సాయి మాటే మంత్రము

423198_284625754930524_122603472_n (1).jpg

సాయి మాటే మంత్రము

సాయి మన జీవితం గూర్చి ఇచ్చే సలహాలు ఆయా సందర్భర్భాల్లో , అప్పటికి సరిఅయినవి కావేమోనని మనకు అప్పుడప్పుడూ అనిపిస్తుంది , కానీ భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలు గూర్చి సర్వం గ్రహించే సాయి నాధుడు మనకు ఏది సరయినదో అదే సలహా రూపం లో చెప్తారు. కొందరు సాయిభక్తుల జీవితాల్లో ని సంఘటనలు ఈ విషయం నిరూపిస్తాయి.

ఈ విషయం లో సాయి సమకాలీన భక్తుడు సోమనాధ్ దేశపాండే కి జరిగిన సాయి అనుభవాలు ఈరోజు తెలుసుకుందాము వారి మాటల్లోనే.. 

“నా తండ్రి నన్ను బాల్యంనుండీ బాబా వద్దకు తీసుకువెళ్ళేవాడు: బాబా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. నన్ను ఆయన ముద్దుగా “సోమ్నియా అని పిలిచారు.

నేను 1912లో పోలీస్ సబ్-యిన్ స్పెక్టరుగా కోపర్గాంలో పనిచేశాను. శిరిడీ గూడా నా ఉద్యోగ పరిధిలో వుండేది. మా తండ్రి ఆదేశాన్ని, మొక్కునూ అనుసరించి ప్రతి నెలా జీతంరాగానే మొదట రు. 21/-లు బాబాకు M.O. ద్వారా పంపేవాణ్ణి. ఒకసారి నేను, మాతండ్రి శిరిడీ వెళ్ళినప్పుడు బాబా నావద్ద రు. 10/-లు దక్షిణ తీసుకున్నారు. అపుడు వారి భావమేమో మాకర్థం గాలేదు. కాని తర్వాత సరిగ్గా ఆ తేదినుండే నా జీతం రు. 10/-లు పెంచారని తెలిసింది. అంతేగాక, ఒక్కొక్కప్పుడు బాబా మశీదులో కూర్చొని, తమ వద్దనున్న నాణాలను వేళ్ళతో రుద్దుతూ, ‘ఇది కాకాది, యిది సోమ్యాది’ అని గొణుగుతుండేవారట. అందువలన బాబా మమ్మల్నెంత తరచుగా గుర్తుచేసుకొనేవారో, అది మాకెంత శ్రేయస్కరమో మా తండ్రి చెప్పేవాడు.

మా తండ్రి  జీవితంలో చివరి మూడు సం.లూ ఆయన గురించి బాబా ఎంతో జాగ్రత్త తీసుకునేవారు.

పూణేలో నా భార్యకు నెలలు నిండినపుడు (1916) సహాయం చేయాలని మా తల్లిదండ్రులు బయలుదేరారు. బాబా త్వరలో సమాధి చెందబోతారని విని దారిలో శిరిడీ వెళ్ళారు కాని బాబా వాళ్ళను శిరిడీ విడిచి వెళ్ళనివ్వలేదు. కారణం తెలియక, శ్యామా గూడా మా తండ్రి తరపున బాబాను సెలవుకోరాడు బాబా, ‘నా వాళ్ళను చంపదలచావా ఏమి? కాక యిక్కడుంటే నీ అబ్బ సొత్తేమైనా తింటున్నాడా? ‘ అన్నారు. శ్యామా, కాదు, వారి కోడలు ప్రసవించనున్నది. ఆమెకు సహయం కావాలి గదా?’ అన్నాడు. అప్పుడు బాబా, ఓ అరే కాకా, ఎందుకు కంగారుపడతావు? భగవంతుడు మేలు చేస్తాడు, అన్నారు. తరువాత మరొకరోజు మా తండ్రి సెలవు కోరినపుడు బాబా, “నన్ను సమాధి చేసిన తర్వాత వెళ్ళు!’ అని వాళ్ళను నిలిపేశారు. వాళ్ళు తప్పక వస్తారని తలచి నేను పూణేలో వేరే ఏర్పాట్లు చేసుకోలేదు. అకస్మాత్తుగా ఒకనాటి రాత్రి 10 గం.లకు నా భార్యకు నొప్పులొస్తే ఆస్పత్రిలో చేర్చాము. మేమింకా నర్సుతో మాట్లాడుతుండగనే సుఖప్రసవమై మగబిడ్డ పుట్టాడు. ఆ సమయంలో శిరిడీలో బాబా నా తండ్రితో, ‘ఒకామె వున్నది; ఆమెను ఒకచోటికి తీసుకు వెళ్ళారు. ఆమె సురక్షితంగా మగబిడ్డను కన్నది’ అన్నారుట. నేను నా సోదరుని ద్వారా పాలకోవా పంపి, వెంటనే మా తల్లిని సహాయంగా రమ్మని కోరాను. కాని బాబా అనుమతివ్వలేదు.

