సాయినాథాయ నమః!
భక్తుల దుష్కర్మల ను అడ్డుకునే సాయి నాధుడు!
ప్రతికూల సమయం ఆసన్నమయినప్పుడు కష్టాలు సమస్యలు చుట్టుముట్టుతాయి . మరియు దుష్కర్మ చేయాలనే తలంపులు అవకాశాలు వస్తుంటాయి. సాయి దీనికి నిమిత్తమాత్రుడే .. ఎవరు చేసుకున్న కర్మ వారిని కాటు వేయక తప్పదు . అయితే సాయి పై విశ్వాసం నమ్మకం తో ఉంటే ఈ కర్మ ఫలితం కేవలం నామమాత్రం గా ఇలా కనిపించి అలా పోతుంది. అలాంటి ప్రతికూల సమయాల్లో సాయి తన భక్తుల వెన్నంటే ఉండి వారిని ఎలా కాపాడుతారో ,వారిని దుష్కర్మ చేయకుండా ఎలా అడ్డుకుంటారో సాయి భక్తుడయిన హరి వినాయక సాటే జీవితం లో జరిగిన సంఘటన లు తెలుసుకుందాము.
హరివినాయక సాటే గారి మాటల్లోనే..“ఉద్యోగంలో నాకు రావలసిన ప్రమోషన్ రాకపోయేసరికి విసుగుపుట్టి నేను రాజీనామా చేస్తానని బాబాతో అన్నాను. కాని బాబా నన్ను వారించి నాకు ప్రమోషను వస్తుందన్నారు. కొద్దికాలం తర్వాత నా పై అధికారులకంటేగూడ, పై పదవికి ప్రమోషనిచ్చారు. నాకు జీతం పెరగడమేగాక, నా పై వాళ్ళకంటే ఎక్కువ ఫించను ముట్టింది. మొదట ఫించనుగూడా నాకు 50/-లు తక్కువ యిచ్చారు. నేను ప్రభుత్వానికి వ్రాసి బాబా వద్దకెళ్ళి, ఆ ఫింఛను వదులుకోనైనా వదులుకుంటాను గాని, తక్కువ ఫించను తీసుకోనని చెప్పాను. ఆయన నాకు రావలసినదంతా వస్తుందని, భగవంతుడు మేలు చేస్తాడనీ చెప్పారు. తర్వాత అలానే జరిగింది.
మశీదునుండి బాబా బయటకెళ్ళేటప్పుడు నేను రాజదండం పట్టుకొని వారిముందు నడిచేవాణ్ణి. బాబా నాకిచ్చిన అవకాశాలకు అసూయచెందినవారు కొందరు గ్రామస్థులతో కలసి శిరిడీనుండి నన్ను వెళ్ళగొట్టమని నానావల్లీని రెచ్చగొట్టారు. ఒకసారి నేను రాజదండం తీసుకొని బాబాకు ముందుగానడుస్తుండగా ఒక పదునైన గాజు పెంకుతో నానావలీ నాతల వెనుక భాగంలో గీసాడు. నన్ను నేను రక్షించుకోవడానికి అతణ్ణి పట్టుకొని రోడ్డు ప్రక్కనున్న ఒక కట్టెల రాశిమీద పడవేసి అదిమిపట్టాను. ‘సాహెబ్, అలాచేయవద్దు!’ అని బాబా కేకలేసారు. అపుడు శిరిడీలోని పరిస్థితి గమనించి జాగ్రత్తగా వున్నాను. నేను ఒకరోజు ఊరికి వెళ్ళబోతూ బాబా వద్దకు బయలుదేరుతుంటే మా మామ పరుగున వచ్చి, దుడ్డుకర్రతీసుకొని నానావల్లి నన్ను చావగొట్టడానికి మశీదు గేటువద్ద వున్నాడని వారించాడు కనుక నేను (బాబావద్ద) సెలవుగూడ తీసుకోకుండానే శిరిడీ విడిచి వెళ్ళి పోయాను. నేనికముందు శిరిడీలో వుండకూడదని బాబా సంకల్పమనేది స్పష్టం. నానావల్లి నామీద దాడి చేస్తుంటే బాబా నన్ను రక్షించలేదు గనుక ఆయనను నమ్ముకోవద్దని కొందరు చెప్పారు. అలా అయితే పండరి విఠలునీ గూడా విశ్వసించగూడదని నేను చెప్పాను: (గైక్వార్ రాజు తరపున న్యాయవాదిగా పనిచేసిన గంగాధర శాస్త్రి విఠలుని భక్తుడు. అతడు విఠలుని ఆలయంలో తలదాచుకొంటే, విఠలుని ఎదుటే శత్రువులతనిని చంపారు.) నిజానికి నేను శిరిడీ విడిచి పెట్టి పూణేలో స్థిరపడడమే నాకన్నివిధాలా మేలని తర్వాత ఋజువైంది. శిరిడీలో వలెనే యిక్కడ గూడ నన్ను సాయిబాబా కాపాడుతున్నారు”.
