జై సాయినాథాయ నమః !
“సమాజంలో ఎప్పుడూ స్వార్థపరులు వుంటారు. తమ స్వార్థప్రయోజనాలకు అడ్డువచ్చిన వారిని ఏ మాత్రం సహించరు. తమ చెడుగుణాలను మంచిగాను, ఎదుటి వారి మంచిని చెడుగాను ప్రచారం చేస్తూ వుంటారు. కాని కాలం యొక్క గమనంలో తమ తప్పులకు తగిన ఫలితాలు అనుభవించక తప్పదు. ఈ సత్యాన్ని ఎవరు మరచిపోరాదు. మితిమీరిన స్వార్థపరుల దౌర్జన్యాలను అరికట్టుటే దసరాపండుగలోని దేవీ ఆరాధనోత్సవాలు. సమాజాన్ని భ్రష్టుపరచే అసురీశక్తుల ఆట కట్టించటమే దసరా పండుగలోని నిగూఢ అర్థము. షిరిడిసాయి దేముడు కూడ ప్రపంచానికి సుస్థిర శాంతిని అందించటానికే దసరా రోజున కు తన శరీరాన్ని వదిలి అశరీర దివ్యశక్తిగా మారి ఈనాటి భక్తలోకాన్ని పరిపాలిస్తున్నాడు. జగతికి ఉపకరించే సర్వపనులకు శ్రీ షిరిడిసాయి తప్పక సమర్థిస్తాడు. లోకోపకారానికే షిరిడిసాయి అనుగ్రహం. పరోపకారాయణులకే సాయికృప లభిస్తుంది. ప్రకృతి కలిగించే కష్టనష్టాలు దైవికాలు. స్వార్థపరుల దౌర్జన్యాలు మానవ కల్పితాలు. షిరిడిసాయి దివ్య మధురశక్తితో నిజభక్తులు ఈరెండింటిని దాటగలరు. చెడు, స్వార్థపూరిత ఆలోచనలు వదిలివేయాలి. బద్దకము అశ్రద్దలను జయించాలి. ప్రయత్నశీలంగ ప్రతిపనిని సాధించాలి. కర్తవ్యనిష్ఠ, ధర్మబుద్ధి, ఉత్సాహాలు కలిగి వుండాలి. అలాంటి వారికి షిరిడిసాయి విజయాలను తప్పక ప్రసాదిస్తాడు .”
“త్యాగవంతులకే ఆత్మాభివృద్ధి కలుగుతుంది. స్వార్థపరులకు భౌతికాభివృద్ధి మాత్రమే కలుగుతుంది. త్యాగంలేని వారికి ఆత్మశక్తులు అందవు. త్యాగం ఒక్కొక్కటి చేస్తున్న కొద్ది పరుల బాధలు తీర్చేశక్తి, ఇతరుల కోరికలు తీర్చేశక్తి కలుగుతుంది. స్వార్థపరులకు ఈ రెండు అసాధ్యాలు. అందుకే భౌతికంగా చాలా గొప్పవారందరూ భౌతికంగా ఏమీలేని ఆత్మశక్తివంతులను ఆశ్రయించవలసి వస్తుంది. నేను నా కుటుంబము అనే పరిధులు దాటి ప్రజలందరి సుఖం కొరకు పనిచేసే వారికి షిరిడిసాయి దైవశక్తి నిండుగా లభిస్తుంది. వేదాలు చదువుకున్న పండితుల కంటే వేదబోధలు తెలియక పోయినా, త్యాగధనులైన సామాన్యులను ప్రజలు ఆశ్రయించి సుఖాలు పొందుతూ వుంటారు. ఇది ఈ నాటికీ సమాజంలో జరుగుతూనే వుంది. కుటుంబ జీవితంలో వున్నవారు కూడ, కుటుంబ అవసరాలకు ఒక పరిమితి పెట్టుకుని, ఆ తరువాత అయినా పరోపకారానికే జీవించవచ్చు. మితిమీరిన ఆశలు ఆధ్యాత్మికాన్ని నాశనం చేస్తాయి. కపటత్వ మోసాలు ఆధ్యాత్మికానికి వ్యతిరేకాలు, సర్వసమత్వ భావాలు ఆధ్యాత్మికాన్ని పెంచుతాయి. సత్య, ధర్మ, న్యాయాలు ఆధ్యాత్మికానికి పునాదులు”.
“సర్వ సమస్యలు, వైఫల్యాలు మనిషి ప్రవర్తన వలననే వస్తాయి. సత్పవర్తనతో అన్నింటినీ అధిగమించాలి. సద్భావాల చైతన్యశక్తి మనిషికి ఒక షిరిడిసాయి వరమే! సర్దుకుపోతూ, సమర్థవంతంగా పనిచేసే మనిషికి కాలమే దేముడు. కర్తవ్యాన్ని మరువరాదు. నిరాశలో మునిగిపోరాదు. “
“ఎంత వత్తిడి పనులు హడావుడి వున్నా, మధ్యలో ఒక్క పదినిముషాలు అంతరంగదృష్టి నిలిపి ప్రశాంతంగా ఏకాంతంగా వుంటే చాలా దివ్యానందాన్ని పొందవచ్చును. సర్వ యింద్రియాల ద్వారా మనిషి పవిత్ర జీవితాన్ని గడపాలి. ఇంద్రియాలే అదుపు తప్పితే అపవిత్రతలను కలిగిస్తాయి. సర్వబంధాల నుంచి విముక్తి పొందని మనసుకు ఆత్మానందం తెలియదు. ఆత్మానందమే ఆత్మబలానికి మూలం. ఆత్మబలం వలన జ్ఞానం తెలుస్తుంది. జ్ఞానము అంటుకోనిదే అహము నశించదు”.
“వ్యంగ్యపు మాటల వలన ప్రయోజనముండదు. ఎదుటి వారి మనసును గాయపరచటం ఒక దోషమే అవుతుంది. లోలోపలి కోపతాపాలే వెక్కిరింతలౌతాయి. వేళాకోళాలు, వెక్కిరింపులు అపరిపక్వతకు చిహ్నాలే. మితిమీరిన అలసట, వత్తిళ్ళు మనిషిని అశాంతి పరుస్తున్నాయి. పర్యవసానంగా సహనగుణం నశిస్తున్నది. నెరవేరని ఆశలు, ఆశయాలు కూడ మనిషికి నిరాశ నిస్పృహలు కలిగిస్తాయి. మానవజీవితం ఆనందించటానికే షిరిడిసాయి ప్రసాదించాడు గాని పోట్లాట, కొట్లాటల కొరకు కాదు. సగటున చాలా తక్కువ మందే జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు”.
జై సాయినాథాయ నమః !