ఓం శ్రీ సాయినాధాయనమః
శ్రీ సాయి ని మనస్ఫూర్తిగా నమ్మి , మన జీవితం లో ని ప్రతీ సన్నివేశం లో ఆయన అనుమతి ఇష్టాల కి అనుగుణం గా మనం నడచుకొంటే కలిగే ఆత్మానందం సంతృప్తి సాటి రానివి .ఒక్కోసారి జీవితం లో మనకి ఎదురయ్యే కష్ట నష్టాల్లో నూ ఈ విధం గా “అన్యధా శరణం నాస్తి”అని వారి పట్ల సర్వస్య శరణాగతి మరియు అంకిత భావం తో వారి సలహాలను తీసుకుంటే వారి సర్వోన్నతమయిన రక్షణ ని మనము అనుభవించుతాము .సృష్టి లో అలాంటి రక్షణ ని మనము నమ్ముకున్న దేవం సాయి నాధుడు తప్ప ఎవరు ఇవ్వగలరు మనకు .
సాయి యొక్క అంకిత భక్తుడు శ్రీ రావు బహద్దూర్ ధుమాళ్ గారి జీవిత విశేషాలు తెలుసుకుంటే ఈ విషయం మనకి అవగతమవుతుంది ..చదవండి..
ధుమాళ్ నాసిక్ లో తన పెద్దలందరూ నివసించిన యింట్లోనే వుండేవాడు. ఒకసారి ఆ ఆ వూళ్ళో ప్లేగువ్యాధి చెలరేగి, అతని యింట్లో గూడ ఎన్నో ఎలుకలు చచ్చిపడ్డాయి. సామాన్యంగా ఎవరైనా అలాంటపుడు ఆ యిల్లు విడిచి వెళ్ళిపోతారు, లేకుంటే ఆ వ్యాధి ఆ యింట్లో వారికిగూడ సోకుతుంది. కాని బాబా అనుమతి పొందకుండా అతడేమీ చేసేవాడుగాదు. నాసిక్ లో ఏమి జరుగుతున్నదో వారికి తెలుసని, అతడి కెట్టి ఆపదా రానివ్వరనీ అతడికి తెలుసు. కనుక వారు చెప్పినదీ అక్షరాలా అనుసరించేవాడు. అలా చేయటం వలన అతడికి 29 సం.లలో ఒక్కసారిగూడ యెట్టి యిబ్బందీ కలుగలేదు. అలానే యీ సందర్భంలో గూడ, తాను యిల్లుమారాలో, అట్టి అవసరంలేదో తెలుపమని బాబాకు జాబు వ్రాశాడు. శ్యామా ఆ జాబు బాబాకు చదివి వినిపించాడు. ధూమల్ ఆ యిల్లు విడిచి వెళ్ళడానికి బాబా అనుమతించారు. ఆ జాబు అందాకనే ధూమల్ మరొక యింట్లోకి మారాడు కానీ నాటి రాత్రే ఆ క్రొత్త యింట్లో గూడ ఒక చచ్చిన ఎలుక కనిపించింది. ఆ విషయం మరలా బాబాకు ఉత్తరం వ్రాశాడు. ఈసారి గూడ అతడు ఆ యిల్లు విడిచి మరెక్కడకూ వేళ్ళనక్కరలేదని జాబు వ్రాయించారు బాబా. కనుక అతడు ఆ యింట్లోనే వుండిపోయాడు. ఇరుగు పొరుగువారు, ఆరోగ్యశాఖాధికారులు గూడ అతడు యిల్లు గూడా విడిచి వెంటనే వెళ్ళిపోవడం మంచిదని గగ్గోలు పెట్టారు. కాని అతడు తన విశ్వాసం నుండి చలించలేదు. కొద్ది రోజులలో అతని ప్రాంగణంలోని బంట్రోతుల యిళ్ళలోను, అతని యిరుగు పొరుగు యిళ్ళలోనూ ఎలుకలు ఎక్కువగా చచ్చిపడనారంభించాయి. చివరకు ఒకరోజు ఆ కుటుంబమంతటికీ తాగే నీరిచ్చే బావిలోకూడ చచ్చిన ఎలుకలు కనిపించాయి. అతడు మళ్ళీ బాబాకు ఉత్తరం వ్రాశాడు. ఆయన తనను తప్పక మరో యింటికి మారమని వ్రాయిస్తారని తలచి, అతడు సామానులన్నీ తీసుకుని మరల తన మొదటి యింటికి బయల్దేరాడు. ఆ యిల్లు తాళం తీస్తుండగానే అతనికి అందిన జాబులో బాబా, ‘మనమున్న యింట్లోంచి మనమెందుకు వెళ్ళాలి?’ అని వ్రాయించారు. అతడు వెంటనే తాను ఖాళీచేసిన యింటికి మరలివెళ్ళాడు. ఆ బావిలోని నీరు మాత్రమే వాడుకొనడం మాని మంచినీరు గోదావరి నుంచి తెప్పించుకున్నాడు. అప్పుడు ఆ పట్టణంలో సుమారు 15 మంది ప్లేగుతో మరణించినప్పటికి ధూమల్ కుటుంబంలోని వారికి ఎట్టి ఆపద కలుగలేదు.
