ఓం శ్రీ సాయి నాథాయనమః
బాబా తో నానా చాందోర్కర్ అనుభవాలు :
సాయిని సేవించినవారిలో మొదటగా మనకు గుర్తొచ్చేవారు తన హరికథలద్వారా మహారాష్ట్ర దేశమంతటా వారి దివ్య లీలలను ప్రకటం చేసిన దాసగణు మహరాజ్; ” శ్రీసాయి సచ్చరిత్ర” వ్రాసి మొదటి పారాయణ గ్రంథంగా మహారాష్ట్రానికందించిన అన్నాసాహెబ్ దభోల్కర్ ఉరఫ్ “హేమాదంతు’, అమిత నిరాడంబరంగా వుండిన శ్రీ సాయి సన్నిధిని మహా వైభవోపేతమైన సంస్థానంగా రూపొందించిన రాధాకృష్ణమాయి. వీరు శ్రీసాయి మహిమ, వైభవమూ – ఈ రెండింటినీ ప్రపంచమెదుట చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేసారు. కానీ వీటన్నింటి వెనుక యివేమీ చేయనట్లు కన్పించే అదృశ్య హస్తంవంటి వాడు నానాసాహెబ్ చందోర్కర్. దాదాపు ఆరు దశాబ్దాలు బాబా నివసించిన మశీదును మరమ్మత్తు చేయించి దానికి ప్రస్తుత రూపమచ్చిన ధన్యతగూడ ఈతనిదే. అతడు ఉన్నత ప్రభుత్వోద్యోగానికి తోడు మంచి వాక్పటిమ గలవాడు. హృదయం నిండుగా సాయిపట్ల భక్తి వున్నది. ఇక కొరవేమి? ఇతడు తనకు తారసిల్లిన బంధువులకు, స్నేహితులకు, ఆర్తులకేగాక ఉద్యోగరీత్యా తనకు పరిచయమున్న వారందరికీ గూడ ఎలాగైనా సందర్భం కల్పించుకొని సాయి మహిమగురించి హృదయాలకు హత్తుకుపోయేలా చెబుతుండేవారు. తర్వాత వారు కన్పించినపుడల్లా శ్రీ సాయిని దర్శించుకొమ్మని ప్రోత్సహిస్తుండేవాడు. ఇతడు చెప్పడం వలన ప్రభావితులై సాయిని దర్శించుకొని ధన్యులైన వారెందరో అట్టివారిలో హరిసీతారామ్ (కాకా) దీక్షిత్, అన్నాసాహెబ్ దభోల్కర్, బి.వి. దేవ్, తాత్యాసాహెబ్ సూల్కర్, దాసగణు , రాధాకృష్ణమాయి మొదలయిన వారు ముఖ్యులు .ఇతడు కోపర్గాంలో పనిచేస్తుండగా అతని పసిబిడ్డ ప్రమాదంగా జబ్బుపడి చనిపోయాడు. కారణం ఆవూరిలో ఎటువంటి వైద్య వసతి వుండేదిగాదు. అపుడచటి ప్రజల బాధ గుర్తించి అతడు తన స్వంత ఖర్చుతో ఒక ఆసుపత్రి కట్టించి, 18 సం.లు నిర్వహించాక ప్రభుత్వానికి అప్పగించాడు.
