జై సాయి రామ్ !
పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారి ద్వారా నిర్హహించబడే సాయి కోటి మహా యజ్ఞాల్లో ,పరమ పావన సాయి నామములు నిక్షిప్తం చేస్తూ నిర్మించబడే సాయి కోటి మహా స్థూపము ల వద్ద, భక్తులు చవి చూస్తున్న సాయి లీలలు ఈ శీర్షిక న తెలుసుకుందాము.
సాయిబంధువు, టి. గీతాదేవి, హరిప్రసాదరావు, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా, గారి అనుభవం తెలుసుకుందాము.
“పూజ్యగురువులు శ్రీ, అమ్ముల సాంబశివరావుగారి పాదపద్మములకు నమస్కరించుచు, నా జీవితంలో గురువుగారి ఆశీర్వాదముతో బాబాగారి ఆశీస్సులతో జరిగిన కొన్ని సంగతులను తెలియచేయుచున్నాను.
మా వారు బ్రాందీ షాప్‌లో క్యాషియర్‌గా పనిచేస్తుంటారు. ఒకరోజు 18-10-97 తేదీన రాత్రి షాప్ నుండి 50 వేలు రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చి గేటు తీస్తు ఉండగా, వెనుకనుండి ఒక దొంగ సైకిలను తీసుకొని పారిపోయినాడు. బ్రాందీషాప్లో వాటా ఉండటం వలన పోయిన డబ్బులు దానిలో తగ్గించుకుంటారని భయంతోఉండగా మా అన్నయ్యగారి అబ్బాయి ఐ.వి. శరత్ కుమార్ పెళ్ళికి 26-10-97 తేదీన రేణిగుంట యజ్ఞానికి వెళ్ళి గురువుగారిని దర్శించి, పోయిన డబ్బు సంగతి గురువు గారితో చెప్పినాము. అప్పుడు గురువుగారు మీరు భయపడవద్దు అని మా వారిని ఒక వారం బాబా జీవిత చరిత్ర పారాయణ చేయమని చెప్పినారు. గురవుగారి ఆశీర్వాదంతో మా వారు బాబా జీవిత చరిత్ర పారాయణ చేసినారు. ఆ తరువాత 15-12-98 తేదీన 100 వ సాయికోటి మహాయజ్ఞం 100 అడుగుల సాయికోటి స్తూపం వద్దకు వెళ్ళి ఆ స్తూపం చుట్టూ 11 సార్లు తిరిగితిమి. ఆ తరువాత శ్రీ షిరిడి సాయిబాబా వారి అనుగ్రహంతో మరియు గురువుగారి ఆశీస్సులతో బ్రాంది షాప్ వాటలో పోయిన 50 వేల రూపాయలు తగ్గించకుండా మొత్తం ఇచ్చినారు. ఇది అంతా బాబా వారి గురువుగారి అనుగ్రహం.
అదేవిధంగా 100 వ సాయికోటి మహాయజ్ఞంలో నేను సాయికోటి స్తూపం చుట్టూ 11 సార్లు తిరిగి ,మనఃపూర్వకంగా బాబావారిని ఒక కోరిక కోరినాను. బాబా సొంత ఇల్లు కావాలి, నీదే భారం అని కోరుకున్నాను. ఆ తరువాత 7 నెలల్లోనే సొంత ఇల్లు కొన్నాము. 4-2-99 తేదీన గురవుగారు మా ఇంటికి వచ్చి హారతి కూడా ఇచ్చినారు. ఇది అంతా బాబా మరియు పూజ్యగురుదేవుల ఆశీస్సులతోనే జరిగినది అని నేను భావిస్తున్నాను. గురువుగారి అనుగ్రహంతో రెండవ బ్యాంచ్ సాయి సేవక్ దీక్ష కూడా తీసుకున్నాను. గురువుగారి మరియు బాబా వారి అనుగ్రహంతో ఇంకా బాబా సేవలో ఉండాలని, అందుకు బాబా మరియు గురువుగారి ఆశీస్సులు ఉండాలనీ మనఃపూర్వకంగా కోరుచున్నాము.”
–టి. గీతాదేవి, హరిప్రసాదరావు, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా,