బల్వంత్ నాచ్నే
శాంతారామ్ బల్వంత్ నాచ్నే తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. అతడు బాబా గురించి మొదట 1909లో విన్నాడు. కొంతకాలం తర్వాత నాచ్నే తండ్రి ఒకరోజు దాసగణుచేసిన కీర్తనలో సాయిబాబా సాక్షాత్తూ దత్తాత్రేయుని అవతారమని విన్నాడు. అతడు సాయిపటం తీసుకొచ్చి నాటినుండి దానినిగూడ పూజించసాగాడు.
బల్వంత నాచ్నే మొదటిసారిగా 1912లో శిరిడీ వెళ్ళాడు. అంతకుముందే అతడు ప్రభుత్వ ఆదాయశాఖలో స్థిరమైన ఉద్యోగానికి అవసరమైన పరీక్ష వ్రాశాడు.
దహనూలో పనిచేస్తున్న అతడు బొంబాయి నగరానికి ఉద్యోగంలో బదిలీ కావాలనిగూడ ఆశిస్తున్నాడు. కాని అదెంతో కష్టమైన పని. ఈ రెండు కోరికలు దృష్టిలో పెట్టుకుని అతడు మరియిద్దరు మిత్రులతో కలసి శిరిడీ బయల్దేరాడు. వారు కోపర్గాం చేరాక అచటి స్టేషన్ మాస్టర్ వీళ్ళు శిరిడీ వెళ్తున్నారని విని బాబాను తీవ్రంగా విమర్శించాడు. బాబా కేవలం క్షుద్రశక్తులుగల మంత్రగాడని, అమాయక ప్రజలను తన క్షుద్రశక్తులతో లోబరుచు కుంటున్నాడని, ఆయననంతగా గౌరవించడం వ్యర్థమనీ విమర్శించాడు. అదంతా వినేసరికి బల్వంత్ నాచ్నేకు బాబాపట్ల ఎన్నో సంశయాలు కలిగాయి.
అయినా ఎలాగో ఆ బృందం శిరిడీ చేరింది. సరిగ్గా అదే సమయానికి లెండినుండి బాబా మశీదుకొస్తూ దారిలోనే వారికెదురయ్యారు. బాబా తిన్నగా బల్వంత్ నాచ్నే కేసి చూసి, ‘ ఏమిటి, మమల్తాదారువద్ద సెలవు కోరకుండానే వచ్చావా? ఇంకెన్నడూ యిలా చేయకు!” అన్నారు. అంతటితో బాబా సర్వజ్ఞలని ఆతడికర్థమైంది. కోపర్గావ్ లో స్టేషను మాస్టర్ చేసిన విమర్శలన్నీ పటాపంచలైనాయి. అపుడు నాచ్నే సాయి సన్నిధిలో మూడు రోజులున్నాడు. ఆ కొద్దికాలములోనే భక్తుల పై బాబాకుగల (ప్రేమ, మహత్తరమైన ఆయన దివ్య శక్తులను నిరూపించే సన్నివేశాలెన్నో చూచాక సాయి దత్తావతారమేనన్న విశ్వాసం అతడికి కలిగింది. ఒకరోజు బాబా అతని చేతిలోని ఊదీ తీసుకొని స్వయంగా అతని నొసట పెట్టారు. అది వారి ప్రత్యేకమైన అనుగ్రహానికి చిహ్నం. తర్వాత ఒక ఏకాదశినాడు మధ్యాహ్న హారతికి ముందు సాయి యితనిని వాడాకు వెళ్ళి భోంచేసి రమ్మన్నారు. తన సాటివారు ఏకాదశినాడు ఉపవశిస్తుంటే తాను భోజనం చేయడం బాగుండదని తలచి ఆరతి అయ్యాక భోంచేస్తానన్నాడు. కాని సాయి అంగీకరించక అతడు భోజనం చేసి వచ్చేవరకూ ఆరతి ఆపించారు. తర్వాత ఒక భక్తురాలు సమర్పించిన తాంబూలం గూడ బాబా అతడికిచ్చి తినిపించారు. ఆరతి అయ్యాక బాబా అతనివద్ద రూ.4/-లు, అతని మిత్రుడు వైద్యునివద్ద రు.16/-లు తీసుకున్నారు గాని; మిత్రుడు దాబేను దక్షిణ కోరలేదు. కారణం అతనికి దక్షిణ యివ్వడం యిష్టంలేదు. అటుపై వివరం నాచ్నే యిలా వ్రాశాడు; ‘దాటే తనతోకూడ తెచ్చుకున్న బత్తాయి పండ్లలో కొన్నిటిని వాడాలో వుంచుకుని కొన్నిమాత్రమే బాబాకు సమర్పించాడు. వాటిని అందరికీ పంచేశాక, ఒక మార్వాడీ అమ్మాయి తనకు బత్తాయిలు కావాలని బాబా నడిగింది. ఆయన దాటే ను మిగిలిన పండ్లుగూడ తీసుకురమ్మన్నారు. అతడు తాను వాటిని ఏకాదశినాడు అల్పాహారంగా తినేందుకు తెచ్చుకున్నానని చెప్పి యివ్వలేదు, బాబా యింక అడగనూలేదు.
