మహల్సాపతి(రెండవ భాగం )
సాయిబాబాకు సన్నిహిత సేవకులలో మొదటివాడు మహల్సాపతి. సదాచార సంపన్నుడైన యితడు స్వర్ణకారుడు. ఆధునిక సంస్కృతి కొంచెం కూడా సోకని యితడు తన వంశాచారాన్ననుసరించి ‘మహల్సాపతి పురాణం’ పారాయణ చేసేవాడు. వంశ పారంపర్యంగా వస్తున్న మహల్సాపతి పూజయే ఇంట్లోను, శిరిడీ గ్రామంలోని ఖండోబా మందిరంలోనూ శ్రద్దగా చేస్తుండేవాడు. ప్రతి సంవత్సరము జజూరీలో జరిగే తిరునాళ్ళకు యితడు ఖండోబా పల్లకి తీసుకుని 150 మైళ్ళు నడిచి వెళ్ళేవాడు. ఇతనికప్పుడప్పుడు ఖండోబా దేవుడు ఆవేశించేవాడని ప్రతీతి.
మహల్సాపతికి శిరిడీ గ్రామంలో ఒక మట్టి యిల్లున్నది. ఏమీ పండని భూమి 7 1/2 ఎకరా వుండేది. అతడు జీవనంకోసం వంశవృత్తి చేసేవాడు. అంత కష్ట జీవితంలోనూ వీలైనంత సమయం సాధు సాంగత్యంలో గడిపేవాడు. చూడటానికి విద్యా సంస్కారాలు లేనట్లు కన్పించినా యితడెంతో లోచూపు కలవాడు. సామాన్యంగా సాంప్రదాయకులకుండే మత సంకుచితమే లేనివాడు. కాశీరాం షింపీ, అప్పాభిల్ లతో కలిసి ఇతడు శిరిడీ వచ్చివున్న దేవీదాసు, జానకీదాసులను, దేశసంచారం చేసే ఫకీర్లను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేవాడు. ఆ యిద్దరూ ఆర్థిక స్తోమతు కలవారు గనుక సాధుసత్పురుషులకు ఉదారంగా అవసర వస్తువులు, దక్షిణ సమర్పించేవారు; పేదవాడైన మహల్సాపతి పరిచర్య చేసేవాడు. ఎన్నో జన్మల పుణ్యం వలన అతడికి జన్మలో శ్రీ సాయిబాబా సేవ సుమారు 5 దశాబ్దాలకు పైగా లభించింది. ఇతనికి బాబాపట్లగల భక్తి విశేషమైనది. ఇతరులు సాయిలీలలు చూచాకనే ఆయనను భక్తితో ఆశ్రయించగల్గారు. కానీ బయాజామాయిలా ఇతను మాత్రం సాయిని దర్శించిన క్షణంనుండే వారి దైవత్వాన్ని గుర్తించి సేవకు అంకితమయ్యాడు. అలా విశ్వసించగలిన వారే నిజమైన భక్తులు. అందులో గూడ శిరిడీలో సాయి ప్రకటమైన కొత్తల్లో బాబా ప్రవర్తన వింతగా వుండేది. ఆయనను చూచి అందరూ పిచ్చివాడనుకొనేవారు. కారణం ఆయన అప్పుడప్పుడు నిష్కారణంగా కోపించడం, తమలో తాము గొణుక్కుంటూ చిత్రమైన భంగిమలు చేస్తుండటం ఎదుట ఎవరూ లేకున్నా తిడుతూండడం వలన అందరూ అలా అనుకుంటుండేవారు. కాని ఈ పిచ్చివాలకం మాటున సాయిలో దాగియున్న దివ్యత్వాన్ని గుర్తించినది. యితడొక్కడే. బాబా రెండవసారి పెళ్ళివారితో శిరిడీ చేరినపుడు ఆయనను ‘యా సాయి’ – ‘రండి, సాయి!’ అని ఆహ్వానించి ఆ సాటిలేని సద్గురుమూర్తికి ఆ దివ్యనామమిచ్చి మానవ కల్యాణానికి మాయని మార్గం వేశాడు.
బాబాలోని పూర్ణ వైరాగ్యం వంటి శుద్ద సాత్వికమైన లక్షణాలు మహల్సాపతిని ఆకట్టుకొన్నాయి. మొట్టమొదటిసారిగా ఇతడే ఒకరోజున మశీదుకు వెళ్ళి బాబా పాదాల పై పువ్వులు వేసి వారిపాదాలకు, మెడకూ చందనమద్ది నైవేద్యంగా పాలు సమర్పించాడు. ఆరోజులలో సాయి ఎవరినీ అలా చేయనిచ్చేవారు కాదు. ఇతడిలా చేసినపుడు మాత్రం ఆయన ఉపేక్షించారు. అంతకు ముందు నాసాసాహెబ్ డెంగళీవంటి ఆప్రాంతపు ప్రముఖులు అలా పూజించబోతే, ‘ద్వారకామాయిలోని స్తంభాన్ని పూజించుకోండి’ అనేవారు. అయితే వారలా ఎన్నడూ చేయలేదు.
