దాదా సాహెబ్ ఖాపర్డే డైరీ
డిశంబర్ 17, 1911: కళ్యాణ్ నుండి వచ్చిన దర్వేష్ సాహెబ్ ఫాల్కేను హాజీసాహెబ్ అనికూడా అంటారు. అతడు పాతకాలానికి చెందిన ఎంతో మంచి మనిషి, అతడు బాగ్దాద్, కాన్ స్టెంట్ నోపుల్, మక్కా మొ.న ప్రాంతాలలో పర్యటించి వచ్చాడు. అతని సాంగత్యమెంతో బాగుంటుంది. అతని నుండి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సాయిమహరాజ్ కు అతడంటే ఎంతో ప్రీతి. అతడికాయన ఆహారంకూడ పంపి యింకెన్నో రీతుల అభిమానంగా చూచుకొంటారు. అతని పూర్తి పేరు దర్వేష్ హాజీ మహమ్మద్ సిద్దిక్. రాత్రి అతనికి కలలో బాబా కనిపించి తాను కోరినది అనుగ్రహించారనిచెప్పాడు.
డిశంబరు 22, 1911: ఈరోజు సాయి మహరాజ్ ప్రత్యేకించి ఆనందంగా వున్నారు. అయినా ఏమీ మాట్లాడకుండా మశీదుకు వెళ్ళారు. ఇవాళ దర్వేష సాహెబ్ వూరికి వెళ్ళాలనుకుంటే సాయి అనుమతివ్వలేదు. అతనికి సుస్తీచేసి జ్వరమొచ్చింది. డా.హాలే అతనికి వైద్యం చేశాడు. ఇక్కడుంటున్న టిప్నిస్ భార్యకు గూడ అతడు మందిస్తున్నాడు. ఆమెకోసం రామ్ మారుతీ మహరాజ్ గూడా యిక్కడే వుండిపోయారు. నేటి సాయంత్రం ఆమెకు మూర్చ వచ్చింది. కాని ఆమెకు దయ్యం పట్టినదని తర్వాత తెలిసింది. దీక్షిత్, మాధవరావ్ మొ.న వారు ఆమెను చూచివచ్చారు. ఆమె నివసిస్తున్న యింటి యజమాని; మరి యిద్దరు మహర్ జాతివారు దయ్యాలై ఆమెను పట్టారు. బాబా వారించకుంటే ఆమెను చంపేవాళ్ళమని ఆ దయ్యాలు చెప్పాయి. ఆమెను వాడకు తరలిస్తామని చెబితే, అక్కడ బాబా తమను కొడతారని, కనుక అలా చేయవద్దని దయ్యాలు బ్రతిమాలాయి.
డిశంబరు 23, 1911: దర్వేష్ సాహెబ్ కు తిరిగి వెళ్ళడానికి సాయి అనుమతి లభించింది. అతడు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించినట్లున్నాడు, అతనిని సాగనంపడానికి సాయిమహరాజ్ పడిపోయిన గోడవరకూ వచ్చారు. ఈరోజు కాకా మహాజని మంచి పండ్లు, దీపాలు పెట్టడానికి అందమైన గాజుగోళాలు తెచ్చాడు. భయందర్ నుండి గోవర్ధన్ దాస్ గూడా మంచి పండ్లు, చావడిలో అమర్చడానికి పట్టుతెరలు, ఛత్రచామరాలు పట్టుకునే సేవకులకోసం కొత్త వస్త్రాలు తెచ్చారు. మాధవరావ్ కు నా కుటుంబానికి మధ్య మేము, దీక్షిత్ వాడాలో వుండడం గురించి భేదాభిప్రాయం వచ్చింది. వాడా తమదేనని, దీక్షిత్ సొత్తుగాని లేక మాధవరావ్ సొత్తుగాని కాదని సాయి అన్నారు. అంతటితో ఆ సమస్య తీరిపోయింది…సాయి తమ చిలింనుండి పొగపీల్చే అవకాశం నాకిచ్చారు. ఆయన రోజు తమకొక మంచివార్త వస్తుందన్నారు. వామన్ రావ్ పాటిల్ యల్.యల్.బి. పరీక్ష పాసైనట్లు తెలిసింది. టిప్నిస్ తన బనమార్చగానే అతని భార్య పరిస్థితి మెరుగైంది. తర్వాత మేమంతా శేజారతికి వెళ్ళాము. చావడి వుత్సవ మేంతో బాగున్నది. కొత్త తెరలు, దుస్తులు ఎంతో అందంగా వున్నాయి. అంత విలువైన కాన్కలు సమర్పించే శక్తి నాకు లేకపోవడం ఎంతో బాధగా వుంది.
