కాకా దీక్షిత్ వైరాగ్యం – సమాధి

37722799_2029213877096916_3939781742663041024_n

కాకా దీక్షిత్ వైరాగ్యం – సమాధి

శిరిడీ వచ్చేనాటికి దీక్షిత్ వయస్సు 45 సం.లు మాత్రమే. న్యాయవాది గా పుష్కలంగా ధనమార్థిస్తున్నాడు. దేశమంతటా అతని కీర్తి మారుమోగుతోంది. ఎంతో ఉన్నతమైన పదవులు అతనిని వరించడానికి సిద్ధంగా వున్నాయి. బొంబాయి, విల్లేపార్లే మరియు లోనావ్లాలలో మూడు పెద్ద బంగ్లాలున్నాయి. అయితేనేమి అతడి హృదయమంతా మహత్తరమైన సాయి సన్నిధినే వరించింది. మహత్తరమైన వారి సన్నిధిముందు, వారి కృపా కటాక్ష వీక్షణం ముందు, యివన్నీ -సూర్యుని ముందు చంద్రునిలా అత్యల్పాలనిపించాయి. వాటన్నిటినీ ఉపేక్షించ సాగాడు. ఎంతో లాభదాయకమైన తన వృత్తిని పూర్తిగా అలక్ష్యం చేసాడు. రాబడి ఎంతగానో తగ్గిపోయింది. అవధులులేని అతని ఔదార్యము మరియు అతిథి సత్కారాలవలన ఆ మూడు బంగళాలు మినహా అతడి సంపదంతా కరిగిపోయింది. ఒక క్లిష్ట పరిస్థితిలో 1911లో బాబా గూడ అతనిని బొంబాయి వెళ్ళి తిరిగి పూర్వవృత్తిని చేపట్టమని వత్తిడి చేసారు. వారి ఆజ్ఞను శిరసావహించి అతడు బొంబాయి వెళ్ళాడుగాని, అతడి మనస్సంతా శిరిడీలోనే వుండిపోయి వృత్తిపట్ల కించిత్తుగూడా మొగ్గలేదు. అతనిలో వచ్చిన మార్పును జూచి అతని మిత్రులందరూ నివ్వెరబోయారు. వారెంతగా చెప్పినా అతడి మనస్సు కొంచెం గూడా లౌకిక జీవితం వైపుకుమరలక పోయేసరికి సాయిబాబా అనే ఫకీరు అతనిని మాయజేసి, పిచ్చివాణ్ణి జేసి శిరిడీలో కట్టేసుకున్నాడని చెప్పుకోసాగారు.

ఒకవంక నానాటికీ క్షీణించిపోతున్న తన వనరులపట్ల, కుటుంబ బాధ్యతల పట్ల మాత్రమేగాక, శిరిడీలో నిశ్చింతగా సాయి సేవ చేసుకొనడం గూడ కష్టంగా తోచేది. అతడా విషయమై ఆవేదనపడుతుంటే సాయి, ‘కాకా, నీకు ఆందోళనెందుకు? నీ బరువు బాధ్యతలన్నీ నావే!” అన్నారు. సామాన్య మానవులెవరైనా అంతటి అభయం యివ్వగలరా, అనుకున్నాడు కాకా. ఇలా సాయి ఎన్నోసార్లు చెప్పారు. చివరకతడు చింత విడిచి ఆ సన్నిధిలో ప్రశాంతంగా జీవించసాగాడు. తన అవసరాలన్నీ పూర్తిగా తగ్గించుకొని అమిత నిరాడంబరంగా జీవించసాగాడు.

అటువంటి క్లిష్ట పరిస్థితులలో ఎవరికైనా మనస్సు కుదేలయిపోతుంది. తమకెంతో ముప్పు వాటిల్లిందని తలుస్తారు, కాని అతడికొక విషయం స్పష్టంగా స్పురించింది. భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించదలచిన వారి సిరిసంపదలు ముందు పూర్తిగా హరిస్తారని భాగవతంలో చెప్పాడు. సాయి అనుగ్రహమనే అమృతం చవిచూచాక యిట్టి భ్రాంతులన్నీ పీడకలలా మటు మాయమయ్యాయి. అతడు శిరిడీలోనే ఎక్కువ సమయం గడపసాగాడు. సాయి గూడ అతనిని తరుచుగా ద్వారకామాయికీ, తన గదినుండి క్రిందకూ తరచుగా రావద్దని శాసించారు. కాని అతడు ఆరతి సమయంలో నైనా ఆయనను దర్శించకుండా వుండలేనని శ్యామాద్వారా బాబాకు తెల్పుకున్నాడు. చివరికెలాగో అతడు చావడివద్ద జరిగే ఆరతికి మాత్రం హాజరవడానికి సాయి అనుమతించారు. ఈ రీతిన అతడు తొమ్మిది మాసాలు శిరిడీలో ఏకాంతంగా వానప్రస్త జీవితం గడిపాడు.IMG_20190211_192544

