సాయినాథాయనమః!
పవిత్రత
పవిత్రత అనునది మన జీవితం లో అత్యవసరము. పవిత్రత లేనిదే ఏ కార్యము సిద్ధించదు అని అంటారు “అపవిత్రమయిన మనసుతో ఆధ్యాత్మిక కార్యాలు ఎన్ని చేసినా , కేవలం పేరు ప్రతిష్ట కి తప్ప ఏ విధంగానూ ఉపయోగపడదు ” అని బాబా వారే స్వయం గా చెప్పారు . “భక్తి , పవిత్రత, సహనం పట్టుదల” అనేవి ఆధ్యాత్మికం గా మనం చేయాలనుకునే ఏ కార్య సాఫల్యత కయినా అత్యవసరము . అయితే మనం పవిత్రత కల్గి వున్నామా అనేది ఎవరికి వారే తరచి చూసుకోవాల్సిన అవసరం వుంది . బాబా వారు మనలని ఈ విషయం గా ఎన్నో కఠిన పరీక్షలు పెడుతూ వుంటారు . బాబా వారు మనల్ని పరీక్షించడానికి ఎన్నో పరిస్థితులు మనకి ఎదురయ్యేలా చేస్తుంటారు . ఆయా పరిస్థితుల్లో మనం ధర్మం గా వ్యవహరిస్తూ ,మన పవిత్రత కాపాడుకోవాలి. ఇలా ఈ కఠిన పరీక్ష ల ద్వారా ,మనం మనసా, వాచా ,కర్మణా ఏ పొరపాటు చేయకుండా, మంచి ఆధ్యాత్మిక సాధకుడు లేదా సాధకురాలి గా తయారయ్యేలా బాబా శిక్షణ ఇస్తుంటారు . మనం ఎట్టి పరిస్థితి లో ను ధర్మాన్ని తప్పక, అరిషడ్వర్గాలు మనలో కలిగించే ఆటుపోట్లనుండి రక్షించమని బాబా ని ప్రార్థిస్తూనే మన శక్తి మేర ఈ మాయ తో పోరాడాలి . అరిషడ్వార్గాల ప్రభావం తో చేసే ప్రతి ఆలోచన , ప్రతి కార్యం ,ప్రతి మాట కూడా అపవిత్రమే .. కాబట్టి మనం ఎపుడూ పవిత్రం గా ఉండాలంటే , మనల్ని అపవిత్రులని చేసే మాయ గుణాల గూర్చి తెలుసు కోవాలి మరియు వాటికి దూరం గా ఉండాలి.
పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు సాధనా మార్గాలు అనే పుస్తకం లో ఈ మాయ గుణాల గూర్చి వివరించారు. వాటిని తెల్సుకుని ఆ గుణాలకి దూరం గా వుండే ప్రయత్నం చేద్దాము.
“తనకు నచ్చని వారిపై కోపమే క్రోధముగ మారును.
తనకు దక్కిన వాటిని యితరులకు యివ్వలేని గుణమే లోభము.
తనసంపదలు తనవారి యందు గల విపరీత వ్యామోహమే మోహము.
గర్వముతో తానేమి చేసిన గాని చెల్లునను భావమే మదము .
యితరులు తనకంటే ఎందులోనైనా ఎక్కువగా వుంటే
చూసి ఓర్వని గుణము మాత్సర్యము.
తన కష్టనష్టాలన్నిటినీ కూడ అందరికీ కలగాలనే బుద్దే ఈర్ష్య.
తన సంతోష సుఖాలన్నియు యితరులకు వుండరాదను బుద్దే అసూయ.
అందరు తనను మెచ్చుకొని పొగడాలను కోరికయే డంభమగును మనిషిలో.
యితరులను బెదిరించి కేకలు వేయుట అహంకార గుణము.
మనిషికి తనవారిపై మితిమీరిన ప్రేమే రాగము, అనురాగమగును.
తనకు యిష్టము లేని వారందరికి అపకారము చేయు బుద్ధి ద్వేషము.
మితిమీరిన భౌతిక కోరికలన్నియు కామముగ గ్రహించవలె అందరూ.
మోక్షాన్ని కోరువారందరూ వదలాలి ఈ పన్నెండు గుణాలను.
సద్గురువుల సద్బోధలు వదిలి, జనరంజక విధానాలకై పరుగులు
ఆధ్యాత్మిక అంధకారమగును . అదియే అజ్ఞాన లక్షణము.”
సేకరణ : పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి “సాధనా మార్గాలు -10 ” నుండి