దాదా సాహెబ్ ఖాపర్డే డైరీ-3
జనవరి 27, 1912: సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళేప్పుడు నాతో ఎంతో గంభీరంగానూ, ప్రశాంతంగాను వున్నారు. కానీ చివరకు కోపంతో చాలా చెడ్డగా కేకలేశారు. సూర్యాస్తమయం తర్వాత వారి కోపం మరి హెచ్చింది; కొత్తగా ఇస్లాం మతం తీసుకున్న ఇబ్రహీం అనే వ్యక్తి మశీదులో నింబారు మీద చేతుల పెట్టి నిలుచున్నందుకు అతనిని బాబా తీవ్రంగా మందలించారని నా సాటివారు చెప్పారు. ఈరోజు రాధాక్రిష్ణ అయీ తమ గుడ్డలుతికినందుకు సాయి ఆమె పై ఎంతో కోపగించుకున్నారు.
జనవరి 28, 1912: మా గదిలో అస్వస్థతగావున్న మా అబ్బాయి బల్వంత్ కు నిద్రాభంగం కల్గకుండా మేము బాపూసా హెబ్ జోగ్ యింట్లో “పరమామృతము” చదువుకున్నాము. తర్వాత మేము సాయి మహరాజ్ ను దర్శించినపుడు నేను ఉదయమంతా ఎలా గడిపావని అడిగారు. నేను వివరంగా చెబితే ఆయనెంతో సంతోషించారు.
జనవరి 31, 1912: మేము కాకడ ఆరతినుండి వచ్చేటప్పుడు సాయి మహరాజ్ కొద్ది కోపం ప్రకటించారు. నేడు మేఘుడు చనిపోయిన పదమూడవరోజు సందర్భంగా భక్తులందరికీ దాదా కేల్కర్ భోజనం పెట్టాడు. సాయంత్రం మశీదులో సాయి ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పారు. మధ్యలో పాట పాడుతూ నృత్యం చేశారు. వారిని చూస్తుంటే అలనాటి గోకులంలోని శ్రీకృష్ణుడు గుర్తొచ్చాడు.
ఫిబ్రవరి 2, 1912: ఈ రోజు భక్తులందరికీ బద్దకం ఆవరించి అందరమూ ఆలస్యంగా నిద్రలేచాము. నేను ప్రార్థన ముగించుకుని మశీదుకు వెళ్ళగానే, బయటనుండే ఊదీ తీసుకుపొమ్మని సాయి ఆదేశించారు. నేనలానే చేశాను. నేను అమ్రావతికి వెళ్ళడం గురించి తాను బాబాను అడిగానని, కాని “నేను ముసలివాణ్నిఅయ్యాను, నావాణ్ని యిపుడు దూరంచేసుకోవడం నాకిష్టంలేదు” అని సాయి అన్నారనీ మాధవరావ్ చెప్పాడు. అంతకు ముందు సుమారు 20 మంది గుంపుగా సమీపంలోని పట్టణానికి వెళ్ళినపుడు, వారంతా దొమ్మికి వెళ్ళినట్లు ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, అందులో నిష్కారణంగా మాధవరావ్ పేరు గూడ యిరికించారని తెలిసి అందరమూ కలత చెందాము.
ఫిబ్రవరి 4, 1912: నారాయణరావు భమన్ గాఁవ్ కర్ అనే భక్తుని కోసం ఎవరో యిద్దరు వ్యక్తులొచ్చారు. వారిలో పెద్దవాడైన శివానందశాస్త్రితో గూడా యిద్దరు బ్రాహ్మణ స్త్రీలొచ్చారు. వారిలో బ్రహ్మానందబాయికి మూడు సం.ల క్రిందట నాశిక్ కు చెందిన నిజానందబాయి అను యోగిని ఉపదేశమిచ్చిందట. బ్రహ్మానందబాయి సాయిని పూజించి రెండు ఆరతి పాటలు ఎంతో మధురంగా పాడింది.
ఫిబ్రవరి 5, 1912: మశీదులో ఆరతి అయ్యాక సాయి అందరికీ ప్రసాదమిచ్చి పంపి వేస్తూ నన్ను పేరు పెట్టి పిలిచి, సోమరితనం వదులుకొమ్మని స్త్రీలను, పిల్లలను జాగ్రత్తగా చూచుకొమ్మనీ హితవు చెప్పారు. శ్రీమతి లక్ష్మీబాయి కౌజలగీకి ఒక రొట్టెముక్క యిచ్చి, రాధాక్రిష్ణ అయీతో కలసి భుజించమని సాయి చెప్పారు. ఇది మహాదృష్టం. ఇక ముందంతా ఆమె సంతోషంగా జీవించగలదని యిది సూచిస్తుంది.