జనవరి 12, 1912: నేను ఉదయం సాయి వ్యాహ్యాళినుంచి వచ్చాక వారిని దర్శించాను. ఆయనెంతో ప్రసన్నంగా మరల మరల వారి చిలిమ్ నుండి నన్నుగూడ పొగపీల్చుకోనిచ్చారు. అది పీల్చగానే నా సంశయాలన్నీ తొలగిపోయి నాకెంతో ఆనందం కలిగింది. మధ్యాహ్నం ఇద్దరు నాట్యకత్తెలు మధురంగా పాడుతూ నృత్యం చేశారు. సాయి మహరాజ్ ఎంతో ప్రేమగా బల్వంత్ ను పిలిపించుకొని, సాయంత్రం వరకూ అతనిని తమ సన్నిధిలో వుండనిచ్చారు.
జనవరి 13, 1912: కాకడ ఆరతికి హాజరయ్యాను. ఈరోజు సాయి ఒక్కమాట గూడ మాట్లాడలేదు. నిత్యమూ అందరికీ ప్రసాదించే యోగదృష్టిని గూడా ఆయన ప్రసాదించలేదు.
జనవరి 15, 1912: సాయి మహరాజు బయటికి వెళ్ళేప్పుడు ఉదయమంతా నేనెలా గడిపానని అడిగారు. నేను సద్గ్రంధము చదివి మననం చేయనందుకు వారలా ఎత్తిపొడిచారు.
జనవరి 16, 1912: నేటి వుదయం ఉపాసనీ శాస్త్రి ”పరమామృతము” అనే వేదాంత గ్రంథం చదువుతూంటే నేను వివరించాను. సాయి మశీదుకు తిరిగి వచ్చాక నేను వెళ్ళడం ఆలస్యమైంది. ఎట్టి అసంతృప్తి ప్రకటించక ఆయన నాతో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. సాయంత్రం మేము మశీదుకు వెళ్ళినపుడు ఆయన మమ్మల్ని ఎక్కువ సేపు అక్కడ కూర్చోనివ్వలేదు. వారుగూడా ఈరోజు వ్యాహ్యాళి త్వర త్వరగా ముగించుకొని వచ్చి మమ్మల్ని వెంటనే మా గదులకు వెళ్ళమని ఆదేశించారు. మకపుడు అర్ధం లేదు గాని, మేము వసతి గృహానికి తిరిగి వచ్చాక, అస్వస్థతగావున్న దీక్షిత్ యింటి పనివాడు హరి అంతకు కొద్దిముందే మరణించాడని తెలిసింది. మేము ఆరతి వసతి గృహములోనే చేసుకొని తర్వాత చేజారతికి వెళ్ళాము. ఈరోజు సాయిమహరాజు మా అందరి పై ప్రత్యేకమైన అనుగ్రహం చిందించారు; అలౌకికమైన సంతోషము, జ్ఞానము అద్భుతమైన స్రవంతి గా అందరికీ లభించాయి. రామ మారుతిని గూడ ఆయన అలానే ప్రత్యేకంగా అనుగ్రహించారు. తర్వాత అందరమూ కలసి చావడిలో కాకడ ఆరతికి హాజరయ్యాము. మేఘునికి మరీ అస్వస్థతగా వుండడంవలన అతడు రాలేకపోయాడు. ఆరతి బాపూసా హెబ్ జోగ్ చేశాడు. సాయి ఎంతో ప్రసన్నంగా చిరునవ్వులొలికించారు. ఆ నవ్వు ఒక్కసారైనా చూడడానికి యిక్కడ కొన్ని సం!! లైనా వేచివుండవచ్చు. పట్టరాని సంతోషంతో నేను పిచ్చివానిలా చూస్తుండిపోయాను.