ఆ కాలంలో మహారాష్ట్ర దేశమంతటా తరచుగా తీవ్రమైన ప్లేగువ్యాధి చెలరేగి ఎందరో మరణిస్తుండేవారు. అందువలన ప్రజలను దానినుండి రక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వం ఒక విధమైన టీకాలు వంటివి ప్రజలకు చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా వచ్చిన ఆపద్ధతి చూచి, ప్రజలు భయపడి ఆటీకాలు వేయించుకునేవారుగాదు. ఆయా ప్రాంతాలలోని ప్రజలకు ధైర్యం కలగడానికి, వారికి ఆదర్శప్రాయంగాను, మొదట ప్రభుత్వోద్యోగులందరూ విధిగా చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ అతనిని కోరాడు. అధికారుల వత్తిడికి తలవొగ్గి ఆ టీకాలు వేయించుకొంటే ఏమి ప్రమాదం వాటిల్లుతుందోనని భయపడి ఆ విషయం నిర్ణయించుకోడానికి ఒక వారం వ్యవధి కోరి బాబా వద్దకు పరిగెత్తాడు చందోర్కర్. బాబా, ‘ఆ, అందులో ఏముంది? చేయించుకో! నీకెట్టి ప్రమాదమూ జరగదు” అన్నారు. అతడు వెంటనే అహ్మద్ నగర్ చేరి టీకాలు వేయించుకున్నాడు. తర్వాత మిగిలిన ఉద్యోగులందరూ వేయించుకున్నారు. ఎవరికీ ఎట్టి యిబ్బంది కలుగలేదు. అతనికి తెలియకనే బాబా అతని హృదయాన్ని తమ ఆధీనం చేసుకున్నారు. అతడు తరచుగా శిరిడీ రానారంభించాడు.
ఒకపుడు నానా చందోర్కర్తోపాటు ఒక కీర్తనకారుడుగూడ శిరిడీకి వచ్చాడు. వారిద్దరూ ఆ మరురోజే అహ్మద్ నగర్ చేరవలసి వున్నది. రైలుకు టైమవుతుందని చెప్పి, బయలుదేరడానికి వారిద్దరూ బాబాను సెలవు కోరారు. బాబా, ” ఏమీ తొందరలేదు! మీరిద్దరూ స్థిమితంగా భోంచేసి బయలుదేరండి!” అన్నారు. బాబా మాటలయందు పూర్తి విశ్వాసంగల నానాసాహెబ్ రైలుకు ఆలస్యమవుతుదని భయపడక, నెమ్మదిగా భోజనంచేసే బయలుదేరాడు. హరిదాసు మాత్రం మరురోజు కార్యక్రమానికి ఆందుకోలేకపోతే తనకు రావలసిన పారితోషికం చేయిజారిపోతుందని భయపడి టైము ప్రకారం కోపర్గాం చేరదలచి భోజనం చేయకుండానే బయలుదేరాడు. కాని ఆరోజు ఆ రైలు కొన్ని గంటలు ఆలస్యంగా వచ్చింది. ఎంతో తాపీగా భోజనంచేసి బయలుదేరిన నానాగూడ కోపర్గాం చేరేసరికి హరిదాసు ఆకలితో బాధపడుతూ వేచివున్నాడు. నానా చేరిన కొద్ది సేపటికిగాని రైలు రాలేదు. శ్రీ సాయికి అన్నీ తెలుసునని ఆ హరిదాను గుర్తించాడు. అంతేగాదు, నానాకు ఆ ముందటిరోజూ బాబా చెప్పిన ఒకమాట గుర్తుకొచ్చింది. వారిద్దరూ శిరిడీ చేరగానే ఆయన అన్నారు – ”ఈ హరిదాసు చూడవయ్యా! అతడు నీతో కలసి వచ్చాడు గాని తనకు అనుకూలమని తోచినపుడు నిన్ను విడిచి పెట్టి ఒక్కడే వెళ్లిపోతాడు. ఎప్పుడూ నిన్నలా మధ్యలో విడిచి పెట్టిపోని స్నేహితులనే చేర్చుకోవాలి”.
