మహాల్సాపతి కి బాబా తో గల సాన్నిహిత్యం !

ఆ వెంటనే మహల్సాపతి అంతకు ముందులా బాబా సన్నిధిలో నిద్రించసాగాడు. ప్రతి రాత్రి అక్కడకు చేరి తనవద్దనున్న గుడ్డ నేల పై పరచేవారు. దాని మీదనే ఒక ప్రక్కన సాయి, మరొకప్రక్కన అతడు పడుకునేవారు. అతడికి నిద్ర తూగిన మరుక్షణమే సాయి, ”భగత్, నీవు నిద్రపోవద్దు. లేచి కూర్చుని నీ చేయి నా గుండె పై వుంచు. నేను అల్లాహ్ నామస్మరణ చేస్తుంటాను. నేనలా స్మరణ చేస్తున్నదీ లేనిదీ నా గుండె స్పందన వలన నీకు తెలుస్తుంది. అదెప్పుడైనా తొలిగి నా గుండె స్పందన మారితే నన్ను వెంటనే నిద్రలేపాలి” అన్నారు. అలా ఏనాడూ బాబా హృదయంలో నామస్మరణ ఆగినదీ లేదు; అతడాయనను నిద్రలేపినదీ లేదు. ఇలా ఆ ఇద్దరూ రాత్రి తెల్లవార్లూ. మెలుకువగా వుండేవారు. రాత్రి ఎప్పుడైనా అతడు మశీదునుండి బయటకు వెళ్ళబోతే సాయి, “నువ్విక్కడ నుండి వెళ్ళవద్దు. వెళితే చచ్చిపోతావ్ జాగ్రత్త!” అనేవారు. ఇలా మహల్సాపతికి ఎన్నో సం.లు ఆ సన్నిధిలో తపస్సు కొనసాగింది.

ఎన్నోసార్లు అతడికీ, కుటుంబానికి రెండు వారాల వరకూ తినడానికేమీ లభించక ఇంట్లో అందరూ పస్తులుండేవారు. ఎవరైనా భక్తులు అన్నవస్త్రాలు సమర్పించినా అతడు స్వీకరించేవాడు గాదు. అది తన తపస్సుకు విఘ్నకరమని నమ్మేవాడు. తన సమయమంతా పవిత్ర గ్రంధాలు చదవడంలో గడి పేవాడు. ఆ విషయంలో అతడితో అతని కుటుంబం కూడా సహకరించడం ఆశ్చర్యం! బాబా కూడా ఎన్నోసార్లు అతడికి డబ్బివ్వాలని చూచారు. 1880 సం. తర్వాత బాబాకెంతో అధికంగా దక్షిణలు రాసాగాయి. ఆయన ప్రతిరోజూ ఒక్కొక్క భక్తుడికి రు.35/-లు, రు.15/-లు, రు.10/-లు ఇలా యిచ్చేస్తుండేవారు. మహల్సాపతికి గూడ రు.3/-లు యిచ్చి, ”రోజూ నేనిచ్చేది తీసుకొంటుండు. నిన్నొక శ్రీమంతుణ్ణి చేస్తాను. అందరూ నిన్నాశ్రయించి, నీ మంచికోరి సేవిస్తారు” అనేవారు. అతడు, “నాకదంతా వద్దు, నాకు మీ పాద సేవ మాత్రమేకావాలి” అన్నాడు. అతడికి సిరి సంపదలకంటే వైరాగ్యము, అపరిగ్రహము, తృప్తి  యివే శ్రేష్టమన్పించేవి. అతడెన్నడూ మంచంమీద పడుకునేవాడు గాదు.ఇది మర్తాండ్ మహరాజ్ (మహల్సాపతి కుమారుడు) స్వయంగా చెప్పారు.

ఇతనికి, బాబాకు గల సన్నిహితం ఒక్క విషయంలో తెలుస్తుంది. సం. 1886లో ఒకరోజు బాబా అతనితో, “అరే భగత్ ! నేను అల్లాహ్ వద్దకు వెళ్తున్నాను . నీవీ దేహాన్ని మూడురోజులు కాపాడుకో. నేనటు తర్వాత విరిగి రాకుంటే దీనిని ఆ వేపచెట్టు దగ్గర సమాధి చెయ్యి” అని చెప్పి, అతడి తొడపై తలవుంచి శరీరం విడిచి పెట్టారు. ఆ మూడు రోజులు అతడు నిద్రాహారాలు మాని అలానే కూర్చున్నాడు. గ్రామకరణం, మునసబు మొ.న వారు మశీదుకొచ్చి వైద్యునిచేత బాబా దేహాన్ని పరీక్ష చేయించి ఆయన చనిపోయారని ప్రకటించారు. ఆ దేహాన్ని సాధ్యమయినంత త్వరగా సమాధి చేయాలని ఎందరెంతగా చెప్పినా మహల్సాపతి తన పట్టు విడవక, మూడు రోజులు దానిని కాపాడుతూ వచ్చాడు. అటు తర్వాత బాబా తిరిగి శరీరం ధరించి 32 సంలు తమ అవతార కార్యం కొనసాగించారు. అంతటి బాధ్యతతో గూడిన పని సాయి అతనికే వప్పగించారు. ముఖ్యమైన ఆ మూడు రోజులలో ఆతడి విశ్వాసము, ఓరిమి సడలివుంటే ఏమయ్యేదో!