సాయి సంస్థానానికి సంబంధించిన స్థానిక సమస్యలలో జోక్యం చేసుకొనడం వలన సాఠేకు శిరిడీలో వ్యతిరేకత ఏర్పడింది. ఉపాసనీ శాస్త్రీకి వలెనే సాఠేకు గూడా శిరిడీలో వ్యక్తులెందరో వ్యతిరేకులయ్యారు. ఆ వర్గానికి నాయకుడు, మహాబలిష్టుడు, భయంకరుడు అయిన నానావల్లీ, డిశెంబర్ 1915లో సాఠేను శిరిడీ రప్పించారు బాబా. సాయి సూచన మేరకు దక్షిణ భిక్షా సంస్థను ఏర్పాటుచేసి అతడు దానికి అధ్యక్షుడయ్యాడు. నిత్యమూ బాబా పంచివేసే దక్షిణల నుండి కొంతభాగం సేకరించి దానితో శిరిడీ సాయి సంస్థానం నిర్వహించడానికి యీ సంస్థ ఏర్పడింది. ఇది కొంతమందికి నచ్చలేదు. బాబా తమకిచ్చే డబ్బులో కొంత భాగం తీసివేసుకోవడం వారు సహించలేకపోయారు. ఎలాగైనా సాఠేను వెళ్ళగొట్టగలిగితే బాబాకు, ఆ గ్రామానికీ గూడ ఆ పీడ తొలగిపోతుందని నానావల్లీని నమ్మించారు. ఈ కక్షతో బాబా పల్లకీలోని వెండి గుర్రాలు దొంగిలించబడినపుడు, సాయి సంస్థానానికి అందువలన కలిగిన నష్టానికి సాఠేను. బాధ్యుణి చేశారు. ఇటువంటి అనేక చిన్న చిన్న అభియోగాలతో అతనిని వేధించసాగారు. చివరకు జనవరి 1918లో అతనికి అట్టి విషయాల పై లాయర్ నోటీసులు కూడా యిప్పించారు. బాబా మాత్రం అతనిని ఓర్పు వహించమనీ, తగురీతిన వాటికి చట్టరీత్యా సమాధానమివ్వమనీ చెప్పి అతనిని రక్షిస్తానని అభయమిచ్చారు. నిజానికి అతడికేమీ జరుగలేదు. అయినప్పటికీ గ్రామస్థులు అతని పై కినుక మాత్రం వదులుకోలేదు. సరిగదా నానావల్లీని అతని పైకి రెచ్చగొడుతూనే వున్నారు. అతడొకరోజు ఒక దుడ్డుకర్ర చేతబుచ్చుకుని సాఠేకోసం మశీదు ముంగిట వేచివున్నాడు. ఆరోజు సాఠే ఊరికి వెళ్ళవలసి వున్నది. అతడు బాబావద్ద సెలవు తీసుకోడానికి మశీదుకు బయల్దేరబోతుండగా అక్కడ పొంచివున్న ప్రమాదం గుర్తించి దాదాకేల్కర్ అతనిని వారిస్తూ కబురు పంపాడు. అందువలన బాబావద్ద ప్రత్యక్షంగా సెలవు తీసుకోకుండానే, మనసులోనే ఆయనకు నమస్కరించుకుని సాఠే శిరిడీ విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. అతడిక మరలా శిరిడీ రాలేదు.