ఒకరోజు ఉదయమే నానా కోపర్గాంకు తప్పక వెళ్ళవలసి వున్నది. జిల్లా కలెక్టరు అక్కడికి వస్తూ తననక్కడ కలుసుకొమ్మని నానాను ఆదేశించాడు. అందువలన నానా బయల్దేరి బాబాను సెలవు కోరాడు. ఆయన, ‘ఇవాళ నీవేమీ వెళ్ళనక్కరలేదు, రేపు వెళ్ళవచ్చులే!” అన్నారు. జిల్లా కలెక్టరు ఆదేశాన్ని పాటించాలా, లేక సద్గురువు ఆదేశాన్ని పాటించాలా అనే విచికిత్సే అతనికి కలుగలేదు. బాబా పై పూర్తి విశ్వాసంతో అతడు ఆరోజు ఆగిపోయాడు. తిరిగి ఆ మరుసటి రోజు అతడు సెలవు కోరినపుడు బాబా ఆశీర్వదించి, “ఇవాళ వెళ్ళి కలెక్టరును కలుసుకో!” అన్నారు. అతడు కోపర్గం చేరి ఆఫీసులో విచారించగా ఆ ముందటిరోజు కలెక్టర్ రానేలేదని చెప్పారు. తను ఆరోజు రావడం లేదని, మరురోజు వస్తాననీ కలెక్టర్ బలిగ్రాం యిచ్చినట్లు ఆఫీసులో తెలిసింది.
నానా ఒకప్పుడు లేలేశాస్త్రి అను మిత్రునితో కలసి పూణేనుండి బాంగాలో ఎక్కడికో బయలుదేరాడు. కొన్ని మైళ్ళు వెళ్ళాక అకస్మాత్తుగా గుర్రం బెదిరి ఆ బండి పడిపోయింది. నిజానికి స్థూలకాయులైన ప్రయాణికులిద్దరికీ బాగా దెబ్బలు తగలవలసింది. కాని అదే సమయానికి శిరిడీలో బాబా తమ చేతులు శంఖంలాగా కలిపి ఊదుతున్నారు. ఆయనలా చేయడం సామాన్యంగా ఎక్కడో ఎవరో భక్తులు మరణిస్తున్నారని సూచించేది. మరుక్షణమే ఆయన, ”అరే, నానా చచ్చిపోబోతున్నాడు! కాని చావనిస్తానా?” అన్నారు. అక్కడ నానాకు, అతని మిత్రునికీ చిన్న దెబ్బయినా తగలలేదు.
తర్వాత ఒకరోజు యిద్దరు ముస్లిం స్త్రీలు దర్శనానికి వచ్చి బాబా చెంతనున్న మగవారు ప్రక్కకు తొలిగితే ఆయన దర్శనం చేసుకోవచ్చని ఆ ముంగిట్లోనే కొద్ది సేపు నిలుచున్నారు. కారణం వారు ‘ఘోషా’ అను ఆచారాన్ననుసరించి తమ ముఖాలకు ‘పర్దా ముసుగు)’ వేసుకున్నారు. బాబావంటి మహనీయులను దర్శించినపుడు అవి తొలగించుకోవాలి కాని పరాయి మగవారి ఎదుట ముసుగును తొలిగించుకోరాదనీ వారి మతధర్మం చెబుతుంది. అది గ్రహించిన నానా అక్కణ్ణుంచి వెళ్ళిపోబోయాడు. కాని బాబా అతనిని కూర్చోబెట్టి, ”వారు దర్శించుకోదలచుకొంటే వస్తారులే! నీవు కూర్చో” అన్నారు. కొద్ది సేపు చూచి ఆ స్త్రీలిద్దరు బాబా దర్శనానికి వచ్చారు. ఇద్దరిలో వృద్దురాలు మామాలుగానే పర్దా తొలగించుకొని బాబా దర్శనం చేసుకొన్నది. మధ్య వయస్కురాలైన రెండవ ఆమె సౌందర్యం నానా మనస్సును కలతపరచింది. ఆమె కళ్ళు ఎంతో తేజోవంతంగాను, ముఖమెంతో అందంగానూ వున్నాయి. ఆమె బాబాను దర్శించుకొని తిరిగి మునుకు కప్పుకుని వెళ్ళిపోయింది. అందమైన ఆమె ముఖం మరొక్కసారి చూడగలిగితే బాగుండునని నానా మనసులో అనుకున్నాడు. వెంటనే సాయి అతని తొడ పై గట్టిగా చరచి, ”నేను ఎందుకు చరచానో అర్థమైందా?” అన్నారు. అప్పుడు నానా సిగ్గుపడి, “బాబా, నాకు మీ సన్నిధిలో గూడా యింత తుచ్చమైన భావాలేందుకు కలుగుతున్నాయి?’ అన్నాడు. అపుడాయన, ” నీవు మానవమాత్రుడవు. నీ దేహమంతా వాసనలతో నిండివుంటుంది, ఇంద్రియాలకు విషయాలు గోచరించగానే వికారాలు తలెత్తుతాయి. కాని అందమైన ఆలయాలెన్ని లేవు? మనము వాటి బాహ్య సౌందర్యంగాక లోపల దైవాన్ని దర్శించినట్టే జీవదేహాలనే ఆలయాల బాహ్యరూపాలనుగాక, వాటిలోపలుండే దైవాన్నే చూడాలి” అన్నారు.