దాదా సాహెబ్ ఖాపర్డే మరియు అయన భార్య మనూతాయి
జనవరి 18, 1912: తర్వాత సాయి మహరాజు వేరొక కథ చెప్ప నారంభించారు గానీ, అంతలోనే అపరిచితుడైన ఒక ఫకీరు వచ్చి సాయి పాదాలకు నమస్కరించాడు. సాయికోపంతో అతనిని విదిలించుకోబోయారుగానీ, అతడెంతో ప్రశాంతమైన పట్టుదలతో వారి పాదాలు పట్టుకొన్నాడు. చివరికతడు బయటకు వెళ్ళి ప్రహరీగోడవద్ద నిలబడ్డాడు. సాయి ఉగ్రులై ఆరతి పాత్రలు, భక్తులు సమర్పించిన నైవేద్యాలు విసిరి పారేశారు. తర్వాత రామ్మారుతీబువాను అమాంతం పైకెత్తారు. ఆ సమయంలో అతనికి ఊర్థ్వలోకాలకు వెళ్ళినంత సంతోషం కలిగిందిట. భాగ్య అనే వ్యక్తిని, మరొక గ్రామస్థుణి గూడా సాయి కొట్టారు. సీతారాం అనే వ్యక్తి ఆరతి ప్రారంభించాడు. మార్తాండ్ మహల్సాపతి ఎంతో సమయస్పూర్తితో ఆరతి సక్రమంగా పూర్తయ్యేలా చూచాడు. బాబా తమ ఆసనం పైనుండి లేచిపోయినప్పటికీ భక్తులు ఆరతి కొనసాగించారు. అది పూర్తయ్యేలోగా బాబా మరల తమస్థానంలో కూర్చొని సమిష్టిగా అందరికీ ఊదీ పంచారు. నేటి సాయంత్రం అస్వస్థత వలన మేఘుడు నిలబడలేకపోయాడు. అతనికి అంతిమ ఘడియ ఆసన్నమైనదిని సాయి చెప్పారు.
జనవరి 19, 1912: తెల్లవారుఝామున 4 గం.లకు మేఘుడు మరణించాడు… అంత్యక్రియలు పూర్తయ్యాక నేను, జోగ్ కబుర్లతో గడి పేశాము. ‘నేను సాయంత్రం సాయి దర్శనానికి వెళ్ళినపుడు నేను మధ్యాహ్నమంతా ఎలా గడిపానని సాయి అడిగారు. సమయమంతా కబుర్లతో వృధాచేశానని చెప్పవలసి వచ్చినందుకు నాకెంతో బాధకల్గింది. ఇది నాకొక గుణపాఠం. సాయి మూడు రోజుల కిందటే, ” ఇదే మేఘుడిచ్చే చివరి ఆరతి” అన్నారు. మేఘుడు తన సేవ పూర్తయిందని, తన జీవితం ముగియనున్నదని చెప్పి తన గురువైన సాఠేను చూడలేకపోయినందుకు కంటనీరు పెట్టాడు. సాయివద్దవున్న ఆవులను కట్టు విడిపించమని తన చివరి కోరిక కోరాడని, మరేమీ కోరలేదనీ సాయి చెప్పారు.