దాదా సాహెబ్ ఖాపర్డే
ఇతడు తన డైరీలో అలనాటి సాయి సన్నిధి మనసుకు కట్టేలా యిలా వ్రాసుకున్నాడు : ఈ డైరీ విశేషాలు చదివి సాయి భావనలని మది లో నింపుకుందాము !!
‘డిశెంబర్ 5, 1910 మేము సాయంత్రం 4 గం.లకు శిరిడీ చేరి, సాటేవాడాలో వున్నాము, మాధవరావ్ దేశ్ పాండే మమ్మెంతో ఆదరంగా చూచుకున్నాడు. వాడాలో తాత్యా సాహెబ్, నూల్కర్ కుటుంబము, ” బాపూసాహెబ్జోగ్ , సహస్రబుద్దే (దాసగణు) గూడా వున్నారు. కొద్ది సేపట్లో మేమందరం కలసి సాయి మహరాజ్ దర్శనానికి వెళ్ళాము. ఆయన మసీదులోనే వున్నారు. నేనూ, మా అబ్బాయి ఆయనకు నమస్కరించి, మేము తెచ్చిన పండ్లు, తర్వాత ఆయన కోరిన దక్షిణ సమర్పించాము. అపుడు సాయి, తమకు 2 సం.లకు పైగా స్వస్థతగా వుండడంలేదని, కేవలం ఒక్క బార్లీరోరొట్టె , కొద్ది నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వున్నామని చెప్పారు. ఆయన తమ పాదంలో చిన్న గాయం చూపి, అది నారి కురుపని, ఆ నారి బయటకు తీస్తుండగా తెగిపోయి మరల పుండయిందనీ, తమ స్వస్థానం చేరేవరకు స్వస్థత చేకూరదని విన్నామనీ గూడ అన్నారు. ‘ఆ మాట మనసులోనే వుంచుకున్నాను గాని ఆ విషయమై యింకేమీ చేయలేదు. నాకు నా ప్రాణంకంటే గూడ నావాళ్ళే ఎక్కువ ముఖ్యం’ అన్నారు సాయి. అయినా ప్రజలు తమను నిరంతరం వేధిస్తుండడం వలన తమకు విశ్రాంతే దొరకడంలేదని, అయినప్పటికీ ఎవరు చేయగలిగింది ఏమీలేదనీ చెప్పి మమ్మల్ని వాడాకు వెళ్ళమన్నారు”
”డిశెంబర్ 7, 1910 : నేటి మధ్యాహ్నం నేను, మా అబ్బాయి, సహస్రబుద్దే, బాపూసాహెబ్ , వారి పిల్లలు కలసి మశీదుకు వెళ్ళాము. అక్కడ సాయిమహరాజ్ ఎంతో ఉత్సాహంగా వున్నారు. ఆయన సహస్ర బుద్దేను “ నీవు వచ్చింది బొంబాయినుండేనా?’ అని అడిగి, అవునని అతడు చెప్పగానే, “మళ్ళీ తిరిగి బొంబాయికే వెళ్తావా ? ‘ అన్నారు. ‘బొంబాయికే వెళ్తానుగాని అక్కడ ఎంతకాలముంటానో తెలియదు. పరిస్థితులమీద ఆధారపడుతుంది.” అన్నాడతడు. సాయి, ‘అవును అది నిజమే, నీవు చూచుకోవలసిన పనులెన్నో వున్నాయి. చేపట్టవలసినవింకెన్నో వున్నాయి. అయినా నీవిక్కడ 4,5 రోజులైనా వుండాలి, వుంటావు గూడ.నువ్వే చూస్తావుగా ! నీకు కలిగిన అనుభవాలన్నీ వాస్తవాలే, అవి ఊహాజనితాలుగావు. కొన్ని వేల సం.ల క్రిందట గూడా నేనిక్కడున్నాను’ అన్నారు. అపుడు ఆయన నా వైపు తిరిగి వేరొక ధోరణిలో, ‘ఈ ప్రపంచమంతో చిత్రమైనది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగానే చూచుకుంటాను. అయినా కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినదేమున్నది? మృత్యువు దాపరించనున్నవారు గూడ ఇతరులు చావాలని కోరుతారు. అందుకు తగిన యత్నాలుగూడ చేస్తారు. వారివల్ల నాకెంతో జుగుప్స, బాధ కలుగుతాయి. అయినా నేనేమీ అనలేదు. మౌనంగా వూరుకున్నాను. భగవంతుడెంతో గొప్పవాడు ఆయన సేవకు లెల్లెడలా వున్నారు. వారు సర్వశక్తిమంతులే. భగవంతుడు మననేస్థితిలో వుంచితే అలాగే తృప్తిగా వుండాలి. నాశక్తి అపారం. 