శ్రీ సాయి తమ భక్తులనే గాక వారి పై (పేమవలన వారి ఆప్తులను గూడ తగురీతిన ఉద్దరిస్తారు. ధూమల్ భార్య 1909లో చనిపోయింది ఆమెకు సద్గతి కలగాలని అతడు శ్రద్ధతో మాసికాలు జరుపుతున్నాడు. ఆరవ మాసికానికి ముందు ఆ విషయం తెల్పుతూ అతడు శిరిడీకి జాబు వ్రాశాడు. ‘ నీవీ మాసికం శిరిడీలో జరిపించు. నేను నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను” అని శ్యామా చేత జాబు వ్రాయించారు సాయి. అతడలానే చేసాడు. అపుడు బాబా అతనివద్ద రు. 15/- లు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతని భార్యకు సద్గతి లభించినదని అతనితో రూఢిగా చెప్పారు. చనిపోయినవారికి శ్రద్దాభక్తులతో శ్రాద్ధము మొ. వి చేస్తే అట్టి ఆత్మలకు ఉత్తమగతి కలుగుతుందని సాయి అంగీకరించారని మనం గుర్తించాలి. స్వధర్మాన్ని పాటించి తీరాలన్న భగవద్గీతా వాక్యాన్నే సాయిగూడ తమ ప్రేమపాత్రునిచేత ఆచరింపజేసారు. ఇస్లాములో యీ ధర్మం చెప్పబడ లేదు. అందుకే సాయి ముస్లిం భక్తులకది విధించలేదు. ఎవరి ధర్మాన్ని వారు తప్పక ఆచరించడం శ్రేష్టమని వారి భావం. కేవలం మనకు నచ్చలేదు గాబట్టి మనమాచరించలేకపోవడమో, లేక అట్టివి మూఢనమ్మకాలని తలచి నిరసించడమో బాబాకు సమ్మతంగాదు, అలాగని శ్రద్ధ లేకుండా ఆచరించడమూ ఆయనకు సమ్మతంగాదు. అట్టివి సద్గురు సన్నిధిలో జరుపుకొనడం వలన ఉత్తమ ఫలితముంటుందన్న శాస్త్ర వాక్యాన్నే అతనికి ఆయన విధించారు.
మొదటినుండీ అతడు మాసిక శ్రాద్దాలు పెడుతున్న నాసిక్ పట్టణం అనాదిగా అందుకుగూడ మహాపవిత్రమైన తీర్థక్షేత్రమే. ఇతర ప్రాంతాలవారు గూడ గతించిన తమ పెద్దలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని అచ్చటికొచ్చి శ్రాద్ధాలు పెట్టుకొంటారు. అటువంటప్పుడు ధూమల్ ను శిరిడీ వచ్చి తమ సన్నిధిలో శ్రాద్ధం జరిపించుకొమ్మని శ్యామాచేత వ్రాయించడంలో సాయి సన్నిధి అంతకంటే గూడ పవిత్రమైనదన్న సత్యం వెల్లడవుతుంది. అందుకే సర్వపుణ్యతీర్థాలు సద్గురువు సన్నిధిలో వుంటాయని, గురువే సకల దేవతలనీ శ్రీ గురుగీత చెప్పింది.
ధూమల్ కు మొదటి వివాహం వలన సంతతి కలుగలేదు. భార్య మరణించే నాటికి అతడు మధ్యవయస్కుడు. ఆప్తులందరూ వంశం నిలబడడం కోసం అతనిని వివాహం చేసుకోమని వత్తిడి చేయసాగారు. నాగపూర్ న్యాయవాదిగా వున్న రావుబహద్దూర్ బాపూరావ్ తన కుమార్తె ని అతనికివ్వాలనుకున్నాడు. కాని ధూమల్ సాయి చెప్పనిదే యేమీ చేయననడం వలన అతనిని బాపూరావ్ ఒకసారి శిరిడి తీసుకు వెళ్ళాడు. వారిద్దరూ బాబా ని దర్శించుకొన్న తర్వాత మరల బాపూరావ్ ఒక్కడే వెళ్ళి బాబాతో తన కుమార్తె వివాహం గురించి మాట్లాడి వచ్చాడు. అతడా విషయం ప్రస్తావించినపుడు బాబా ముఖంలో అసమ్మతి వ్యక్తమయింది. అతడా విషయం ధూమల్ కు చెప్పి, ” బాబా చాలా గొప్పవారు. ఆయన స్పష్టంగా అనుమతిస్తేగాని నీవు వివాహం చేసుకోవద్దు” అన్నాడు. బాబా చెప్పనందువలన ధూమల్ మరల వివాహం చేసుకోలేదు.