ఫిబ్రవరి 6, 1912: నేను తిరిగి యిల్లు చేరడానికి నాకు సాయి అనుమతి లభించగలదని మాధవరావ్ చెప్పాడు. నేను వుదయం 7-30 గంలకు మశీదుకు వెడితే, సాయి నన్ను సాయంత్రం రమ్మన్నారు. నేను సాయంత్రం మశీదుకెళ్ళేసరికి నేను రేపు వెళ్ళవచ్చుననీ, తామా విషయం రాత్రి – పగలు సుదీర్ఘంగా ఆలోచిస్తున్నామనీ సాయి చెప్పారు. ఆయన, ”అందరూ దొంగలే, కాని ఏం చేస్తాం?” అని బాబా అన్నారు. వాళ్ళతో ఎలా నెట్టుకు రావాలో, ”వారిని బాగు చేయడమో, లేక రూపుమాపడమో ఏదో ఒకటి చేయమని అల్లాని రాత్రింబవళ్ళూ ప్రార్థిస్తున్నాను. కాని ఆయన జాగు చేస్తున్నారు. ఈ వైఖరిని ఆయన ఆమోదించడంలేదనిపిస్తోంది. ఒకటి రెండు నెలలు వేచి చూస్తాను. కాని బ్రతికో, చచ్చో నా ప్రార్థన సఫలం చేసుకుంటాను. తేలీ వద్దకు కానీ, వణి వద్దకు గాని వెళ్ళి అర్థించను. నేటి ప్రజలలో మంచితనము, భక్తి, స్థిరచిత్తమూ లేవు. ఎవరో కొద్దిమంది సమావేశమై సద్గోష్టి చేసుకుని ధ్యానం చేసుకుంటారు” అన్నారు సాయి.. నేను మావూరు వెళ్ళడం గురించి ఫకీరు బాబా ప్రస్తావిస్తే, “అతడు రేపు వెడతానన్నాడుగదా?” అని సాయి అన్నారుట. నాభార్య అడిగితే, ”అతడు నన్నడగలేదుకదా, నేనేమి చెప్పను?” అన్నారుట. కొద్ది సేపట్లో నేనచటికి వెళ్ళేసరికి, నేను దాదా భట్ వద్ద రు. 500/-లు, మరొకరివద్ద రు. 200/-లు తెచ్చివారికి సమర్పించేంతవరకూ నేను వెళ్ళడానికి వీల్లేదని సాయి చెప్పారు.
ఫిబ్రవరి 7, 1912: సాయి వ్యాహ్యాళికి వెళ్ళివచ్చాక నేను మశీదుకు వెళ్ళాను. అక్కడ ముంగిట్లో ఒకబిచ్చగాడు కోతిని ఆడిస్తుంటే సాయిచూస్తున్నారు. అక్కడ ఒక గాయకురాలు, ఒక నర్తకీగూడ వున్నారు. తర్వాత గాయకి మధురమైన కంఠంతో మంచి భక్తికీర్తనలు పాడింది. తర్వాత – శివానందశాస్త్రి, బ్రహ్మానందబాయీ వచ్చి సాయికి పూజ చేశారు. వారందరూ ‘అమ్మ గారు’ అని పిలిచే బ్రహ్మానందబాయి ఎంతో మధురంగా పాడింది.
ఫిబ్రవరి 9, 1912: ఉదయం నేను మశీదుకు వెళ్ళాను. బాబా ఎంతో సంతోషంగా వున్నారు. కిషా అనే పిల్లవాడు గూడా వచ్చాడు. మేమంతా అతనిని పీష్యా అంటాము. సాయి అతనిని చూడగానే, అతడు గత జన్మలో రోహిల్లా అని, చాలా మంచివాడని, ఎంతో సేపు ప్రార్థన చేసేవాడనీ చెప్పారు. ఒకప్పుడుతడు సాయీ సాహెబ్ గారి తాతగారి యింటికి అతిధిగా వచ్చాడట. వారి తాతగారి సోదరి వేరుగా జీవిస్తుండేదట. అప్పుడు చిన్నపిల్ల వాడుగా వున్న సాయి, ఆ రోహిల్లా ఆమెను పెళ్ళి చేసుకోవాలని పరిహాసమాడారట. తర్వాత అలానే జరిగిందట. అతడు ఎంతోకాలమక్కడే జీవించి తర్వాత వారిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారట. అతడు చనిపోయాక సాయియే అతనిని యిప్పటి తల్లి గర్భంలో వుంచారట. పీష్యా చాలా అదృష్టవంతుడౌతాడని, కొన్ని వేలమంది అతనిని శరణు బొందుతారనీ సాయి చెప్పారు. మధ్యాహ్న ఆరతి జరుగుతుండగా సాయి ఏవో సైగలతో శివానందశాస్త్రీకి ఏమో బోధించారట గానీ శాస్త్రికి అర్థంగా లేదు. ఆయన అలాగే జోగ్ వైపు గూడ తిరిగి సైగలు చేశారు.
సేకరణ : పూజ్య గురువులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి “సాయి సన్నిధి “