సాయి దేవాయ నమః♥♥ !
“శారీరక బలహీనత కంటే మానసిక బలహీనత మనిషిని కృంగదీస్తుంది. మానసిక బలహీనతే సర్వ అనర్థాలకు, జబ్బులకు కూడ మూలము. జీవితం నిజానికి ఒక మధురానుభూతి. సృష్టిమాధుర్యాన్ని అనుభవించి ఆనందించుటకే ఆత్మ శరీరధారణ చేసింది. తన సృష్టిని తానే రసాత్మకంగ అనుభవించాలనే శరీరయింద్రియాలను ఆత్మ సృష్టించుకున్నది. . కాని అజ్ఞానప్రభావంతో మోహబంధాలను బంధించుకుని నిరంతరం బాధపడటమే నేర్చుకుంటున్నది. కష్ట, నష్ట, బాధలు , ఎన్నివున్నా ఆనంద రసానుభూతి ప్రతిక్షణం అనుభవించి ,తరిస్తుంటారు జ్ఞానులు “
మరి ఆ పవిత్ర ఆత్మానందాన్ని అడ్డుకునేవి వి ఏంటో , ఆనందానికి మార్గాలేంటో పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావు గారి సాధనా మార్గాల నుండి తెలుసుకుందాము .. జై సాయి నాధా ! జై గురుదేవా !
“ఈనాడు మనము మనలని మనము తరచి చూస్తే , మనము ఎప్పుడూ ఏదో అశాంతి తో ఆందోళనలతో నే రోజు లో ఎక్కువ భాగం గడిపేస్తున్నాము అని అర్థమవుతోంది. అరిషద్వర్గాలయిన కామము క్రోధము లోభము మోహము మదము(అహంకారము ) మాత్సర్యాలు (అసూయ ) మన మనసులను అల్ల కల్లోలం చేస్తూ అశాంతి కి గురి చేస్తూ వున్నవి . అందువల్ల మనము ఆనందం గా ఉండలేక పోతున్నాము .. ఈ పై గుణాలని అన్ని విధాలు గా మన శత్రువులు గా తెలుసుకొని ఈ గుణాలు మన లో నుండి ఎప్పటి కప్పుడు తొలగించుకుంటూ ఉంటే , మన మనస్సు తప్పక ఆనంద శాంతి సాగరమే అవుతుంది . అపుడు ఉత్సాహం తో సాయి సేవ లో భక్తి లో నిమగ్నం కాగలుగుతాము”
“చాలా మంది జీవితంలో చిన్న చిన్న సమస్యలనే పెద్ద పెద్ద కష్టాలుగా భావించి బాధపడుతూ వుంటారు. అలాంటి వారికి జీవితం ఎప్పుడూ దుఃఖకరంగానే వుంటుంది. మరికొందరు ఎన్నెన్ని నిజకష్టాలు వచ్చినా ఏ మాత్రం చలించకుండా షిరిడిసాయిపై భారంవేసి జీవితాన్ని మామూలు గానే సాగిస్తూ వుంటారు. రెండవరకంవారు కష్టకాలంలో కూడ కష్టానుభూతిని పొందరు. జీవనసుఖానికి యిదే మార్గదర్శకం. ఎవరికి వారు కష్టసుఖాల మిశ్రమ జీవితంలో కష్టకాలంలో కూడ సుఖానుభూతినే పొందటం చాలా ఆదర్శవంత జీవనం అవుతుంది. దీనిని షిరిడిసాయిభక్తులందరూ నేర్చుకోవాలి. “
“చాలామందికి నిజమైన సమస్యలు ఏమీ లేనప్పుడు, ఏదోఒకటి వారి ఆలోచనలలోని లోపంతో ఒక సమస్యను సృష్టించుకుని బాధపడుతూ వుంటారు. ప్రతిరోజు ప్రతి మనిషి నేను హాయిగా, ఆనందకరంగ చక్కగావున్నాను, అని తన మనసుకు తాను చెప్పుకుంటూ వుండాలి. లేకపోతే మనసు తప్పుదారిలో ఆలోచిస్తూ వుంటుంది. సాధకులు ఈ మనోచాంచల్యానికి గురి కాకూడదు. ప్రపంచ ఆకర్షణలకు బలి అయితే కోరికలు చెలరేగి మనసును అల్లకల్లోల పరుస్తాయి. మనసును శూన్యంగా చేసుకోవటమే అసలు వైరాగ్యం అవుతుంది”.
