సాయి ప్రేమపాత్రుడు -మాధవరావ్ దేశ్ పాండే
మనలోని మమకారమన్నది యే కొద్దిమందికో పరిమిత మైన ప్రీతి; దానిలో వివేకము, వైరాగ్యమువుండవు. అవతలవారి అర్హత, పాత్రతల పైగూడా ఆధారపడదు. తదితరుల పై నిర్లిప్తత, మరికొద్దిమంది పై ద్వేషము, అసూయవుంటాయి. పైకి చూడటానికి దానిలాగే కన్పిస్తున్నా, ప్రేమమాత్రం దానికి భిన్నంగా వుంటుంది. ప్రేమ అన్నది అందరి పై సమానంగా ప్రసరిస్తుంది. కాని దానిని పొందగలగాలంటే అవతలివారిలో పాత్రత వుండాలి. సద్గుణాలతో గూడిన పాత్రత యెవరికెంత వుంటుందో అంత మేరకే వారు (ప్రేమను పొందుతారు.సూర్యరశ్మి, పండు వెన్నెలా రాళ్ళమీదా, వెండి వస్తులమీదా, నీటిమీదా ఒకేలా పడుతుంది. కాని రాళ్ళుదానిని గ్రహించి ప్రతిబింబించలేవుగానీ వెండి వస్తువులు, నీరు దానిని పూర్తిగా గ్రహించి ప్రతిబింబిస్తాయి; ఎంతగానో శోభిస్తాయి. ప్రేమ అన్నది అలా అందరి పైనా ప్రసరింపచేయడం సాయివంటి పరమాత్మ స్వరూపులైన మహనీయులకు మాత్రమే సాధ్యం. అందుకే సకల జీవుల శ్రేయస్సు గోరి వారు భక్తులమధ్య అవతరించి, వారిని తరింపచేయడానికెన్నో కష్టాలనెదుర్కొంటారు. కాని వారి ప్రేమను బాగాపొంది ప్రతిబింబించగల కొద్దిమంది మాత్రం మహనీయులకు ప్రీతిపాత్రులైనట్లు, మిగిలినవారు అలాగానట్లూ కన్పిస్తుంది. ఈ కోవకు చెందిన భక్తుల్లో మాధవరావ్ దేశ్ పాండే మొదటివాడు. బాబా అతనిని షామా (శ్యామా) అని పిలిచేవారు. అందువలన అతనికా పేరు భక్తలోకంలో స్థిరపడి పోయింది.
మాధవరావు తరచూ రాత్రిళ్ళు పాఠశాలలో ఒక్కడే పడుకునేవాడు. అప్పుడప్పుడు అర్థరాత్రి అతనికి మశీదులో ఎవరో ధారాళంగా ఇంగ్లీషు, సంస్కృతము, హిందీ, ఉర్దూ వంటి భాషలలో మాట్లాడుతూండడం వినిపించేది. చూస్తే అపుడు మశీదులో బాబా ఒక్కరే వుండేవారు. ఇలా కొన్నిసార్లు జరిగాక సాయి గొప్ప సిద్ధపురుషుడన్న భావం అతనిలో ధృడపడింది. అటుతర్వాత అతడు సుమారు 20 సం.లు అచంచలమైన విశ్వాసంతో ఆయనను సేవించాడు. ఆయన మాటే అతనికి వేదవాక్కు. అతను బాబాను “దేవా!’ అని పిలిచేవాడు. ఆయన ప్రేమ గా అతనిని ‘షామా’ (కిష్టి) అనిగాని, “షామ్యా” అనిగాని పిలిచేవారు. “షామ్యా” అంటే * శ్యామాగాడు” అని అర్థం. అంటే ముద్దుగా ‘కిష్టిగాడు’ అని పిలిచేవారన్నమాట. ఈవిధంగా బాబాతో సాహచర్యం అతనికి 44 సం.ల పైన లభించింది.