8, 10 వేల సం.ల క్రిందటే నేనిక్కడున్నాను’…. నేను, ‘ఈరోజు భోజనమందరికీ పంచేటప్పుడు మీరు ”కొట్టవద్దు, కొట్టవద్దు!” అని ఎందుకు కేకలేసారు?’ అని అడిగాను. ఆయన, ” పాటిల్ కుటుంబంలో బేధాభిప్రాయాలొచ్చి తగవులాడుకుంటున్నారు. అందుకని అలా అన్నాను” అన్నారాయన. పొడుగునా సాయి మహరాజ్ చెప్పలేనంత మధురంగా మాట్లాడారు; ఎంతో తరచుగా అలౌకికమైన సౌందర్యంతో చిరునవ్వులు చిందించారు. నేటి సంభాషణ నా హృదయం పై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. దురదృష్టవశాత్తు మధ్యలో యితరులు దర్శనానికి రావటంతో ఆ సంభాషణకు అంతరాయం కలిగింది. మేమందరమూ ఎంతో నిరాశ చెందాము.”
డిశంబర్9, 1911: నేడు మసీదులో సాయి మహరాజ్ ఎంతో హుషారుగా వున్నారు. నా హుక్కా తీసుకెళితే దానినుండి ఆయన పొగ పీల్చారు. ఆరతి సమయంలో ఆయన ఆశ్చర్యమే సేంత అందంగా వున్నారు. కాని అందరినీ వెంటనే అక్కడనుండి పంపివేశారు. ఈరోజు మాతో కలిసి భోంచేయడానికి వస్తామన్నారు. మేము బసకురాగానే, సుస్తీ వున్న దీక్షిత్ కుమార్తె చని పోయిందని తెలిసింది. ఆ పాపకు కొద్దిరోజుల క్రిందట సాయి మహరాజ్ తనను వేపచెట్టు క్రింద వుంచినట్లు స్వప్నమొచ్చింది. ఆ పాప చనిపోయిందని సాయిమహరాజ్ నిన్ననే అన్నారు. ఆపాప వయస్సు 7 సం.లే. నేను వెళ్ళి శవాన్ని చూస్తే ఆ పాప ముఖం ప్రత్యేకమైన కళతో ఎంతో అందంగా వున్నది. అది చూస్తుంటే నేను ఇంగ్లాండ్ లో చూచిన ”మెడోనా’ చిత్రం గుర్తుకొచ్చింది. మా వాడా వెనుకనే జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యాను. అంతటి విఘాతాన్ని గూడా దీక్షిత్ ఆశ్చర్యకరమైన నిబ్బరంతో ఎదుర్కొన్నాడు. అతని భార్య మాత్రం శోకంతో కుప్పకూలిపోయింది.
డిశంబర్ 10, 1911: మధ్యాహ్నం సాయిమహరాజ్ ను దర్శించడానికి రెండుసార్లు ప్రయత్నించినా ఆయన ఎవరినీ తమచెంతకు రానీయలేదు. సాయంత్రం నర్సోబావాడినుండి గోఖలే అను ఒకరొచ్చారు. ఖేడ్గాంవ్ లోని నారాయణమహరాజ్ ను, సాయిమహరాజ్ ను దర్శించమని అతనికక్కడ దివ్యమైన ఆదేశమొచ్చింది. అతడెంతో బాగా పాడుతాడు. రాత్రి అతనిచేత సాయి కొన్ని భజన పాటలు పాడించుకున్నారు.
సేకరణ : పూజ్య గురువులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి “సాయి సన్నిధి “