“మిత్రులను ప్రేమించుట కంటే శతృవులను ప్రేమించుట చాలా గొప్పవిషయము. మానవజాతి క్షేమం కోరేవాడే నిజమైన మహాత్ముడౌతాడు. ప్రేమ, కరుణలు హృదయం నిండా నింపుకున్న వారే ధన్యులు. క్షమించే గుణం ఆధ్యాత్మికానికి అత్యవసరం అవుతుంది. పగ, విరోధ భావాలు రాక్షసత్వ లక్షణాలే అవుతాయి. ధనసంపదలు, ఘనహాదాల కంటే దయాకరుణలు గల హృదయం మనిషికి గొప్ప ఆనందాన్నిస్తుంది. ఆత్మను ఉత్తేజపరుస్తుంది. ఆత్మానందసాగరంలో ముంచి తేల్చుతుంది క్షమాగుణం మనిషిని”.
“మనం ఎలాంటి బాధలను అనుభవిస్తూ వున్నా, మనము ఎవ్వరినీ బాధ పెట్టరాదు. మన కష్టాలకు కారకులైన వారిమీద కూడ వ్యతిరేకభావాలు పెంచుకోరాదు. శ్రీ షిరిడిసాయిపై చెక్కు చెదరని విశ్వాసం వుండటమే సర్వస్వశరణాగతికి అర్థము. షిరిడిసాయి సారధ్యమే ఘనవిజయాలనిస్తుంది. నా కలం నిండా, ఆలోచనల నిండా, నేను చేసే కర్మల నిండా ఎప్పుడూ షిరిడిసాయి నిండి వుంటాడని నా నమ్మకము. నేను చేయగల ప్రతి పనిని నా చేత సాయే చేయిస్తాడని నా దృఢ నమ్మకము. సాయి తన అభయహస్తంలో నన్ను దాచుకుంటాడని కూడ నా నమ్మకము.”
“ప్రజలందరూ ఆశలపల్లకీలలో ఊరేగుతూనే వున్నారు. ఉన్నదానితో తృప్తిపడి వైరాగ్యభావాలు పెంచుకుంటే గాని ఆనందం అంకురించదు. షిరిడిసాయిదేముడు తగినంత సంపదలను యిచ్చినా యింకా తృప్తిలేక అశాంతిలోనే చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు. భూమి మీద గల ప్రతి మనిషి జీవితం అసంపూర్ణమే. అసంపూర్ణత మానవుని సహజగుణం. ఉన్నంతలో ఆధ్యాత్మిక జీవితమే కొంతవరకు మనిషికి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది. భౌతికజీవితంలో పరిపూర్ణత ఎంత గొప్ప మనిషికైనా అసాధ్యమే. ఈ సత్యాన్ని గ్రహించలేని వారందరూ పరిపూర్ణత సాధించటానికి తీరని కోరికలు తీరలేదనే అశాంతితో అలమటిస్తూనే వుంటారు”.