షామాకు బాబాతో అనుబంధాన్ని తెల్పే కొన్ని మచ్చు తునకలు :
ఒకరోజు బాబా చేతిలో ఎవరో ఏవో పప్పులు పిడికెడు పోశారు. ఆయన వెంటనే శ్యామాను పిలిచి, పప్పులతని చేతిలోపోసి తినమన్నారు. శ్యామా ఆశ్చర్యంతో, ”ఛీ ఛీ, యివ్వాళ ఏకాదశి కదా! ఈనాడవితిని పాపం కొనితెచ్చు కోమంటారా? నేనవి ముట్టుకోనైనా ముట్టుకోను” అన్నాడు. బాబా నవ్వుతూ “సరే తినవద్దులే!” అన్నారు.
మరొకసారి ఒక భక్తుడు బాబాను, “సాయి,ఏకాదశివంటి పర్వదినాలలో ఎవరైనా ఉల్లి తినవచ్చా?” అని అడిగాడు. బాబా ఏమీ తడుముకోకుండా వెంటనే, ” ఆహా తినకూడదు” అన్నారు. ఆ భక్తుడు అంతటితో విడచి పెట్టక, “అదేమీ, అదికూడ అన్ని దుంపల వంటిదే కదా. దానిని మాత్రమే ఏకాదశినాడు ఎందుకు తినకూడదు?” అని అడిగారు. బాబా నవ్వుతూ, ”తింటే ప్రమాదమీ లేదు, తినవచ్చు” అన్నారు.
అంతవరకూ వారిరువురి సంభాషణనూ ఎంతో శ్రద్ధగా వింటున్న శ్యామా కల్పించుకొని ఆవేశంగా అడిగాడు. ”దేవా, మీరింత తికమకలుగా గోడమీద పిల్లివాటంగా మాట్లాడతారేమి? ఒకమాటు వుల్లితినవచ్చంటారు, మరొకసారి తినకూడదటారు. మీరు చెప్పదలచుకున్నదేదో స్పష్టంగా, నిర్మొహమాటంగా చెప్పవచ్చుకదా?” అన్నాడు. బాబా నవ్వి ఎంతో అనునయంగా, ” శ్యామా, నేనీ మశీదులో కూర్చున్నాక అబద్ధమెన్నడూ చెప్పను, నీమీద ఒట్టు. ఏకాదశినాడు ఉల్లి తినగూడదని, అలాగాక తినదల్చుకుంటే ఉల్లి మొత్తం (ఉల్లిగడ్డనుగూడ మొత్తంగా) తిని హరించుకోగల జీర్ణశక్తి గలవారు మాత్రమే తినాలంటాను. అలాగనివారు అట్టి ప్రయత్నం చేయకూడదు” అన్నారు.
బాబా రోజూ తమకొచ్చే దక్షిణలు సుమారు రు. 500/-లు సూర్యాస్తమయ సమయంలో ఆరతి అయ్యాక భక్తులకు, పేదసాదలకూ పంచేవారు; తాత్యాకోతే వంటి కొందరు భక్తులకు నియమంగా రోజూ ఒకే మొత్తమిచ్చేవారు. కాని మహల్సాపతికి, శ్యామాకు మాత్రం ఎప్పుడూ ఏమీ యిచ్చేవారుగారు. ఒకసారి అతడు, ” బాబా, నీవెందరికో సిరిసంపదలిచ్చావుగదా, నాకివ్వలేదేమి?” అని అడిగాడు గూడా. సాయి ఎంతో (పేమగా, ” సిరి సంపదలు నీకు తగవు. నీకివ్వ వలసినది వేరు” అన్నారు, ఆయన అతనికివ్వదలచిన దేమిటి? దానికి సమాధానం సాయి యింకొకప్పుడు సూచించారు. అతడు కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకమూ నిజంగా వుంటే చూపించమని కోరితే బాబా అతనికి వాటి దర్శనమిప్పించి, ” మనం కోరవలసినది యివే వీగావు, వీటికి పైనున్నది” అన్నారు. అదీ అతనికి ఆయన ప్రసాదించదలచినది.