” సం. 1916 ప్రాంతంలో పూణే పరిసరాలలో ఒక గ్రామానికి మేము క్యాంపుకు వెళ్ళినపుడు యానాదివారు నాకొక గుడారం వేశారు. దానిని ఒక ఉదుంబర వృక్షం క్రింద, దానికి ఆనుకునేటట్లు వేసి తాళ్ళు దానికి కట్టారు. అది నాకప్పుడు తెలియలేదు. అపుడు నాకు కష్టాలు వస్తుంటే కారణం తెలుసుకొని, నాకు సహాయం చేయమని బాబాను ప్రార్థించాను. బాబా నాకు కలలో కనిపించి, ఒక బ్రాహ్మణునిచేత ఆ వృక్షానికి సంప్రోక్షణ చేయించి, దాని దగ్గర దత్త పాదుకలు ప్రతిష్టించమన్నారు. నేను అలానే చేసి రోజూ పూజకోసం పూజారిని గూడా నియమించాను.”
“ఒకసారి బాబా నా గురించి ‘సాహెబ్ చాలా అమాయకుడు, విరాడంబరుడు’ అన్నారు. ఆయన యితరులను తిట్టి, కొట్టినా నన్నెప్పుడూ తిట్టలేదు. ఒక్కసారి మాత్రం ఆయన నన్ను కొడతానని బెదిరించారు; అప్పుడు తప్పు నాదేనని తెలుసుకున్నాను. శిరిడీలో మాయింట ధనుర్మాసం చేసుకుంటున్నాను. ఆ రోజుల్లో మా మామతో చిన్న పట్టింపు వచ్చి, విడిగా వుంటున్నాము. ఆ వేడుకలకు అందర్నీ ఆహ్వానించిగూడా, నా మామను మాత్రం పిలువలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి వెళ్ళినపుడు ఆయన నా పై కోపించి, ‘ఒరేయ్, ఒక కర్ర తీసుకురండిరా!’ అన్నారు. నేను మౌనంగా నిలుచుండిపోయాను. మరుక్షణమే ఆయన మనస్సు మార్చుకొని,, ‘ఫర్వాలేదులే, నేను వస్తాను’ అన్నారు. ఆరోజు నేను మరొకతప్పు గూడ చేసాను. మార్వాడీలకు వచ్చిన తగువులో మధ్యస్థం చేశాను. బాబాకు అది నచ్చలేదు.”
“బాబా చేతిలో దెబ్బలు తినని భక్తుడను నేనొక్కడినేనని నేనొకరోజు గొప్పలు చెప్పుకుంటుంటే శ్యామా నా సమక్షంలోనే బాబాకు ఆ విషయం చెప్పి, కారణం అడిగాడు. అపుడు బాబా, ‘వాణ్ణి నేను కొట్టవలసిన అవసరమేమి? వాళ్ళ మామ వున్నాడుగా!’ అన్నాడు. నా మామ నా నుండి మాటిమాటికి డబ్బులు గుంజుతుండేవాడు. ఆ విషయమే బాబా సూచించారు.”