అతనిలో వస్తున్న యీ తీవ్రమైన పరిణామం చూచి అతని భార్య భయపడిపోయి అతని వద్దనే వుండాలని తలచి శిరిడీ వచ్చేసింది. కాని దీక్షిత్ వాడాలోని పైభాగంలోకి స్త్రీ లెవరూ వెళ్ళరాదని నియమమున్నది. అందువలన ఆమె శిరిడీలో వున్నంతకాలం కాలాగూడ ఈ క్రింది భాగంలోనే నిద్రించవచ్చేమోనని బాబాను శ్యామా అడిగాడు. కానీ అతడు ఆ మేడమీద గదిలోనే ఒంటరిగా నిద్రించాలని బాబా శాసించారు. కొద్ది రోజులు వేచి చూసి ఆమె తిరిగి విల్లేపార్లే వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొన్నది. ఆమె బయలుదేరబోతూ తన భర్తయొక్క బాగోగుల గురించి ఆందోళన పడుతూంటే బాబా, ”కాకా గురించి నీవేమీ భయపడనక్కరలేదు. నేనే స్వయంగా అతడి బాగోగులు చూచుకుంటాను” అన్నారు. ఆమె కొంచెం స్థిమితపడి వెళ్ళిపోయింది.

ఇలా తొమ్మిది మాసాలు గడిచాక అట్టి ఏకాంతమైన తపో దీక్ష నుండి కాకాను విడుదలచేసి, తిరిగి బొంబాయివెళ్ళి అతని భార్యాబిడ్డలను చూచివచ్చేందుకు అనుమతిచ్చారు బాబా. ఒకసారి వెన్నతీసి ముద్దచేశాక, దానిని మజ్జిగలో వుంచినా, వివేక వైరాగ్యాలనే నూనె పూసుకున్నాక సంసార సంరక్షణమనే పనసకాయ కోసినా, అందులోని మమకారమనే పాలు మన కంటుకునే ప్రమాదముండదని రామకృష్ణ పరమహంస చెప్పనే చెప్పారు. ప్రతి చిన్న విషయంలోనూ పరిమితమైన తన ధర్మా ధర్మ విచక్షణ, యిష్టాయిష్టాలు, అభిప్రాయాలకూ తావీయక సాయి చెప్పినట్లు తు.చ. తప్పకుండా నడుచుకున్నాడు గనుకనే అతడు కృతార్థుడయ్యాడు. 

సాయి యితనికిచ్చిన సంస్కరణ యొక్క చిహ్నాలు పొడుగునా వ్యక్తమవుతూనే వున్నాయి. ఇతడింకా బొంబాయిలో శ్రీమంతుడైన లాయర్ గా వుంటూ బాబా దర్శనానికి వస్తున్న రోజులవి. ఒకసారి అతడు ఒక ట్రంకు పెట్టె నిండుగా రూపాయి నాణాలు తీసుకొని శిరిడీ చేరాడు. అని అతడొక రాజ సంస్థానంలో సంపాదించుకొన్న డబ్బు. అతడా ట్రంకు పెట్టే బాబా ముందుంచి, “బాబా! యిదంతా మీదే. ఇందులో నాదేమీలేదు” అన్నాడు. బాబా వెంటనే ”అలాగా” అని, అందులో నుండి రెండు చేతులతో కాసులు తీసి, డబ్బుకోసం గలవలె ఆయన చుట్టూచేరిన వారికి పంచేసారు. చూస్తుండగానే ఆ ట్రంకు పెట్టె ఖాళీ అయిపోయింది. దీక్షిత్ కు స్నేహితుడు, వృత్తిరీత్యా సబ్ జడ్జి అయిన గార్డే – కాకా ముఖంలోని భావాలను నిశితంగా గమనిస్తున్నాడు. కాకా ముఖంలో కించితైనా మార్పు లేదు. మరొకప్పుడు దీక్షిత్ ఒక ఆవును కొన్నాడు. బాబా దానికేసి చూచి, ”ఇదొకప్పుడు జాల్నాలో ఒకనికి చెందినది. అంతకు ముందు ఔరంగాబాద్ లో ఒకనికి చెందినది. ఇంకా ముందు యిది మహల్సాపతికి చెందినది. నిజానికది ఎవరి సాతో అల్లాహ్ కి ఎరుక!” అన్నారు. లౌకికమైన సంపదలు అస్థిరమని, అశాశ్వతమని, నిజానికవి సృష్టికర్తయైన భగవంతునికి చెందిన వేనని వారి భావం.

