దాదా సాహెబ్ ఖాపర్డే డైరీ-4
మార్చి 12: మే మీరోజే ”పంచదశి’ పాఠం పూర్తి చేసుకొని రెండు దానిమ్మపళ్ళు నివేదించుకున్నాము. ఆమ్రావతి నుండి బాబా పాలేకర్ (ఖాపర్థి వద్ద పనిచేస్తున్న న్యాయవాది) వచ్చి అక్కడ నాకుంటుంబం యొక్క పరిస్థితిలేమీ బాగా లేవని చెప్పాడు.
మార్చి 13: నన్ను రేపుగాని లేక ఎల్లుండిగానీ యింటికి తీసుకు వెళ్ళడానికి సాయిబాబావద్ద పాలేకర్ అనుమతి సంపాదించాడు.
మార్చి 15: నేను, పాలేకర్ దీక్షిత్ కలసి మసీదు కెళ్ళాము. నేను అమ్రావతీ వెళ్ళడం గురించి దీక్షిత్ ప్రస్తావించారు. బాబా అనుమతించాక నేను బసకువచ్చి సామాన్లు సర్దమని నా భార్యతో చెప్పాను. ఆమె మాత్రం భీష్మ, బందూలతోపాటు ” యిక్కడే వుండిపోతుంది. మధ్యాహ్నం భోజనమయ్యాక నేను, పాలేకర్ కలసి సాయిబాబా దర్శనానికి వెళ్ళాము.
గ్రామం యొక్క గేటు వద్ద ఆయన కన్పించారు. వారి ఆదేశం ప్రకారం మేము తీసుకువెళ్ళి ఊదీ తెచ్చి వారికిచ్చి వారి చేతిమీదుగా తీసుకున్నాము. ఆయనే, ” అల్లా భలాకరేగా” – ” భగవంతుడు మేలు చేస్తాడు” అని మమ్మా శీర్వదించి మమ్మల్ని వెంటనే బయలుదేరి వెళ్ళమన్నారు. మేము సాయంత్రం 7 గం.ల రైల్లో కోపర్గావ్ నుండి మన్మాడ్ చేరాము. ఆ ప్రక్క ఫాట్ ఫారం మీద మేమెక్కవలసిన పాసింజర్ బండి సిద్దంగా వున్నది. పాలేకర్ ను మా యిద్దరికీ టికెట్లు తెమ్మని పంపాను. కానీ అతడు తెచ్చేలోపలే రైలు బయలుదేరింది. టికెట్ కలెక్టర్ మా పెట్టెలోనే వుంటే అతడికీ పరిస్థితి వివరించాను. అతడు నన్ను భూసావల్ లో దిగి పాలేకర్ ను కలుపుకొని సాగిపొమ్మన్నాడు. నేనీ క్షణంలో యిక్కడ (భూసావల్ స్టేషన్ లో) పాలేకర్ కోసం ఎదురుచూస్తున్నాను. నాదగ్గర టికెట్ గాని, కించితైనా డబ్బుగానీ లేదు.”
ఖాపర్డె మార్చి, 16న అమావతీ చేరాక, శిరిడీ విడవడం వలన తానెంతటి అదృష్టం కోల్పోయినదీ కొంతవరకు గుర్తించాడు.
మార్చి 18: మార్చి 18న తన డైరీలో యిలా వ్రాసుకున్నాడు : “ శిరిడీలో వున్న ఆధ్యాత్మిక వాతావరణం యిక్కడ లేనేలేదు. నేను కోల్పోయినదెంతటిదో నాకు తెలుస్తున్నది. నేను శిరిడీలోలాగే తెల్లవారుఝామున నిద్రలేవాలనుకుంటాను గాని, అలా .చేయలేకున్నాను. అందువలన ఉదయమే స్తోత్రాలు చదువుకొనడం ఎంతో కష్టమౌతున్నది.”
డిసెంబర్ 29, 1915: అటు తర్వాత అతడు డిసెంబర్ 29, 1915న శిరిడీ దర్శించిన వివరం యిలా వ్రాశాడు : ‘నేను కోపర్గాం నుండి టాంగా మీద బయలుదేరి ఉదయం 9గo.లకు శిరిడీ చేరాను. దారిలో ఎన్నో ప్రమాదాలున్నాయి. నా భార్యాబిడ్డ అప్పటికే శిరిడీ చేరారు. నేను మశీదుకు వెళ్ళి సాయిబాబాకు నమస్కరించాను. నేనారోజు పూజలో ‘మోర్చల్’ (నెమలిఫించపు విసనకర్ర) పట్టుకొన్నాను. బాపూ సాహెబ్ బూటీ, కాకాదీక్షిత్, బాలాభాఠె మొ.న పాత మిత్రులందరూ యిక్కడున్నారు. రోజంతా ఎంతో సంతోషంగా గడిచింది.”
డిశెంబర్ 30: ఈరోజు నేను పూజ చేసుకొని నైవేద్యం పంచాను. ఆ ప్రసాదానికి దాదాపు 100 మంది వచ్చారు. ఇవాళ భోజనమెంతో బాగున్నది. అది అయ్యేసరికి సాయంత్రం సుమారు 4గం అయింది. బూటీ నిర్మిస్తున్న వాడా కట్టుబడి బాగానే సాగుతోంది. ఈరోజు చావడి ఉత్సవం జరిగింది. ఈరోజు గూడా నేను మోర్చల్’ పట్టుకొని నుంచున్నాను.
డిశెంబర్ 31: ఈరోజు భోజనమయ్యాక మాధవరావ్ దేశ్ పాండేతో కలసివెళ్ళి ఎట్టి యిబ్బందిలేకనే తిరుగు ప్రయాణమవడానికి అనుమతి సంపాదించుకున్నాను. నా భార్య, మనూతాయి, మా పిల్లలూ యిక్కడే వుంటారు.”
మార్చి, 1918లో ఖాపర్డెమరొక్కసారి శిరిడీ వచ్చాడుగాని, ఆ తేదీలు మాత్రం అతని డైరీలో లేవు. కారణం అతడు స్వయంపాలన (Home Rule) కోరడానికి కాంగ్రెస్ ప్రతినిధి వర్గంతోపాటు యింగ్లాండ్ వెళ్ళవలసి వున్నది.