ఒకసారి మాధవరావుకు తీవ్రమైన కంటిపోటు వచ్చింది. ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు. చివరకు బాబా పై పట్టరాని కోపంతో మశీదుకు వెళ్ళి, దేవా! నీవెంత కఠినాత్ముడు, ప్రక్కవాడు చస్తున్నా ఏమీ పట్టించుకోనివాడు యింకెవరూ వుండరు. అందరికీ ఏమేమో మందులతో గాని, మహిమలతోగాని ఎన్నో వ్యాధులు తగ్గిస్తున్నావుగాని, నేనీ బాధతో మెలికలు తిరిగిపోతూ నిన్నెంతగా ప్రార్థించినా పట్టించుకోవేం? ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా వుందా? నీవేం దేవుడివి? నాకంటిబాధ రేపటికల్లా పూర్తిగా తగ్గకపోయిందో, నిన్నీ మశీదులోంచి వెళ్ళగొట్టడం తథ్యం. ఆ పని చేయకుంటే నేను నీ శ్యామానే గాదు!” ఆన్నాడు. బాబా ప్రశాంతంగా విని ఎంతో ప్రేమగా నవ్వుతూ, శ్యామా! ఏమిటి నీ పిచ్చివాగుడు? ఏడు మిరియాలు నీటిలో గంధంగా అరగదీసి కళ్ళల్లో పెట్టుకో! అదే తగ్గిపోతుంది. ఈ ఉదీ తీసుకుని వెళ్ళు!” అన్నారు. ఈసారి శ్యామా మరింత రెచ్చిపోయాడు, ” ఏమి తెలివయ్యా! నీకీ వైద్య మెవడు నేర్పాడట? నాకళ్ళేమన్నా పోవాలనా, మిరియాలు కళ్ళల్లో పెట్టుకోమంటావ్?” అన్నాడు. బాబా అతని మాటలేవీ పట్టించుకోకుండా, ” నీ అతి తెలివి చాలు, ఉదీ తీసుకుపోయి చెప్పినట్లు చేయి, తగ్గకపోతే నీ యిష్టమొచ్చింది చేయచ్చు” అన్నారు. శ్యామా పైకి అలా మాట్లాడినా ఆయన మాటమీద విశ్వాసంతో ఆయన చెప్పినట్లే చేశాడు. దానితో ఆ బాధపూర్తిగా తగ్గిపోయింది.
బాబా యితనినెంతో ప్రేమగా చూచుకొనేవారు. సాయంత్రమయ్యాక ఎవరో కొద్దిమంది సన్నిహిత భక్తులనుతప్ప బాబా ఎవరినీ మశీదులోకి రానిచ్చేవారుగాదు. కాని శ్యామానుమాత్రం యథేచ్చగా ఏ సమయంలోనైనా రానిచ్చే వారు బాబా. తాత్యాసాహెబ్ నూల్కర్ ప్రమాదంగా జబ్బుపడి చివరిరోజు అర్థరాత్రి బాబా పాదతీర్థం కావాలని కోరాడు. ఆ వేళగాని వేళ మశీదుకు వెళ్ళి బాబాను నిద్రేలేపి ఆయన పాదతీర్థం తీసుకునేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. అపుడు శ్యామా అందుకు పూనుకుని, నెమ్మదిగా చప్పుడుగాకుండా మశీదులోకి ప్రవేశించాడు. అది చూచిన బాబా అతనిని తన్నాలని కాలు పైకెత్తారు. ఆయన కోపాన్ని పట్టించుకోకుండా అతడు తనతో సిద్ధంగా తీసుకు వెళ్ళిన నీటి పాత్రలో వారి బొటన వేలు ముంచుకొని మరుక్షణమే పరుగెత్తిపోయాడు. ఆ తీర్థం నోట్లో పోయగానే నూల్కర్ ఎంతో తృప్తిగా ప్రాణం విడిచాడు.
