకు వళ్లు జలదరించింది. ఆ స్వామికోసం సుమారు “2 గంటల పాటు ఆ భక్త సమూహంలో వెదికాం ,మరల కనిపించలేదు . పారాయ ఫలితముగా నాకు దివ్యదర్శనం ఇచ్చి, ఇద్దామనుకున్న 5 రూ.లు ఈ రకంగా తీసుకున్నారు .మేము ముగ్గురమూ ఆరోజంతా స్వామి దర్శన భాగ్యాన్ని తలుచుకుంటూ ఎంతో ఆనదించాము.
సాయి దివ్య దర్శనం కలగడాని కారణం పూజ్యగురుదేవులతో పరిచయ భాగ్యం కలగడమే ! గురువుగార్కి ఎల్లవేళలా ఋణపడి ఉంటాను.
ద్రాక్షారామంలో బాబా లీల :
ది. 12-2-98 నుండి 14-2-98 వరకు భీమసాయి మందిరం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు దూర ప్రాంతాల నుండి కూడా సాయి బంధువులు వచ్చారు. సాయి బంధువు ఒకామె రాజమండ్రి నుండి వచ్చింది. ఆమె పర్సు స్థంభం దగ్గర పెట్టి సాయి పాదాలు తాకి వచ్చేటప్పటికి కనబడలేదు. ఆ పర్సులో 600 రూ.లు, ఇంటి తాళాలు, కొంత చిల్లర ఉందట .మాకు చెప్పగా మైక్‌లో ఎనౌన్స్ చేశాం, ఆ ప్రాంతమంతా వెదికాము ,కనబడలేదు .3 రోజుల కార్యక్రమం తర్వాత సాయి బంధువులు ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు . ఆమె సాయి సన్నిధికి వెళ్ళి , “నేను రాజమండ్రి నుండి వచ్చాను .నాకు దారి ఖర్చులు కూడా లేకుండా చేశావా సాయి,” అని నమస్కరించి వెళ్ళిపోవుచుండగా కాషాయ వస్త్రధారియైన 6 సం.ల బాలుడు ఆమె చెంగుపట్టి లాగి “అమ్మా ! పర్సు పోయిందన్నావుగా! ఇదిగో నీ పర్సు” అని ఆమె చేతిలో పెట్టగా ఆమె ,”ఎవరిచ్చారు బాబూ’ అని అడిగిందట .”లోపలాయన ఇచ్చాడు” అని 3 సార్లు పలికి అదృశ్యమైపోయాడట. ఆమె పర్స్ తెరచి చూడగా అన్ని అలాగే ఉన్నాయట. ఆమె గబగబా మందిరంలోనికి వచ్చి మూర్చపోయింది. బాబా విబూది బొట్టు పెట్టి నీళ్ళు ముఖం మీద చల్లగా కొద్ది సేపటికి లేచి జరిగిన విషయాలు చెప్పిరి. మాకందరకూ కూడా తన్మయత్వం కలిగింది . బాబా చూపిన ఆనేక లీలలలో ఇది ఒకటి మాత్రమే . పూజ్యగురుదేవులు శ్రీ గాంబశివరావుగారి పాదస్పర్శతో పవిత్రమైన మా సాయి ప్రాంగణంలో జరిగిన లీలలు ఎన్నో ఎన్నెన్నో !!
సాయి సేవలో
గుండా వీర్రాజు, (టీచర్), ద్రాక్షారామం.