శ్రీ సాయి నాథాయనమః !
ఈనాడు మనం భక్తి గా పాడుకొంటున్న “శ్రీ సాయి అరతులు” రచించింది “శ్రీ కృష్ణ శాస్త్రి జగేశ్వర్ భీష్మ“ అనే సాయి యొక్క గొప్ప భక్తుడు… చక్కటి భావం తో , పాడుతుంటే మనలని సాయి సన్నిధి కి తీసుకెళ్లే ఆ మధురమయిన పాటలని రాసిన భీష్మ గారి గూర్చి, వారు ఆ పాట లు రచించడం వెనుక గల సాయి లీల గూర్చి తెలుసుకుందాము ..
శ్రీకృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ నాగపూర్ జిల్లాలోని బోరీ గ్రామస్థుడు. 1854లో జన్మించి ఎక్కువకాలం నాగపూర్ లో వున్నాడు. కొంతకాలం స్కూల్ అకౌంట్స్ శాఖలో పనిచేస్తూ 1910లో మనదేశ స్వరాజ్యం కోసం గాంధీగారు ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. తర్వాత కొంతకాలం వ్యవసాయం చేసేవాడు. అతని భార్య మరణించడంతో అతని హృదయం ఎంతో వికలమైపోయింది. కొంతకాలానికి, అంటే 1908 శ్రావణమాసంలో ఒకరోజు యితనికొక వింతైన స్వప్నమొచ్చింది. త్రిపుండ్రాలు ధరించిన ఒక నల్లని బ్రాహ్మణుడు కనిపించాడు. అతని శరీరం నిండా శ్రీ చందనమద్ది వున్నది. అతని పాదాలవద్ద ఎవరో పూజ చేసినట్లు పూలు వున్నాయి. అతడు భీష్మునికొక వార్తాపత్రిక చూపించాడు. దాని మీద “సచ్చిదానంద” అని పెద్ద అక్షరాలతో వ్రాసివున్నది. భీష్ముడది చదవగానే మరొక్కసారి పేపరు చూపి, దాని పైనున్నది చదవమన్నాడు. దాని మీద ”మంత్ వ-శికావా” (” ఇందాక చూసిన “జై సచ్చిదానంద”, అనే మంత్రం నేర్చుకో”) అని వ్రాసివున్నది. దాని అర్థమేమని అడిగేలోపల ఆ వ్యక్తి కనిపించలేదు. కొద్దిరోజుల తర్వాత గణపతి ఉపాసకుడైన ఒక సాధువు బోరీ గ్రామానికి వచ్చాడు. ఆయన భీష్ముని కొచ్చిన స్వప్నం గురించి విని అతనికి గురువు సచ్చిదానంద స్వరూపానికి మారు పేరు అనదగిన స్వామియని, ఆయనే అలా స్వప్నదర్శనమిచ్చి, “వ-శికావా” అనే మంత్రముపదేశించి యుండవచ్చుననీ చెప్పాడు.
మరి కొంతకాలం తర్వాత అతడు దాదా సాహెబ్ ఖాపర్డేతో కలిసి శ్రీ సాయిబాబాను దర్శించాడు. అతణ్ణి చూస్తూనే సాయి చిన్నగా నవ్వుతూ తమ చేతులు జోడించి, “జై సచ్చిదానంద!” అన్నారు. ఆ మాట వినగానే భీష్ముడు మొదట నివ్వెరబోయాడు. ఆనాడు తనకు స్వప్న దర్శనమిచ్చినది సాయిబాబానేమో ననుకున్నాడు. కాని సాయి రూపం ముస్లింవలె వున్నది; తనకు స్వప్న దర్శనమిచ్చిన సాధువు వైష్ణవుడు. ఆ భేద భావం వల్లనే అతడెప్పుడూ సాయిబాబా పాదతీర్థం తీసుకునేవాడు గాదు. సాయి పొగపీల్చి అందించిన చిలుముగొట్టము, వారి పాదతీర్థము ఎందరో ఆచారవంతులైన బ్రాహ్మణులుగూడ తీసుకునేవారు. కాని ఇతని భావమెరిగిన సాయి యితనికి నూత్రం చిలుమునిచ్చేవారు గాదు.