సం. 1911 డిశెంబరు సెలవుల్లో నిమోన్ లో నా సోదరుని భార్య ప్రసవించింది. నేను, మా 3 సం.ల పిల్లవాడు గోపాల్ ను తీసుకొని నిమోన్ వెడుతూ, దారిలో బాబాను దర్శించాను, మేము తిరిగి బయలుదేరేటప్పుడు బాబా మాకు ఉదీయిస్తూ, ‘బిడ్డను బ్రతికించుకో’ అన్నారు. ఆయన కేవలం మా గోపాల్ ను ఆశీర్వదించారనుకొన్నాను. కాని మేము నిమోన్ చేరేసరికి నా సోదరునికి పుట్టిన బిడ్డకు ప్రమాదంగా జబ్బుచేసి శరీరం చల్లబడిపోయింది. బాబా చెప్పినది అదేనని తోచి, ఉదీకోసం వెతికితే అది కన్పించలేదు. అపుడు నేను బిడ్డను వడిలో వేసుకుని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. పదిహేను నిలలో ప్రమాదం తప్పి, తర్వాత బిడ్డడు కోల్కొన్నాడు. వాడి పేరు దత్త.|

అప్పటికింకా పూణేలో ప్లేగు చెలరేగుతూనే వున్నది. నేను శిరిడీ దర్శించి, తర్వాత పూణేకు బయలుదేరబోతే బాబా అనుమతివ్వలేదు. కాని నాకు ఆఫీసులో సెలవు లేదు; డ్యూటీలో తప్పక చేరాలి; కనుక నా తండ్రి బాబా చేతిలో వూదీ వేసి బలవంతాన నాకు అనుమతిప్పించాడు. నేను యిల్లు చేరేసరికి మా యింటి ఆసామికి, మరురోజు నా భార్యకూ ప్లేగు వచ్చింది. తర్వాత ఆమెకు తగ్గిందిగాని, చూపుపోయింది. ‘మేము ఆ యిల్లు విడిచి ఆరోగ్య శిబిరానికి వెళ్ళమా?’ అని అడిగితే బాబా, ఓ ఇల్లు విడిచి పోవడమెందుకు?’ అన్నారు. ‘నన్ను సమాధి చేసిన తర్వాత వెళ్ళండి” అన్నారు.

ఏప్రిల్ 1917లో నాకు జబ్బు చేసినప్పుడు నా తండ్రిని పూణే రమ్మని కోరాను. కాని బాబా, ‘కంగారెందుకు? నీ సోమ్నియా కోల్కొని మనను చూడడానికి యిక్కడనే వస్తాడు’ అన్నారు. నాకు 21 రోజులు జ్వరమొచ్చి కేవలం నీరు త్రాగి వున్నాను, తర్వాత నన్ను 2, 3 మాసాలు సెలవు పెట్టి నాదీక్షాగురువు విద్యానందస్వామి సమాధి దగ్గర కొద్ది కాలమున్నాను. తర్వాత మా తల్లిగారొచ్చి, మమ్మల్ని శిరిడీ తీసుకెళ్ళారు. నాకు నీరసం తగ్గలేదు. నాకు రోజూ కొంచెం కిచిడీ తినిపించమని బాబా చెప్పారు. అలాచేస్తే నెలరోజులలో నాకు ఆరోగ్యము, బలమూ చేకూరాయి.

బాబా మహాసమాధి చెందడానికి కొద్దిముందు నేను శిరిడీలో వున్నాను. ఆయన అస్వస్థతగా వుండడం వలన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేను తిరిగి వెళ్ళదలిచినపుడు బాబా సెలవివ్వడానికి ఇష్టపడలేదు. కాని తప్పనిసరై నేను పూణే వెళ్ళిపోయాను, బాబా సమాధి చెందిన మూడు రోజులకు నా తండ్రి నిమోన్ వెళ్ళి, అక్కడినుండి వచ్చి పూణేలో మాతో వున్నారు. రెండు మాసాల తర్వాత ఆయన గూడా మరణించాడు. ఆ చివరి రోజుల్లో సాయి పై ఆయనకెంతో ధ్యాస వుండేది. తన వద్దకొచ్చిన వారంతా బాబా రూపాలన్న దృష్టితోనే వుండేవాడు. ఆయన అనన్యమైన రామభక్తుడు, ‘శ్రీరాం’ అన్న నామము ఉచ్చరిస్తూనే శరీరం విడిచాడు.

బాబా భౌతికంగా వున్నప్పుడు వారికి నాలుగు రోజులు సేవచేసే భాగ్యం నాకు కలిగింది. 

( ఇతనికి మారుతి రూపంలో బాబా దర్శనమిచ్చిన వివరం ‘సాయిబాబా జీవితచరిత్ర”లో చూడవచ్చు.)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close