సాయి సేవ లో మనము తనువూ మనసు మరిచి భక్తి తో నిమగ్నమయ్యినప్పుడు, మన ప్రారబ్ధ కర్మల సంగతి బాబా వారే చూసుకుంటారు..ఆయా కర్మలు మనల్ని ఏమి చేయక , నామ మాత్రం గా మాత్రమే, ఆ కర్మ ఫలాలని చూడటం మాత్రమే మనవంతు అవుతుంది, కాబట్టి సర్వ భారాలని ఆయన పై వేసి నిశ్చింత గా సాయి సేవ లో మన తను,మాన , ప్రాణాలని సమర్పించి తరించుదాము.
సాయి కోటి యజ్ఞం లో , సాయి బంధువు శ్రీ శివ రామయ్య గారు పొందిన అనుభవం వారి మాటల్లోనే …ఈ లీల మనకి ఈ విషయం నిరూపిస్తుంది .
“సకల దేవతా స్వరూపుడు సర్వ సమర్థుడు సమర్ధ సద్గురువు శ్రీ షిరిడి సాయిబాబాకు సాష్టాంగ నమస్కారములు. మరియు సర్వమతములను సర్వ కులములను ఒకేవిధముగా భావించి సాయితత్వ ప్రచారములో మమ్ములను సన్మార్గమున నడుపుచున్న గురువుగారు శ్రీ శ్రీ శ్రీ అమ్ముల సాంబశివరావు మహారాజ్ పాదపద్మములకు నమస్కారములు సమర్పించుకొనుచున్నాను.
గురువుగారు స్థాపించిన ఏలూరు లక్ష్మీపురం గార్డెన్స్‌లో 100 అడుగుల సాయికోటి స్తూపం వద్దకు వచ్చి గురువుగారు చెప్పిన ప్రకారం ,”స్తూపం చుట్టూ 3 సార్లు ప్రదిక్షణ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి, మన మనస్సులోని బాధనుగాని కోరిక గాని ఆ స్తూపం ఎదురుగా ఉండి కోరుకుంటే నెరవేరును” అన్న మాటలు నాకు మరియు నాకు తెలిసిన సాయిబంధువులకు చాలామందికి జరిగినవి. అదేవిధంగా 150 వ యజ్ఞం 1999 మే, 1, 2, 3, తేదీలలో 100 అడుగుల సాయికోటి మహాస్తూపం వద్ద జరిగినది. ఈ యజ్ఞానికి మా ఊరినుండి వచ్చిన సాయిబందువులకు వారి కోరిక ప్రకారం ఒకరికి సంతానం కలిగినది. కొందరికి వారనుకున్న పని పూర్తి అయినది. అదేవిధముగా నేను 150 వ యజ్ఞములో గురువుగారి రూమ్ దగ్గరే వాలంటీరుగా ఉన్నాను. యజ్ఞానికి ముందురోజు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సాయిబంధవులతో పాలవెల్లి అరసవెల్లి పాటలు పోటీలు నిర్వహించుట జరిగినది. ఆ కార్యక్రమము జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి కరెంటు పోయినది. జనరేటరు స్తాట్ చేయుటకు జనరేటరు స్టాట్ చేయువారు లేరు. మన సాయి బంధువులలో ఒకరు ప్రయత్నించగా స్టాట్ కాలేదు. వెంటనే నేను వెళ్ళి 2, 3 సార్లు ప్రయత్నించగా 3 వ సారి స్టాట్ అయినది. అయితే నా కుడి చేతినుండి మోచేతి వరకు రక్తం కారుచున్నది. అక్కడనే ఉన్న కాకినాడ సాయిబంధువు ఏమీ కాదు బాబా వారి విభూది రాయండి తగ్గిపోతుంది అని అన్నారు. ఆ సాయిబంధువుతోనే నీటిని తెప్పించి చేతిని కడుగగా చేతికి ఏవిధమైన దెబ్బలేదు. కాని రక్తం వచ్చినది. ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. సమీపంలో ఉన్న సాయిబంధువులు ఐ. రవికాంత్ వారికి చెప్పగా 150 వ యజ్ఞం అంటే ఏమనుకొన్నావు. నీ చెడు కర్మను బాబావారు ఈ విధముగా తీసివేసినారు అని అన్నారు. అదేవిధముగా తరువాత నేను ఇంటికి వెళ్ళగా, నేను 150 వ యజ్ఞానికి వెళ్ళిన తరువాత మా అమ్మకు -నాకు ఏదో చెడు జరిగినట్లు కలలో కనిపించగా, ఆరాత్రి వెంటనే మేల్కొని మా నాన్నగారికి చెప్పగా,మా నాన్నగారు, “వాడు వెళ్ళినది బాబా వారి కార్యక్రమానికి, వాడికి ఏమి జరుగదు అన్ని బాబాయే చూసుకుంటాడు” అని ధైర్యం చెప్పినారట. నిజంగా యజ్ఞంలో నాకు జరిగినది, మా అమ్మకు కలలో కనిపించినది ఈ రెండు విషయాలు చూస్తే, నాకు ఏదో చెడు జరుగవలసినది బాబా వారు ఈ విధముగా మార్చి వాటి ప్రభావం తగ్గించటం జరిగినది. ఈ విధముగా కంటికి రెప్పలా కాపాడు సమర్థుడైన సదురువు శ్రీ షిరిడి సాయినాధుడు. నాకు భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏవిధముగా నడుచుకోవాలో నేర్పుతూ, సన్మార్గంలో నడుపుచున్న సద్గురువు శ్రీశ్రీశ్రీ అమ్ముల సాంబశివరావుగారిని నా జీవితంలో నా దేహంలో ప్రాణమున్నంత వరకు వదలను, విడవను ,మరువను.”
శివరామయ్య
చిలకలూరి పేట, గుంటూరు జిల్లా