నిత్యమూ మధ్యాహ్న ఆరతి అయ్యాక మాధవరావ్ దేశ్ పాండే బాబా వద్దకు వెళ్ళి, “దేవా! మీరు లేచి మీ స్థానంలోకి వెళ్ళండి. భక్తులు సమర్పించే నైవేద్యాలు స్వీకరించి, అవన్నీ కలిపి అందరికీ ప్రసాదం పంచండి” అని చెప్పేవాడు. వెంటనే బాబా బుద్ధిమంతుడైన పిల్లవానిలా నింబారు వద్దకు వెళ్ళి కూర్చుని అతను చెప్పినట్లు చేసేవారు.
షోలాపూర్ కు చెందిన శ్రీమతి ఔరంగాబాద్ కర్ కు 27 సం.లపాటు బిడ్డలు కలుగలేదు. ఆమె తన సవతి కొడుకుతో శిరిడీవచ్చి బాబా సేవలో రెండు మాసాలున్నది గాని, భక్తులందరి యెదుట ఆయనకు తమ కోర్కె నివేదించుకోలేకపోయింది. ఆమె శ్యామాతో చెప్పుకోగా ‘ అతడు ఆమెనొక కొబ్బరి కాయ తీసుకొని మశీదుకు రమ్మనమని చెప్పి బాబాతో, ”దేవా, ఈ కొబ్బరికాయ ప్రసాదంగా ఆమెకిచ్చి ఆమెకు కొడుకు పుట్టేలా ఆశీర్వదించు” అన్నాడు. మొదట చాలా సేపు బాబా అంగీకరించక అతడితో వాదించారు. చివరకు, ఆమె పమిటి చెరుగులో కాయవేసి ఆశీర్వదించారు. సం.లోగా ఆమెకు కొడుకు పుట్టాడు. వారు బిడ్డను తీసుకుని మరల బాబాను దర్శించి తాము మొక్కుకున్నట్లే శ్యామకర్ల గుఱ్ఱము ) కు శాల నిర్మించడానికని రు. 500/-లు సమర్పించుకొన్నారు.
సాయి సేవవలన శ్యామా తన వైద్యవృత్తిలో దప్ప మరేవిధమైన లౌకిక ప్రయోజనాన్ని పొందలేదుగాని, ఆయన ప్రేమను, ప్రత్యేకమైన ప్రసాదాలనుమాత్రం పొందేవాడు. ఒకసారి వామన్ నార్వేకర్ అను భక్తుడు బాబాకొక వెండినాణెం సమర్పించాడు. దాని మీద ఒక ప్రక్క సీతారామ లక్ష్మణుల బొమ్మ. మరొక్క ప్రక్క హనుమంతుని బొమ్మా వున్నాయి. బాబా దానిని తీసుకొని పిలవాడిలా ఎంతో సంతోషంతో, ఆసక్తితో చాలా సేపు అటూ యిటూ తిప్పిచూచారు. దానిని వారి ప్రసాదంగా తనకివ్వమని నార్వేకర్ అడిగాడు. బాబా అయిష్టంగా, ” రు. 25/-లు దక్షిణ యిస్తే యిదిచ్చేస్తాను” అన్నారు. నార్వేకర్ వెంటనే ఆ పైకం సమర్పించాడు. బాబా నవ్వి, “అబ్బా ఎంత ఆశ! నీను పాతిక రూపాయలు కాదుగదా నాణాలరాశి కుమ్మరించినా దీనిని మాత్రం తిరిగివ్వను!” అన్నారు. కాని తర్వాత అది శ్యామాకిచ్చి నిత్యమూ పూజించు కోమన్నారు. అలాగే అతనికి ఏకనాథ బాగవతము, విష్ణు సహస్రనామము, వెండి పాదుకలు, వెండి విగ్రహాలు- యిలా ఎన్నో పవిత్రమైన వస్తువులిచ్చారు. అంతేగానీ, అతడికి డబ్బుమాత్రమెప్పుడూ యివ్వలేదు. ఎవరైనా యిచ్చినా, అతనిని తీసుకోనిచ్చేవారుగాదు. ఒకప్పుడు మహారాష్ట్ర రాజైన సింథియా అతనికి రు. 