నానాసాహెబ్ చందోర్కర్ ను మరొక విషయంలో గూడా సంస్కరించారు బాబా. మొదట ఎవ్వరిదగ్గరా ఎట్టి దక్షిణలు స్వీకరించని బాబా, ఒకప్పుడు భక్తులు సమర్పించిన దానిలో అతిస్వల్పంగా మాత్రమే తీసుకోనారంభించారు. భక్తులసంఖ్య పెరిగేకొద్దీ వారినుండి ఆయన దక్షిణ అడిగి తీసుకోరారంభించారు. నానానుగూడ తరచుగా దక్షిణ అడిగి తీసుకొనేవారు. అతడు శిరిడీ వెళ్ళినపుడు సుమారు రూ.400/-లు తనవద్ద వుంచుకుని బాబా కోరినపుడు కోరినంత యిస్తుండేవాడు.
ఇచ్చినమాట నిలుపుకోవాలన్నది బాబా చెప్పిన మూలసూత్రం. ఎవరైనా యాచిస్తే లేదని అబద్దం చెప్పకుండా యథాశక్తి యివ్వాలని, అది బొత్తిగా వీలుగానప్పుడు సౌమ్యంగా యివ్వలేనందుకు కారణం చెప్పాలని, యివ్వడానికి ఏమీలేనపుడు అందుకభిమాన పడకూడదనీ ఆయన చెప్పేవారు. కారణం అందరికీ అనలైన దాత భగవంతుడే. అన్నీ మనకు ఆయన యిచ్చినవే. ఆయన మనతో ఎలా వ్యవహరించాలని ఆశిస్తామో అలా ముందుగా మనం సాటి జీవులతో వ్యవహరించాలి; అవీ ఆయన రూపాలేగదా! ఒకప్పుడు కోపర్గాంలోని దత్తమందిరంలో ఒక ధర్మకార్యానికి రూ.300/-లు విరాళమిస్తానని ఒక సాధువుకు నానా వాగ్దానం చేశాడు. కాని అటుతర్వాత ఆ పైకం తెచ్చి వారికివ్వలేదు సరికదా, శిరిడీ వచ్చేటప్పుడు ఆ మందిరంవారికి తన ముఖం చూపవలసి వస్తుందని ఆ మందిరానికి వెళ్ళకుండానే శిరిడీ వచ్చాడు. అందుకోసం అతను ప్రత్యేకించి ఒక ముళ్ళబాటగుండా ప్రక్కదారిలో శిరిడీ చేరాడు. కాని సాయిబాబా ఎంతకూ అతనితో మాట్లాడలేదు. కారణమడిగితే, * నేను చెప్పినది గుర్తుంచుకోనివారితో నేనెందుకు మాట్లాడాలి?” అన్నారు. * మీరు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి” అన్నాడు నానా, ” మీరు పెదమనుషులే! కాని దారిలో ఆ ‘సర్కార్’ను చూడకుండా చుట్టూ తిరిగి వచ్చినది ఆ సాధువు ఆ రూ.300/-లు అడుగుతాడనేగా? నేచెప్పినది గుర్తుపెట్టుకునేది యిలాగేనా? నీదగ్గర డబ్బులేకపోతే, అది సర్దుబాటు చేయటం కష్టమైతే, ఆమాట అతడితో చెప్పవచ్చుకదా? ఆ సాధువేమైనా నిన్ను తినేస్తాడా? అతడా డబ్బు అడుగుతాడని వెరచి దైవదర్శనమే మానుకోవడమేమిటి? ఇప్పుడు మాత్రం నీకాళ్ళల్లోనూ, వంటిమీద, నీ స్నేహితునికీ ముళ్లు గుచ్చుకోలా? ఇలాంటి వాళ్ళతో నేనెలా మాట్లాడను?” అన్నారు.
