పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు మన దయినందిన జీవితం లో మనం వ్యవహరించవలసిన తీరు , నిజ సాయి భక్తులు గా మనం మారాలంటే పాటించాల్సిన విషయాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలు మొదలయిన వాటి గూర్చి వివిధ సాయి సేవాశ్రమాల్లో సాధకులకు బోధించిన విషయాలను వివిధ భాగాల రూపం లో అందరికీ అందచేయాలని ఆలోచన కల్గించారు సాయి. సాయి అనుమతి తో గురుగారి సందేశాలను మన వెబ్సైటు లో పొందు పరుస్తున్నాము ..ఈ సందేశాలను గ్రహించి , గురు మార్గాన్ని అనుసరించి సాయి ని చేరుకుందాము .
1.నీతోటి సాయిభక్తుల అనుభవాలు, అనుభూతులను సేకరించి, నీలో నిలుపుకోవటానికి వీలుగా నీలో ఒక భాండాగారాన్ని నీ హృదయములో నీవే నిర్మించుకోవాలి. అప్పుడే సాయిపై భక్తి దృఢమై, నమ్మకము స్థిరమవుతుంది.
2.సర్వత్రా వ్యాపించివున్న షిరిడిసాయి సర్వమును చూడగలడు. సర్వప్రాణుల భూత, భవిష్యత్, వర్తమానములు సాయికి తెలుసు. షిరిడిసాయి నీకు కావలసిన ప్రతిదీ చేయగల సమర్థుడు. కాని,షిరిడిసాయి కోసము తన సర్వము సమర్పించి చేయగల వ్యక్తి ఏఒక్కరూ లేరు.
3. ప్రతి ఒక్కరూ షిరిడిసాయి సేవలో శ్రమించి తమ శరీరమును పవిత్రపరుచుకోవాలి. తన భక్తులందరికి అభయప్రదాత షిరిడిసాయి ఒక్కరే.
4.అవసరములో ఆదుకొనువాడే స్నేహితుడు. నీవు ఓడిపోయినా నీ స్నేహితుడు ఎప్పుడూ నిన్ను వీడిపోడు. అట్టి ఆదర్శ స్నేహితులను చూసి షిరిడిసాయి కూడా సంతసించును.
5.నీటి ని చెట్టు వేర్లపై పోస్తేనే చెట్టుకు అన్ని విధాలుగా ఉపయోగముగుంటుంది. చెట్టుకు దూరముగా పోసిన నీరు ఆ చెట్టుకు ఉపయోగపడదు. అలాగే సరియైన పనిని, సరియైన చోట, తగిన ఆసక్తితో చేసినపుడే షిరిడిసాయి నుండి సరియైన ఫలితాన్ని పొందగలము.
6.కిందవున్న భూమి నుండి పైన వున్న స్వర్గానికి నీ స్వంత నిచ్చెన నీవే నిర్మించుకోవాలి. కృషికి తగిన ఫలితాన్ని యిచ్చుటకు ఎప్పుడూ సిద్దముగానే వుంటారు షిరిడిసాయి.
7.నీ జీవితావసరాలు నీతితో కూడిన అత్యంత విలువైనవిగా వుండునట్లు చేసుకోవాలి. అప్పుడు సాయి అభయము నీకు తప్పక లభిస్తుంది.
8.మంచితనము, క్రూరత్వము రెండూ ఈ ప్రపంచములో విస్తరించి వుంటాయి. మనిషిలోని మంచితనమును పెంచి, క్రూరత్వమును నశింపచేయు షిరిడిసాయి తత్వమును సమాజశ్రేయస్సుకై విస్తృతముగా ప్రచారము చేయవలెను. ఈ భూమిపై ఆత్మను గురించిన యదార్థజ్ఞానములేని అవిద్యాఅమాయకులను మాయా ప్రభావము నుంచి ప్రతిక్షణము తప్పక కాపాడవలసి వున్నది. అందుకే దైవము సద్గురు రూపములో షిరిడిసాయిగా అవతరించి, తనను నమ్మిన నిజ భక్తులను జ్ఞానమార్గములో నడుపుతున్నారు.
9.నీకు వ్యతిరేకముగా దుష్కృత్యాలు చేయువారిపై మండిపడవద్దు.షిరిడిసాయి నిరంతరము నిన్ను రక్షిస్తాడన్న నమ్మకముతో ప్రశాం తముగా వుండు. ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి. అన్నివేళలా పరులకు ఉపకారము చేయటానికి నీకు నీవే కంకణము కట్టుకోవాలి. షిరిడి సాయి సహాయము తప్పక లభిస్తుంది.
10. నీకంటే హీనస్థితిలో వున్నవారందరిని ఎల్లప్పుడూ రక్షిస్తూవుండాలి.షిరిడిసాయి అనుగ్రహము నీకు తప్పక లభిస్తుంది.
11. నీవు బాధలు భరించి అయినా యితరులకు మేలు చేయటమే త్యాగమంటే. నిప్పులలో పడిన భక్తురాలి బిడ్డను తన చేయి కాల్చుకుని రక్షించిన షిరిడిసాయి ఆచరించి చూపినది యిదే.
12. షిరిడి సాయిబాబావారి మహత్తర శక్తిని గురించిన జ్ఞానాన్ని నీ హృదయములో పదిల పరచుకోవాలి. షిరిడిసాయికి ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను నీవు తీర్చిదిద్దుకోవాలి.
13.తోటివారికి సహాయము చేయటము అనగా అసలైన నీలోని ఆత్మకు సహాయము చేసుకున్నట్లే. సర్వాంతర్యామి అయిన షిరిడిసాయి పరోపకారులను సర్వకాల సర్వావస్థల యందు రక్షిస్తూ వుంటారు.
14.తోటివారి మనస్సును గాయపరిస్తే, ఆ పాపము వడ్డీతో సహా తిరిగి వచ్చి నిన్ను బాధిస్తుంది. యిందుకు సాక్షి, ఫలప్రదాత షిరిడిసాయే.
15.ఎవరి భవిష్యత్తును ఎవరూ మార్చలేరు. కాని అలవాట్లను మార్చు కోవటము ద్వారా ఎవరి భవిష్యత్తును వారు మంచిగా మార్చుకోవచ్చు. షిరిడిసాయిని ఆశ్రయించి దురలవాట్లు వదిలి, మంచి అలవాట్లను పెంచుకుని భావి జీవితాన్ని సుఖమయము చేసుకోవాలి.
16. ధైర్యాన్ని కలిగి వుండటము అంటే భయము లేకుండా పోవటముకాదు. ధైర్యముతో భయాన్ని జయించటము. సర్వభయ విదూరుడు -షిరిడిసాయిని ఆశ్రయించి ప్రతి సాధకుడు తనలో ధైర్యాన్ని నింపుకోవాలి.