5000/-లు బహుకరించాలనుకొన్నాడు. కానీ బాబా అతనిని మందలించి ఆ ప్రయత్నం, మాన్పించారు. అయితే శ్యామాకు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశాలు బాబా ప్రసాదించారు. అతడావిధంగా ద్వారక, రామేశ్వరము, జగన్నాధము, బదరీ నారాయణ్, బదరీకేదార్, గంగోత్రి, యమునోత్రి, కాశీ, అయోధ్య, ప్రయాగ, మధుర, గోకులము, బృందావనము, గయ, హరిద్వార్, ఉజ్జయినీ, గిర్నార్, నాసిక్, త్రయంబకేశ్వరమూ, గాణాపురము, అక్కల్ కోట, పండర్ పూర్, కొల్హాపూర్, తుల్జాపూర్, తిరుపతి, శ్రీరంగపట్నం, కంచి, మొ.న వన్నీ దర్శించాడు. సాయి దయవలన యీ యాత్రలన్నీ అతడికెంతో సుఖంగానూ, వైభవో పేతంగానూ అయ్యాయి. అతనినెందరో కోటీశ్వరులు యీ యాత్రలకు ఎంతో గౌరవంగా తీసుకెళ్ళి, అతనిచేత ఒక్క రూపాయి అయినా ఖర్చు చేయనీయలేదు. ప్రతి క్షేత్రంలోనూ అతనినెంతో ప్రత్యేకంగా గౌరవించి ముఖ్య అతిధిగా చూచుకొనేవారు. రాజులు, మహారాజులు, జాగీర్దారులు, పెద్ద పెద్ద ప్రభుత్వోద్యోగులు, (శ్రీమంతులు అతనికి ఘనంగా స్వాగతమిచ్చి, చక్కగా అలంకరించిన ఏనుగులమీద, పల్లకీలలోనూ తీసుకువెళ్ళి వారి పరిసరాలలోని “పుణ్యక్షేత్రాలను చూసేవారు. అదంతా బాబా అనుగ్రహమేనని తెలిసిన అతడు ఎక్కడికెళ్ళినా సాయి మహిమనే వెల్లడి చేసేవాడు.
సేకరణ : పూజ్య గురుదేవులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి “సాయి సన్నిధి “
మనమిప్పుడు ఒక ప్రార్ధన చేసుకుందాము ..“హే సాయి ! నీ ప్రేమ నీ చూపు కి నోచుకోకుండా చేసే ఏ చిన్న తప్పు అయినా మాచే జరగకుండా చూడుము తండ్రీ ! దయ తో మమ్ములను మాయ బారినుండి కాపాడుము . మమ్మల్ని సకాలం లో హెచ్చరిస్తూ , నీ నుండి నీ ప్రేమ నుండి దూరం చేసే ఏ ఆలోచన మా మది లో రాకుండా మమ్మల్ని కాపాడుము . నీ నిజ భక్తులు శ్యామా లాంటి వారు నీ దగ్గర పొందిన ప్రేమ మేము కూడా పొందే పాత్రత మీరే మాకు ప్రసాదించండి. అజ్ఞాన వశాన మేము ఏవయినా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించు తండ్రీ .ఆ తప్పులకి దండించి మమ్మల్నిమళ్ళీ నీ దరి చేర్చుకో తండ్రీ ! మాకు నీ ప్రేమ మాత్రమే కావాలి. ప్రేమస్వరూపుడయిన నా సాయి నాధా ! ఎటు చూసినా ఈర్ష అసూయ కల్గిన జనులతో మేము బాధలు పడుతున్నాము . మాపై నీ ప్రేమామృత వర్షం కురిపించి మాకు ఆనందాన్ని ప్రసాదించుము . నీ చల్లని కరుణా చూపులతో మమ్ము అక్కున చేర్చుకుని మాయ ప్రపంచపు బాధలతో విసిగి వేసారిన మా హృదయాలకి సాంత్వన కల్గించుము సాయి నాధా !!”
Reblogged this on Sai Sannidhi and commented:
This is the feeling which I would like to have for my life long
LikeLike