రెండవరోజు కాకాదీక్షిత్, జోగ్ , దభోల్కర్ మొన వారికి నన్ను చూపి బాబా, “నేనొకరోజు యితని యింటికి భిక్షకు వెళ్ళాను. కానీ వీళ్ళు నేనడుగుతేగాని నాకు బెండకాయ కూర వేయలేదు” అన్నారు. వెంటనే 3నంల క్రిందట అనగా 1909లో జరిగిన సంఘటన జ్ఞాపకమొచ్చి నేనెంతో ఆశ్చర్యపోయాను.( 1909లో , అతని అన్నగారిని బొంబాయిలోని ఒక ఆస్పత్రిలో కంఠవణానికి శస్త్రచికిత్స కోసం చేర్పించారు. సరిగ్గా అదేరోజున వారింటికొక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. భోజనం వడ్డించాక, బెండకాయ కూర కావాలని పదే పదే అడిగి వేయించుకుని, రోగికి బొంబాయిలో భద్రంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పి వెళ్ళాడు. అపుడు వారింటికి వచ్చిన ఫన్సే అను మిత్రుడు ”సాయిబాబా దయవల్ల శస్త్రచికిత్స బాగానే జరిగివుంటుంది” అన్నాడు. సాయి గురించి బల్వంత్ నాచ్నే వినడం అదే ప్రథమం. సాయంత్రమయ్యేసరికి, అతని అన్నకు శస్త్రచికిత్స బాగా జరిగిందని, తర్వాత ఒక సాధువు వచ్చి అతడి కంఠం నిమిరి అది బాగవుతుందని చెప్పి వెళ్ళాడనీ బొంబాయినుండి కబురొచ్చింది.) కారణం మా యింటికొచ్చిన సాధువుకు, బాబాకూ పోలికలేదు. అపుడు నేను నాపరీక్షా ఫలితం గురించి అడిగితే బాబా, ‘అల్లా మాలిక్ హై’, ‘అల్లా అచ్ఛాకరేగా’ అని నా తల పై చేయివుంచి ఆశీర్వదించారు.
శిరిడీ చేరిన మూడవ రోజున మేము మశీదు వెళ్ళేసరికి అక్కడ బాబా పట్టరాని కోపావేశంతో చిందులు తొక్కుతున్నారు. ఆయన కళ్ళు చింత నిప్పులులా వున్నాయి. అందరూ భయపడి పారిపోయి 15 ని.ల వరకూ మశీదులో అడుగు పెట్టడానికెవరూ సాహసించలేదు. అది చూచాక బాబా పిచ్చివారేమోనన్న సందేహం మాకుగూడ కలిగింది. చివరికెలాగో ఆయన శాంతించాక, మేము ముగ్గురమూ వెళ్ళి ఆయనవద్ద సెలవు కోరాము. బాబా నాకు ఊదీ యిస్తూ, “నీవు ఉద్యోగానికి బొంబాయి రావచ్చుగదా!” అన్నారు. (అది భవిష్యవాణో, వారి శానమో తెలియదుగాని, 6సం.ల తర్వాత నాకు బొంబాయికి బదిలీ అయింది). నేను ఆఫీసులో సెలవు తీసుకోకుండా ఊరు. విడిచిపోయినట్లు నా పై అధికారి బి.వి. దేవ్ గుర్తించాడుగాని, అతడు నా పై చర్య తీసుకొనక హెచ్చరికచేసి విడిచి పెట్టాడు.