ధూమల్ నాసిక్ లో వుండగానే అతనికి వృత్తిలో మంచి గుర్తింపు కలిగి, ప్రభుత్వం అతనిని నాసిక్ పట్టణంలోనే ‘పబ్లిక్ ప్రాసిక్యూటర్’ పదవి యిస్తానన్నది. అదే బాబా అనుగ్రహమని సరి పెట్టుకుని దానిని అంగీకరించే బదులు అతడు వెంటనే బాబాకు జాబు వ్రాసి తానా పదవి అంగీకరించవచ్చో లేదో తెల్పమని కోరాడు. శ్యామాచేత, ‘ఈ కొత్తపదవి ఎందుకు? పాతది. బాగానే వున్నది” అని జాబు వ్రాయించారు బాబా. వెంటనే ధూమల్ ఆ పదవిని నిరాకరించాడు.
ఈ భక్తుడికి ఐహికంగాను, పారమార్థికంగానూ గూడ బాబా ఎంతో మేలు చేసారు. “ఆయన నాలో లౌకిక విషయాలపట్ల దృఢమైన వైరాగ్యం పెంపొందిస్తున్నారు” అని చెప్పి ధూమల్ యిలా వివరించాడు..”సం 1910లో నేను ఇంగ్లండు వెళ్ళి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించాలని నా ఆప్తులందరూ ఆశించారు. అందుకయ్యే ఖర్చులు, అంతకాలమూ యిక్కడ నా కుటుంబపోషణలకూ బూటీ సహాయం చేస్తానని నాకు మాట యిచ్చాడు. నేను బాబా అనుమతి కోరడానికి శిరిడీ వెళ్ళాను. శ్యామా నా తరపున బాబాతో, మన భాపూను ‘బిలయత్’ (అంటే ఇంగ్లండు) పంపించవద్దా?’ అన్నాడు. బాబా, ‘ఎందుకు?’ అన్నారు. ‘ఉన్నత విద్యకోసం’ అన్నాడు శ్యామా. బాబా, “వద్దు, అతడి ” ఇలాయిత్” (సహజమైన ఆభిరుచి) మరియు ” విలయత్” (దైవ సంకల్పం) “బిలయత్”లో లేవు. ఈ దేశంలోనే వున్నాయి. అతడు బిలయత్ వెళ్ళడమెందుకు? ‘ అన్నారు. అంతటితో ఆ సంకల్పం విడిచి పెట్టాను.”
స. 1918లో బాబా మహా సమాధికి కొద్దిముందు శిరిడీ, పుణే ప్రాంతాలలో ‘ ఇన్ ఫ్లూయంజా’ వ్యాధి చెలరేగింది. పుణేలో ధుమాళ్ సోదరుని భార్యకు ఆ వ్యాధి సోకిందని నాసిక్ లో వున్న అతడికి తంతి వచ్చింది. ఆయన వెంటనే బాబా ఆశీస్సులు, ఉదీ ఆమె కోసం తీసుకు వెళ్ళదలచి దారిలో శిరిడీ చేరాడు. బాబా మళ్ళీమళ్ళీ దక్షిణకొరి అతడి వద్దనున్న పైకమంతా తీసేసుకున్నాడు. ఆయన పుణేకు వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడల్లా, సాయి, ‘రేపు చూస్తానులే!” అని చెప్పి మూడురోజులు అతనినక్కడే నిలిపివేశారు. ఇంతలో రోగి మరణించినట్లు తంతి వచ్చింది. ఆ తర్వాతనే ధుమాళ్ ని వెళ్ళడానికి బాబా అనుమతించారు. అంటే ఆయన రోగికేమి జరుగనున్నదో తెలిసి, ఆమెకు మరణమే శ్రేయస్కరమని నిర్ణయించే అలా చేసారనుకున్నారు ధుమాళ్ . “కాని ఆయన దేనినిబట్టి నిర్ణయిస్తారో నాకు తెలియదు. అంతేగాక నన్నిలా నిలిపివేయడంలో ఆయన సంకల్పమేమో తర్వాత నాకర్థమైంది. ఆయన తాను సమాధి చెందబోయేముందు వారి సన్నిధిలో కొద్దిరోజులు గడిపే భాగ్యం నాకలా ప్రసాదించారు. ” అని ధుమాళ్ భావించాడు.
యీవిధం గా సర్వస్య శరణాగతి తో మనము కూడా మన జీవిత రధ సారధి గా సాయి ని తలచి ఆయన శరణు వేడుదాము..జై సాయిరాం !
సేకరణ : పూజ్య గురుదేవులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి “సాయి సన్నిధి”