మశీదులో హిందూ పద్ధతిన భక్తులు పూజించడం కొందరు ముస్లింలకు పెద్ద అపచారమనిపించింది. దీనికంతటికీ మూలం మహల్సాపతి. మొదట్లో తమను పూజించడానికి అతని ఒక్కరికీ సాయి అనుమతిచ్చారు. ఆరోజుల్లో ఎలాగైనా అతనిని మశీదు ప్రవేశించనివ్వగూడదని నిశ్చయించుకొని కర్రలు చేతబట్టుకొని మసీదు ముంగిట ముస్లింలు కాపలా నిల్చారు. ఇంతలో మహల్సాపతి వస్తే అతనిని గేటువద్దనే నిలిపివేశారు. అతడు భయపడి మశీదు గేటుదగ్గర నిలిచి సాయిని అక్కడనుండే పూజించనారంభించాడు. సాయి అతనికేసి చూచి కోపావేశంలో, ” నీవు వచ్చి నాకు చందనమద్ది పూజించుకో! నిన్నెవడడ్డగిస్తాడో చూస్తాను” అని కేకలేసారు. అంతటితో ఆ ముస్లింలు భయపడి పారిపోయారు. నాటినుండి మహల్సాపతి యథేచ్ఛగా మశీదుకు వచ్చి సాయిని పూజించుకోసాగాడు.
ఆ తర్వాత నీమ్గావ్ కు చెందిన డెంగళే కూడా ఆయనను పూజించాలనుకున్నాడు. కాని బాబా అంగీకరించలేదు. ఆరోజులలో దగ్గూభాయి అనేవాడు ఎప్పుడూ సాయిని అంటి పెట్టుకొని వుండేవాడు. ఒకరోజు అతడెలాగో బాబాకు నచ్చజెప్పి ఒప్పించాక డెంగళే గూడ ఆయనను పూజించుకున్నాడు. క్రమంగా ఇతరులు పూజిస్తున్నా బాబా అభ్యంతరం చెప్పడం మానేశారు. ఆవిధంగా సాయిని పూజించటం అందరికీ పరిపాటి అయింది. ఈనాడు ప్రపంచమంతటా భక్తులు సాయిని పూజించుకోడానికి అంకురార్పణ చేసిన అదృష్టం మహల్సాపతికే దక్కింది.
ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. సుమారు 1880 ప్రాంతంలో ఆ ఒక్క వంశోద్దారకుడు మరణించడంతో మహల్సాపతికి మనసు విరిగిపోయింది. అతనికిగల భూమి పై ఒక్క పైసాగూడా రాబడి వుండేదికాదు. వంశవృత్తి వలన వచ్చేది జీవనానికి చాలేదుకాదు. ఎప్పుడు తన యిష్టదైవము అనుమతిస్తాడా, ఎప్పుడు సన్యసిద్దామా అని మహల్సాపతి ఎదురు చూచేవాడు. కాని ఒకప్పుడు ఖండోబా ఇతనికి దర్శనమిచ్చి ఆ గ్రామంలోని ఖండోబా మందిరంలోని విగ్రహాలను తెచ్చుకొని పూజించుకొమ్మని ఆదేశించాడు. ఇంకొకసారి అతడికి కలలో ఒక వృద్ద బ్రాహ్మణుడు దర్శనమిచ్చి, ‘ ఏమిటి స్వర్ణకారవృత్తి చేయకుండా భుక్తి సంపాదించుకోలేవూ?” అని మందలించారు. భుక్తి సంపాయించుకోగలనని అతడు చెప్పగానే ఆ స్వామి, “నా పాదాల నాశ్రయించు” అని చెప్పారు. నాటినుండీ తన సంసార భారమంతా ఆ దేవుని పైవేసి, భిక్ష చేసుకొని భార్యాబిడ్డలను బ్రతికించుకోసాగాడు. ఇంట్లో నిద్రిస్తే మనోవికారం కల్గి సంసారభారం పెరగగలదని తలచి మహల్సాపతి తన సమయమంతా సాయి సేవలో గడపసాగాడు. రాత్రి సమయాలలో గూడా సాయిబాబా చెంతనే ఒక రాత్రి మశీదులోను, ఒక రాత్రి చావడిలోనూ, నిద్రపోయేవాడు. సుమారు 1889లో ఒకరోజు సాయి అతనితో, ”అరే భగత్, యీ ఫకీరు మాటలెన్నటికీ వ్యర్థం కావు. విను. నీవు రోజూ నీ యింట్లో కాకుండా యిక్కడే పడుకుంటున్నావు. నీకున్నది కుమార్తెలే గదా! కుమార్తెలు చింతకాయల వంటివాళ్ళు; కుమారుడో, మామిడిపండు వంటివాడు. నీవికనుండి ఇంటివద్ద నిద్రిస్తే నీకు తప్పకు కొడుకు పుడతాడు” అన్నారు. కాని ఆయన ఎంత వత్తిడి చేసినా అతడు వినలేదు. ఒకసారి సాయి చికాకుపడి కాశీరాంతో, ” వీణ్ణి యింటిలో పెట్టి తలుపు గొళ్ళెం పెట్టు” అన్నారు. కాశీరాం అలాగే చేశాడు. మహల్సాపతి 1896లో కృష్ణాష్టమినుండీ తన యింటివద్దనే నిద్రించసాగాడు. సరిగా సాయి చెప్పినట్లే మరుసటి జన్మాష్టమికి, అంటే 1897 లో ఒక ఆదివారం నాడు అతనికొక కొడుకు పుట్టాడు. అతనికి మార్తాండ్ అని పేరు పెట్టాడు.