“బాబా తమ బిడ్డలను ఎప్పుడూ కని పెట్టే వుంటారు. ఒకసారి నేను తల పొగరు, కోపావేశాలతో హింసకు పాల్పడకుండా బాబా రక్షించారు. నా మామ నాచేత శిరిడీవద్ద 20 ఎకరాలు పొలం కొనిపించాడు. నా మామ నేనెప్పుడు శిరిడీ వచ్చినా ఆ భూమి చూడకుండా చేస్తున్నాడు. భూమి కొన్నట్లు తెలిస్తే బంధువులు ఎవరైనా అందులో వాటా అడుగుతారేమోనని ఆయన భయం. నేను మాత్రం ఆ భూమి చూడాలన్న పట్టుదలతో తాత్యాకోతే నుండి ఎద్దు బండి తెప్పించి నా భార్యను కూడా రమ్మన్నాను. ఆమె మొదట సరేనని తర్వాత తన తండ్రి మాట విని రానన్నది. నా ఆజ్ఞను ధిక్కరించినందుకు ఆమెను దండించాలని బండివాని చర్నాకోలు తీసుకున్నాను. అప్పుడు మేఘుడు పరుగునవచ్చి, బాబో నన్ను వెంటనే రమ్మన్నారని చెప్పాడు. నేను వెళ్ళేసరికి బాబా; ‘ ఏమిటి సంగతి, ఏమైంది? నీ భూమి అక్కడే వుందిగా, చూచేదేమిటి?’ అన్నారు. నా ప్రవర్తన, శ్రేయస్సుల గురించి ఆయన ఎంత అప్రమత్తులో!”
“ఆ రోజు మొదటిసారి శిరిడీలో ఒక భక్తురాలి యింటికి వెళ్ళదలిచాను. సరిగా అంతకు కొద్ది ముందే బాబా ఒకరి యింటి మారు పేరు చెప్పి, • నీవెప్పుడైనా అక్కడకు వెళ్ళావా?’ అని అడిగారు. నాకర్థంగా లేదు. అంతటితో బాబా ఆ ప్రస్తావన విడిచి పెట్టారు. తర్వాత నేనామె యింటికి వెళ్ళి మాట్లాడుతుండగా నా మెదడులో చెడు తలంపులు రాసాగాయి. అకస్మాత్తుగా బాబా, ఆ యింటి ముంగిట సాక్షాత్కరించి దగ్గరగా వేసివున్న వాకిలి తలుపు నెట్టి, ‘ఎంతపని చేస్తున్నావు?’ అన్నట్లు భంగిమచేసి మాయమయ్యారు. నేను వెంటనే పశ్చాత్తాపం చెంది అక్కడ నుండి వచ్చేసి, యిక ఎన్నడూ అక్కడకు వెళ్ళలేదు.”
“బాబా ఎన్నడూ ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు. కనుక నేనుగూడ వారినట్టిది కోరలేదు. నాకెందరో ఉపదేశమిస్తామని పిలిచారు. ఉపాసనీబాబా “పంచదశి’ ఉపదేశిస్తామన్నారు. ఖరగ్ పూర్, నాగపూర్ లకు చెందినవారు ఆయనవద్దకు వెళ్తున్నారు. సంగోలాకు చెందిన అతాబాయి నా మొదటి భార్యకు ఉపదేశమిచ్చింది. మొదట ఆ విషయమై బాబాతో సంప్రదించాను. మిగిలిన రెండుసార్లు నా మామచేత అడిగించాను. బాబా నన్ను ఉపదేశానికి పోవద్దన్నారు.”
“అనన్యంగా తమ గురించే చింతన చేస్తుండమని, తాము సర్వ సమర్ధులమని, ఐహికంగాను, పారమార్థికంగానూ గూడ భక్తుల శ్రేయస్సును తామే చూచుకోగలమనీ చెప్పారు.”
సాయి సాటే ని రక్షించినట్లు గానే, మన ప్రతికూల సమయాల్లో మన వెంబడే వుంటూ అన్ని సమస్యల నుండి మనల్ని కాపాడుతూ మనకే ఏ చిన్న తప్పు అయినా జరగకుండా చూసి మనల్ని సర్వవేళాల్లో ఆదుకోమని సాయి పాదములాంటి ప్రార్థిస్తున్నాను ! సాయి సూచనలను అర్థం చేసుకుని ఆచరించగలిగే శక్తి , వివేకం, బుద్ధి ని ప్రసాదించమని వేడుకుందాము .
జై సాయిరాం !
సేకరణ : పూజ్య గురువులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి “సాయి సన్నిధి “