“షిరిడిసాయినాథుడు ప్రసాదించిన ధనసంపదలు, వసతులతో, మనుషులతో వున్నంతలో సుఖంగా, శాంతిగా జీవించటం ఆధ్యాత్మికానికి ఒక అవసరము. లేనిదానికోసం ఆరాటపడటం భౌతికంలో ఒక అశాంతి, ఆధ్యాత్మికంలో ఒక అనర్హత అవుతుంది. అనంత ఖగోళ గ్రహరాశులతో పోల్చిచూసుకుంటే ఈ భూమి ఎంత? ఈ సువిశాల సముద్రాలు, పర్వతాలు, అడవులతో పోల్చుకుంటే ఎంత? అనంతమైన జీవరాశితో పోల్చుకుంటే మాను ఎంత? వెయ్యి కోట్లు దాటిన ప్రపంచ మానవ సమాజ భారతదేశ జనాభా నూటముప్పైకోట్లు ఏ పాటిది? అందులో ఒక మనిషి జీవితం ఎంత?”
“మనము నివసించే ఈ భూమి వయస్సు వెయ్యికోట సంవత్సరాల పైబడి వుంటుందని చెబుతూ వుంటారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వున్నా, దీనిని ప్రమాణంగా తీసుకుంటే యిప్పుడు ఈ భూమి నడి వయసులో వుందని చెబుతారు. అంటే యింకా రాబోయే వెయ్యికోట్ల సంవత్సరాల వరకు ఈ భూమి యిలాగే వుంటుందన్న మాట. ఈ విధంగా ఆలోచిస్తే రెండు వేల కోట్ల భూమిపై గల సృష్టిలో వంద సంవత్సరాలు బ్రతికే మనిషి జీవితం ఎంత? ఆలోచించి ఈ బ్రతికిన వంద సంవత్సరాలలో తన సుఖాల కంటే పరుల సుఖాలు కోరుకుంటూ, అందుకు ప్రయత్నిస్తూ జీవించువారు ధన్యులు. వారే ఉత్తములు. వారికే పుణ్యం వస్తుంది. అలాంటి వారినే షిరిడిసాయిదేముడు ప్రోత్సహించి ముందుకు నడుపుతాడు. నిజానికి అలాంటివారినే షిరిడిసాయిదేముడు యిష్టపడతాడు. ఈసత్యాన్ని గ్రహించకుండా, కోరికలను అదుపులో పెట్టుకోకుండా, మితిమీరిన ఆశలతో సతమత మవుతూ ఉంటే చివరికి దుఃఖమే మిగులుతుంది “
“ఆనందం ఆంతరంగికమయినది .బయట చాలావరకు కనిపించదు. ఆనందం కలిగినప్పుడు సామాన్యులకు సర్వనాడులు పులకిస్తాయి. అలా పులకించటం వలన నాడులు శుద్దియై బలవత్తరమౌతాయి. అలాంటి నాడి వ్యవస్థకు రోగనిరోధకశక్తి కలుగుతుంది. యోగులకైతే సహస్రార నాడులు పులకిస్తాయి. అందువలన కర్మదోషాలు, జన్మదోషాలు తొలగిపోతాయి. నిరంతర సహస్రారనాడుల స్పందన పొందేవారి అజ్ఞానం తొలగిపోతుంది. ఆ తరువాతి స్థితిలో మానవ జనన మరణాల రహస్యము, సృష్టి యొక్క రహస్యాలు తెలుస్తాయి. పవిత్ర ఆనందానికే ఈ ఫలితాలొస్తాయి. అపవిత్రత ఆత్మ జ్ఞానానికి అవరోధం అవుతుంది”.
“షిరిడిసాయినాథుని సేవలో నిజంగా లీనమై సేవచేసే వారికి కలిగే ఆనందానికి అంతువుండదు. ఈ ఆనందానుభూతి నిజభక్తులకే అనుభవం అవుతుంది. మిగిలిన వారికి భౌతిక లాభ సుఖాదులు తప్ప, సాయిభక్తిలోని ఆనందాన్ని రుచిచూసి తెలుసుకోగల శక్తి రాదు. ఆ శక్తి పవిత్ర, పరిపూర్ణ, సర్వస్వ శరణాగతులకే తెలుస్తుంది”.