సాయి అహర్నిశలూ కూర్చొనే గోనెపట్టా కొన్నాళ్ళకు చీకిపోతుండేది. భక్తులు అప్పుడొక కొత్తపట్టా ఆయనకు ఆసనంగా వేసి పాతది తీసి వేస్తుండేవారు. ఒకసారి సాయి కూర్చొనే గోనెపట్టా పాతదై చినిగిపోయింది. ఒకరోజు బాబా లెండీకి వెళ్ళిన సమయంలో చూచి, ఒక భక్తుడు దానిని బైట పారవేసి, అందుకు బదులుగా కొత్త పట్టుపరువు బాబాకు ఆసనంగా వేశాడు. ఆయన తిరిగి వచ్చి చూచుకొని ఎంతో అసంతృప్తి చెందారు. ఆయన ఆ పాతపట్టాకోసం వెతుక్కుని అది కనిపించక పోయేసరికి దానిని గురించి అందరినీ విచారించారు. ఆయన కెవరూ ఏమీ చెప్పకపోయేసరికి ఆయన ఉగ్రులై ఆ పట్టు పరుపును ధునిలో పారవేసి అందరినీ తిట్టిపోయనారంభించారు. చివరకు భక్తులు ఆ పాతపట్టా వేసేవరకూ ఆయన శాంతించలేదు. ఇటువంటి అనుభవం ఒకటి కృష్ణ జగేశ్వర్ భీష్మ యిలా చెప్పారు;
” ఒకరోజు బాబా కూర్చుండే పాత గోనెపట్టా తీసివేసి, కొత్త ఆసనం వేయమని నన్ను కోరారు. కాని నేనలా చేయలేదు. ఆరతి ఆయ్యాక భక్తులందరూ అక్కడ నుంచొని వుండగా, ‘పాత ఆసనం తీసివేసి, కొత్తది వెయమంటారా?’ అని బాబాను సైగలద్వారా అడిగాను. ఆయన అలానే చేయమని సైగలతోనే నాకు సూచించారు. ఆ విషయం నేను దాదాసాహెబ్ కు చెప్పగానే అతడు వెంటనే కొత్త పట్టావేసి పాతది పారవేశాడు. అపుడు బాబా కొద్దిసేపు చిలిం తాగి, దానిని నాకందించి త్రాగమని ఆదేశించారు. నేను పొగ పిల్చి మళ్ళీ సాయి కందించాను. దానిని తీసుకుంటూ ఆయన, “మేము సర్వత్రా సంచరిస్తున్నాము, బొంబాయి, పూణే, సతారా, నాగపూర్ మొ.న నగరాలన్నీ రామమయములే. తెలిసిందా మిత్రమా?” అన్నారు. మళ్ళీ కొద్ది నిమిషాలుండి ఆయన అకస్మాత్తుగా ” నీవేదైనా నాకు పెట్టకుండా ఎప్పుడూ “ఒక్కడివే తింటావు. కనీసం యిప్పుడైనా అయిదు లడ్లు పెట్టు!” అన్నారు”..
మరురోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెల్లుబికి వెంటనే రెండు పాటలు వ్రాశాడు. కాని, ఆపై ఒక్కటిగూడ నడవలేదు. వాటిని సమర్పించగానే, సాయి అతనినే పాడి విన్పించమన్నారు. అతడు పాడాక అతని తల పై చేయి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్ళీ స్పూర్తిగలిగి, మరి మూడు పాటలు వ్రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి శిరిడీ హారతులు, సాయి యిలా కోరి వ్రాయించుకుని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగణు, శ్యామా మరి కొన్ని పాటలు చేర్చి నేటి శిరిడీ ఆరతులు కూర్చారు.
సేకరణ :పూజ్య గురువులు శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి రచన ఆధారం గా..
అయితే ,భావమెరిగి వాటిని పాడుకొనడ మెంతో శ్రేయస్కరం.మరాఠి లో వున్న ఈ సాయి అరతుల తెలుగు అర్థం పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు రచించారు.బ్లాగ్ పోస్ట్స్ లో, “షిర్డీ అరతులు (తెలుగు అర్థము తో )” అనే పోస్ట్ పేరున వాటిని పొందుపరచాము. చదువుకొని ఆరతుల భావం గ్రహించగలరు .