అటుతర్వాత నేను 1913 నుండి మళ్ళీ మళ్ళీ శిరిడీ రాసాగాను. నేను 1913లో శిరిడీ బయల్దేరుతుంటే నా మిత్రుడు ఫన్సే నన్ను కలుసుకుని, అతడు ఆఫీసులో డబ్బు తినేశాడన్న అభియోగం పై తనకు జైలు శిక్ష విధించారని, ప్రస్తుతం తనను బెయిల్ పై విడుదల చేసారనీ చెప్పారు. తాను కోర్టులో అప్పీలు చేసుకోబోతున్నానని చెప్పి, తన తరపున బాబా ఆశీస్సులు కోరమని నాతో చెప్పాడు. నేను శిరిడీ చేరేసరికి చావడిలో కాకడ ఆరతి (ఉదయ హారతి) జరుగుతోంది. అపుడు బాబా ఎంతో కోపంతో వున్నారు. అయినప్పటికీ నన్ను చూస్తూనే ఆయన, ‘వాడేమీ భయపడనక్కరలేదని చెప్పు. అప్పీలు చేసుకోగానే అతనిని విడుదల చేస్తారు’ అన్నారు. నేను శిరిడీనుండి తిరిగి రాగానే బాబా చెప్పినమాటలు ఫన్సేతో చెప్పాను. కాని అప్పటికే అతను విడుదల అయ్యానని చెప్పాడు! బాబా అభయమిచ్చిన వెంటనే ఆ కార్యం నెరవేరింది.
బాబా ఒకరోజు భక్తులందరి యెదుట నాతో, ‘పిచ్చివాళ్ళను నమ్మగూడదు’ అన్నారు. అపుడు నాకేమీ అర్ధంగాలేదు. నేను 1914లోదహనూలో కోశాధికారిగా పనిచేస్తున్న కాలంలో ఒకరోజు యింట్లో పూజ చేసుకుంటున్నాను. అపుడు రామకృష్ణ బల్వంత్ ఫన్సే అను ఒక పిచ్చివాడు మా వంటగది తలుపు దగ్గర నిలుచుని వున్నాడు. అతడెవరినీ బాధించేవాడు గాదు. గనుక నేను పట్టించుకోలేదు. కాని నేను పూజ చేస్తుండగా మధ్యలో ఆతడు ఒక్కసారిగా నామీదకు దూకి నా గొంతు పిసుకుతూ, “నీ రక్తం తాగుతాను!’ అని కేకలేస్తున్నాడు. నేను వెంటనే ఉద్దరణిని అతని నోట్లో అడ్డంగా పెట్టి, మరోచేత్తో అతని పట్టు విడిపించుకోజూచాను. అతడు నా వేళ్ళు కొరికేస్తున్నాడు. మా అన్న నాకు సహాయమొచ్చేసరికి నేను చచ్చినంత పనయి స్పృహ కోల్పోయాను. తర్వాత వైద్య సహాయంలో నేను కోరుకున్నాను. తర్వాత నేను శిరిడీ వెళ్ళినపుడు బాబా నాకేసి చూపుతూ అన్నా చించినీకర్ తో, “అన్నా, నేనొక్కక్షణం ఆలస్యం చేసినా యితడు చచ్చేవాడే. ఆ పిచ్చివాడు యితడి గొంతు పట్టుకున్నాడు. నేనెలాగో యితనిని విడిపించాను. ఏంచేస్తాం, నా బిడ్డలను నేను రక్షించకుంటే ఎవరు రక్షిస్తారు?! అన్నారు.
నేను, వైద్య 1915లో మరొకసారి బాబాను దర్శించాము. బాబా చేతినుండి ప్రసాదంగా తాను పూజించుకునేందుకు తీసుకోదలచి, వైద్య ఆయనకు వెండి పాదుకలు సమర్పించాడు. కాని బాబా వాటిని నాకు ప్రసాదించారు. ”అవి అతడివి గదా!” అని తలచి అతడికిచ్చివేసాను. శ్యామా ఆవిషయం బాబాతో చెప్పినపుడు, ఆయన వాటిని నాకు తిరిగి యిప్పించారు.అతడి వద మరొకజత వెండిపాదుకలు గూడా వున్నాయి. కాని బాబా వాటినిగూడ అడిగి తీసుకుని నాకే ప్రసాదించి ‘ వీటిని నీ దగ్గరుంచుకొని పూజించుకో!” అన్నారు. అవి వైద్య కు చెందినవని కనుక అతనికే యివ్వాలనీ నేనన్నాను. ఆయన, ‘ఇప్పుడు నీ దగ్గరుంచుకో, అతనికి తర్వాత యివ్వవచ్చులే!” అన్నారు, నేనలాగే చేసాను.