అంతేగాదు– ఎవరైనా అడిగినపుడు అహంకారము, అధికారము లేకుండా దానం చేయాలని బాబా అతనితో చెప్పేవారు. అతడు గూడ జాగ్రత్తగా వుండేవాడు. కాని ఒకసారి కల్యాణ్ లో ఒక పేదరాలైన వృద్ధ బ్రాహ్మణ స్త్రీ వారింటికి భిక్షకు వచ్చింది. నానా భార్య ఆమెకు రెండుశేర్లు ధాన్యమిచ్చినా ఆమె తృప్తి చెందక, నాలుగుశేర్లిస్తేగాని అక్కడనుండి వెళ్ళనని చెప్పి వేధించసాగింది. అంతటితో విసుగుచెంది నానా, ‘ఇచ్చింది తీసుకుపోతావా, లేక జవానుచేత గెంటించమంటావా?” అని బెదిరించాడు. ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతడు శిరిడీ వెళ్ళినపుడు బాబా అతనితో ఎంతకూ మాట్లాడలేదు. కారణమడిగితే, ” నీవు నేను చెప్పినది మరచిపోయావు. ఆ పేదరాలు యింకా యింకా యివ్వమని కోరితే అంత కోపగించుకొని నీఅధికారం చూపడమెందుకు? ఆ చేప్పేదేదో కొంచెం మర్యాదగా చెప్పవచ్చుగదా? కాకుంటే యింకొచెం సేపు నిలబడి వెళ్ళిపోయేది గదా?” అన్నారు.
సద్ధంథాలు చదవడం వలన వివేక వైరాగ్యాలు పెంపొంది, నమ్రత కల్గుతేనే జన్మ సార్థకమవుతుంది. అలాగాక, విద్యా గర్వమేర్పడితే వ్యర్థమే. చక్కగా శాస్త్రాలు చదువుకొనడం వలన నానాకు ఏర్పడిన విద్యాగర్వాన్ని సాయి సంస్కరించారు. ఒక భగవద్గీతా శ్లోకానికి ఆయనెలా అర్థం చెప్పారో, అతిథి సేవ విషయంలోని ధర్మసూక్ష్మ మెలా తెలిపారో, ” శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూచాము. అన్ని జీవులతోపాటు చీమలు, ఈగలు వంటి అల్పజీవులలోగూడ తామే వున్నామని సాయి అతనికెలా తెలిపారోగూడ ఆ గ్రంధంలో చూచాము. అతడు శ్రోత్రియ కుటుంబంలో పుట్టి పెరిగినందువలన, సాయిపట్ల ఎంత భక్తి శ్రద్దలున్నా, నానాకు ఆయన ముస్లీమన్న అభ్యంతరమాత్రం మొదట్లో వుండేది. అందుకే భక్తులందరూ సాయి పాదాలు కడిగిన నీరు తీర్థంగా తీసుకుంటున్నా ఇతడు, దాసగణు మాత్రం తీసుకొనేవారుగాదు. కానీ ఈ దురభిప్రాయం క్రమంగా అతనికి తొలగిపోయింది.
శ్రీ సాయి నాథాయనమః !