Sree Sainaadhaaya Namaha !
We wish you all a VERY HAPPY AND WONDERFUL UGADHI. May SAINATH shower HIS blessings upon us♥♥♥
అమ్ముల (పూజ్య గురుదేవులు )బోధించిన సాధనా మార్గాలు-5
“మానవ జీవన గమ్యం ఎంత ఎత్తైనదైనా దానిని చేరుకునే నడక ఆ మనిషి పాదాలకిందే వుంటుంది. లక్ష్య సాధనకు పట్టుదల, అంకితభావం, నిరంతర శ్రమ అనేవి బలమైన సోపానాలు. ఆ మెట్ల మీదుగా ఎక్కి వెళ్ళే వారిని విజయం వరిస్తుంది. విజయాన్ని పొందే ముందు పరాజయ రాక్షసుల పలకరింపులు కూడ వుంటాయి. మనసును నిబ్బరంగా వుంచుకుంటేనే మనిషికి శాంతి లభిస్తుంది”.
“బాబావారి సేవలో మనుషుల మధ్య వచ్చే విబేధాలు ఈర్ష్య, ద్వేషాలను పుట్టించ కూడదు. వాటిని జయించలేని షిరిడిసాయి సేవ ఫలించదు. షిరిడిసాయి సేవలో వ్యక్తిగత గుర్తింపులు ఆశించుట పరోక పతనమే. అలాంటి వారిని చూసి మిగిలిన వారు అనవసరపు ఆందోళనలకు గురికారాదు. వ్యతిరేకతలను మనసుపై భారంగా తీసుకునే వారి ప్రావీణ్యతలు తగ్గిపోతాయి. అందువలన సాయిసేవ చేసేవారు ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వుండాలి”.
“ఆత్మబలం మనిషికి చాలా ముఖ్యం. కొందరు అన్నీ మంచి పనులు చేస్తూనే ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయపడుతూ వుంటారు. అలాంటి భయం చేసే పని మీద శ్రద్దను తగ్గిస్తుంది. అందువలన కర్తవ్య కర్మలు సరిగా జరగవు. అందువలన ప్రతి దానికి మనిషి భయపడటం ప్రావీణ్యాన్ని తగ్గించుకోవటం, ఆనందాన్ని నిరోధించుకోవటమే అవుతుంది”.
“నిస్వార్థ పవిత్ర ప్రేమ ఆధ్యాత్మికాభి దికి అత్యవసరమైన ఒక సాధన. ఇతరుల నుంచి లాభాలు అందాలనుకోవటం ఆధ్యాత్మిక తిరోగతే అవుతుంది, అజ్ఞానంలో మునగటమే. అంతరాత్మపై దృష్టి నిలపని వారికి ఆత్మజ్ఞానం కాదు. ఈ శరీరమే నేను అని భావించే వారందరికీ భౌతిక జీవనము వదలదు. భౌతికము వదలనంత వరకు ఆధ్యాత్మికము అంటుకోదు. అజ్ఞాన అహంకారాలతో ఉత్తములను బాధించుట మహా పాపమగును. ధన ఘన హోదాలే ప్రధానమైన వారికి ఆధ్యాత్మికత అంటనే అంటదు. షిరిడిసాయి ప్రేమ నిస్వార్థ సేవకులకు వజ్రకవచం లాంటిది. నేను షిరిడికి వచ్చిన ప్రతి సారి నా శరీర మనోబుద్ధులను, ఆత్మను పవిత్ర పరిచి, బలపరిచి పంపుతున్నట్లుగా నాకు అనిపిస్తూ వుంటుంది. నా భవిష్యత్తు జీవితాన్ని నీ యిష్ట ప్రకారం నడుపు అని సాయిని సమాధి మందిరంలో చాలా సార్లు నా అంతరాత్మ కోరుకుంటూవుంది”.
“మనిషికి కలిగే కష్టసుఖాలన్నీ స్వయం కృతాలే. పరహిత జీవనమే మనిషికి మహాబలం. త్యాగంలో నుంచే జ్ఞానం పుట్టుకొస్తుంది. అహంకారమంతా అజ్ఞానమే. ద్వేషభావం వదలని ఆధ్యాత్మికం రాణించదు. ప్రేమలేని చోట దైవత్వం వుండదు. ఇతరులకు మనం ప్రేమ పాత్రులం కావటమే నిజ ఆధ్యాత్మికాభి వృద్ది. హీనదీన జనులను దూరం చేసే ఆధ్యాత్మికాభివృద్ధి రాణించదు. సమాజానికి నీడనిచ్చి సేద తీర్చేదే నిజమైన హిందూ ధర్మము.”