ఆ సంవత్సరమే మరొకసారి మేము శిరిడి వెళ్ళాము. నాకు కలిగిన పిల్లలందరూ మరణించడం వలన నాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు కోరదలచింది. అపుడు శ్యామా నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి ఆమె కొంగులో ఒక కొబ్బరికాయ వేయమని కోరాడు. అపుడు బాబా నాభార్యకు కొబ్బరికాయ ప్రసాదిస్తుండగా ఆయన కళ్ళలో నీళ్ళు నిండాయి.
ఆయన నన్ను తమవద్ద కూర్చుని పాదాలు వత్తమన్నారు. నేనలాగే చేస్తుంటే ఆయన నా వీపు నిమిరారు, ఆయన ప్రేమకు కరిగిపోయాను. వెనుక ఒక పిచ్చివాడు నన్ను చంపబోయినప్పుడు నావద్ద వారి పటముండబట్టి గండం గడిచిందని బాబాతో అన్నాను. అపుడు బాబా, ‘అల్లాహ్ మాలిక్ హై’ అని మాత్రమన్నారు. అపుడు ఆయనా, నేనూ ఒకరినొకరం కౌగలించుకున్నాము.
ఒక భక్తుడు చేసుకునే సేవలో మరొకరు జోక్యం చేసుకుంటే బాబా తీవ్రంగా ఖండించేవారు. ఒకనాడు బాబా, “నాకు కడుపులో నొప్పిగావుంది! అన్నారు. ఒక భక్తురాలు కాలిన ఇటుక, బాబా పొట్టమీద కఫ్నీ పైనే పెట్టి వారి డొక్కలను ఎంతో గట్టిగా మర్దించసాగింది. సున్నితంగా మర్దించమని ఆమెతో చెప్పాను. వెంటనే బాబా ఉగ్రులై నన్ను లేపి అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని ఆదేశించారు. నేనలాగే చేసాను.
నాటిరాత్రి 8 గంలకు నేను మశీదుకు వెళ్లి ‘ బాబా! నేను జపం ఏమని చేసేది?’ అని అడిగాను. ఆయన, ‘దేవపూర్ వెళ్లి మీ పూర్వీకులందరూ అర్చించిన శిలలనే పూజించు’ అన్నారు. తర్వాత నేను దహనూ తిరిగి వచ్చాక బాబా భావమేమని నా తండ్రిగారినడిగాను. ఆయన చెప్పినది: అయిదు తరాల వెనుక మా పూర్వీకుడైన బాబా ప్రయాగ్ కు 60 సం.లు వచ్చినా సంతానం కలుగలేదు. అతడు ఏకనాథుని శిష్యుడైన బాబా భగవత్ అను మహాత్ముని త్రయంబకంలో దర్శించాడట. అటు తర్వాత అతనికి కొడుకు పుట్టాడట. అప్పటినుండి మా వంశంలో ప్రతివారూ మా గురు వంశస్థులనుండి ఉపదేశం పొందటం ఆచారమైందిట. నన్నుగూడ అలానే చేయమని బాబా భావమట.
మనం కష్టంలో వున్నపుడు బాబాను ప్రార్థిస్తాము. జైలుశిక్ష నుండి ఫన్సేకు విడుదల లభించినట్లు మనకుగూడ వెంటనే రక్షణ లభిస్తేనే బాబా రక్షించాలనుకొంటాము. బల్వంత్ నాచ్నేకు ఉద్యోగం బొంబాయికి బదిలీ అయ్యేలా ఆయన ఆశీర్వదించాక అది ఫలించడానికి 6 సం.లు పట్టింది. అలానే అతనిని పిచ్చివానిబారినుండి బాబా రక్షించినప్పటికీ, ప్రత్యక్షంగా ఆ సన్నివేశం చూచినవారికి బాబా రక్షించనట్లే తోస్తుంది. అందుకే బాబా రక్షణను పొందినా గుర్తించగలగాలంటే ఆయనపట్ల సంపూర్ణమైన విశ్వాసము, ఓరిమీ రెండూ వుండాలి. బాబా మనను రక్షించినట్లు ఎంతగా అనిపించినా, నిజానికి యింకెంతగానో ప్రమాదించవలసిన పరిస్థితి అంతటితో పోతుందన్నది తథ్యం. సాయి ఎంత నిత్యసత్యులో వారి రక్షణగూడ అంత నిత్యసత్యమైనదే. మన విశ్వాసము, ఓరిమి అంతటివవడమే జరుగవలసింది.