ఏకాదశినాడు మరణించిన వారు వైకుంఠానికి వెడతారని దీక్షిత్ కు ఎంతో నమ్మకం. సం. 1923లో ‘సాయిలీల” పత్రికలో యితడు స్వయంగా వ్రాశాడు – ”హరి భక్తుడు హరికి పవీత్రమైన ఏకాదశినాడు మరణించడమెంతగానో తగియున్నది” నిజానికి సాయి సేవకులైన కాశీరాం, అప్పాభిల్, మహల్సాపతి మొ.న వారందరూ ఏకాదశినాడే మరణించారు. జూలై 4, 1926న దీక్షిత్ తన భావార్ధ రామాయణంలోని గజేషాద్రమోక్షం చదివాడు. నాటి రాత్రి అతడికొక చిత్రమైన స్వప్నం వచ్చింది. బాబా కన్పించి కాకా సాహెబ్ చొక్కాలో, అతని గుండెలవద్దకు చేరారు. కాకాసాహెబ్ ఎంతో (పేమతో ఆయనను తన హృదయానికి అదిమి పెట్టుకొన్నాడు. మరురోజు తెల్లవారగానే కాకా కల సంగతి అన్నా సాహెబ్, దేశపాండే మొ.న వారితో చెప్పాడు. తరువాత ఆ రోజు అతని పారాయణలో సిద్ధపురుషుల మాహాత్మ్యం గురించి చదవడం జరిగింది.

అటు తర్వాత అతడు విల్లేపార్లే నుండి బయలుదేరి బొంబాయిలోని డా దేశ్ ముఖ్ గారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడు రామకృష్ణను చూడడానికి బయలుదేరాడు. అంతవరకూ అతనితో కలసి, భజన, పారాయణలలో పాల్గొనిన అన్నాసాహెబ్ దబోల్కర్ గూడ తన స్వస్థానానికి బయలుదేరాడు. వారిద్దరూ కొంచెం ఆలస్యంగా రైల్వే స్టేషనుకు చేరుకున్నారు. నాడు రైలు గూడా ఆలస్యమై నరిగా అదే సమయానికి వచ్చింది. ఆ యిద్దరూ రైలెక్కి కూర్చోగానే కాకా, “చూచావా అన్నాసాహెబ్, బాబా ఎంత దయామయుడో! సరిగ్గా సమయానికి రైలు అందించారు. ఒక్క నిముషమైనా మనల్ని వేచి వుంచలేదు!” అన్నాడు. అపుడు తన జేబులోని రైల్వే టైంటేబుల్ చూచుకొని ”రైలు కొంచెమాలస్యమయ్యేలా బాబా చేసారు. లేకుంటే మనం కొలాబాలో దిగబడిపోయి నిరుత్సాహపడేవారమే. ఇదే సాయి దయ!” అని చెప్పి, అన్నాసాహెబ్ కు ఎదురుగా సీటులో కూర్చుంటూ అపారమైన సాయి దయను తలుచుకుంటూ కన్నులు మూసుకున్నాడు. కొంత సేపు అతడు కన్నులు తెరవక పోయేసరికి నిద్రపట్టిందా?” అని ప్రశ్నించాడు అన్నాసాహెబ్. కాకా తల ఒకవైపు కొరిగేసరికి అతడు స్పృహకోల్పోయాడు కాబోలనుకొని అతనిని బల్ల పై పడుకోబెట్టాడు. తర్వాత ఆ విషయం రైల్వే గార్డుతో చెప్పేసరికి అతడు పరేల్ స్టేషనులో దీక్షిత్ దేహాన్ని దింపించి వైద్యపరీక్ష చేయించాడు. అప్పటికే దీక్షిత్ దేహత్యాగం చేసాడని తెలిసింది. అటు తర్వాత అన్నాసాహెబ్ అంత్యక్రియలన్నీ ఏర్పాటు చేసాడు. ఆనాడు ఏకాదశి. రామాయణం పారాయణ, భజన చేసి సాయికృపకు పరవశిస్తున్న క్షణంలో అతడి ఆత్మను ఆ సమర్థ సద్గురుడు విమానంలో వైకుంఠానికి తీసుకుపోయాడు. తొమ్మిది సం.లు ఏ సేవలో గడిపాడో ఆ సేవలోనే కాకా అంతిమశ్వాస గూడా విడిచాడు. అదీ విశ్వాసమంటే.

సాయివద్ద కాకా దీక్షిత్ కు యింతటి సదవకాశం లభించడానికి ఒక ప్రత్యక్షమైన కారణంగూడా వున్నది. ఒకసారి సాయి దాదాసాహెబ్ ఖాపర్డేతో * నీవు, నేను, కాకా, శ్యామా, బాపూసా హెబ్ జోగ్ మరియు దాదా కేల్కర్ కలసి ఒక వీధి చివర వెనుకొక జన్మలో మన గురువుతో కలసివున్నాము. అందుకే మీ అందరినీ యీ జన్మలో కలిపాను” అన్నారు.

ఈ విధం గా మహా సాయి భక్తుడు కాకా దీక్షిత్ జీవితం నిజమయిన వైరాగ్యం , నిజ భక్తి కి ఆలవాలం గా నిలిచింది ..

జై సాయిరాం !

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close