ఇంతగా తననంటి పెట్టుకొని నిరంతరం సేవచేస్తున్న మహల్సాపతిపట్ల బాబాకు ప్రత్యేకమైన ప్రీతి వుండేది. ఆయన యింకెవరు చెప్పినా విన్పించుకోలేని సందర్భాలలో గూడ మహల్సాపతి ఆయనకు నచ్చజెప్పి ఏ శుభకార్యానికైనా ఆయనను ఒప్పించగల్గేవాడు. ఉదాహరణకు, భక్తులు సాయికి నివాసమైన మశీదుకు మరమ్మత్తులు చేస్తామంటే సాయి సుతరామూ ఒప్పుకోలేదు. అప్పుడు మహల్సాపతి ఆయన కెన్నో రీతుల చెప్పి ఒప్పించగల్గాడు. నేడు ద్వారకామాయి యింత చక్కగా వున్నదంటే అందుకు ప్రధానకారకుడు యితడే.

అలానే ఎందరు భక్తులు సాయిని దర్శించి పూజిస్తున్నా, ఆయనమాత్రం తమ సహజరీతిన అపుడప్పుడు నిష్కారణంగా కోపించి కేకలేస్తుండేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులను కొట్టేవారు: మరొకప్పుడు గ్రామంలోని వర్తకులు, నూనె వ్యాపారులు తమ నెంతగానో బాధించారని చెప్పి శిరిడీ విడిచి వెళ్ళిపోతానని, కోపంగా బయల్దేరేవారు. ఒకసారి ఆయన అలానే కోపగించుకొని ఎవరికీ చెప్పకుండా ఎక్కడకో వెళ్ళిపోయారు. సాయి శిరిడీలో కన్పించడంలేదని భక్తులందరూ ఆందోళనగా చెప్పుకోసాగారు. ఆ వార్త ఖండోబా ఆలయంలో పూజ చేసుకుంటున్న మహల్సాపతికి చేరింది. అతడు వెంటనే వచ్చి గ్రామంలో విచారించగా, సాయి రహటాకుగాని, నీమ్గాఁవ్ కు గాని వెళ్ళలేదని, ఆయన గ్రామం విడిచి వెళ్ళేముందు తీవ్రమైన కోపావేశంలో వున్నారనీ కొందరు గ్రామస్థులు చెప్పారు. ఆయన లెండీనుండి నీమ్గాఁవ్ వైపుకు బయల్దేరడం మాత్రం చూచామని ఎవరో చెప్పారు. వెంటనే అతడికి ఆయన శిరిడీలో మొదటిసారి ప్రకటమైన కొద్ది కాలానికి ఎవరికీ తెలియకుండా ఎక్కడకో వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. ఈసారి ఆయన మళ్ళీ తిరిగి శిరిడీ వస్తారో లేదోనని భయమేసింది. అట్టి ఆలోచన కల్గగానే అతడి కాలు, మనసు నిలువలేదు. సాయిలేని ఆ గ్రామంలో జీవించడం అతడికి అసాధ్యమనిపించింది. వెంటనే అతడు ఆ రోడ్డుమీద ఉత్తరంగా కొద్ది దూరంగా వెళ్ళి, అక్కడ ఎదురైన వారిని విచారించాడు. నీమ్గాఁవ్ రోడ్డు మీదనుంచి తూర్పుగా రూయి గ్రామం నడిచి అక్కడొక పొలంలో పనిచేసుకునే వాణ్ణి విచారించగా, సాయి రూయీ గ్రామం మీదగా వెళ్ళారని చెప్పారు. వారాయనను పలకరించినపుడు ఆయన పట్టరాని కోపంతో శిరిడీ గ్రామస్థులను తిట్టి బోసారనీ, తిరిగి ఆ గ్రామానికి రాబోనని అన్నారనీ చెప్పారు. ఆ సంగతి వినగానే మహల్సాపతి మెదడులో ఆశాజ్యోతి పొడజూపింది. అతడు తిరిగి వెంటనే యిల్లు చేరి, తాను రూయీ గ్రామంలో సాయి చెంతకు వెళ్తున్నానని, ఆయన తిరిగి రాకుంటే తాను గూడ రానని తన భార్యకు చెప్పి వెంటనే బయల్దేరాడు. నాటివరకూ శిరిడీకి పట్టిన మహాభాగ్యం విడిచి పెట్టిందేమోనని భయపడ్డాడు. అయితేనేమి? తాను మాత్రం ఆ మహాత్ముని సేవ, సాన్నిధ్యాలు ఎట్టి పరిస్థితులలోను వదలుకోదల్చుకోలేదు.

అతడు రూయి చేరేసరికి ఆ గ్రామ ప్రవేశంలోనే వున్న మారుతి ఆలయంలో ఒక చెట్టుక్రింద సాయి కూర్చొని కనిపించారు. అతనిని చూస్తూనే ఉగ్రులై, తమ చెంతకు రావద్దని, తిరిగి పొమ్మనీ కేకలేసారు. అతడు నడక వేగం తగ్గించి ఆయనను సమీపించ యత్నిస్తుంటే అతని పై రాళ్ళు రువ్వసాగారు. చివరకు అతడు, ”ఎన్నటికైనా నేను మీ భగత్ నే, మీరు నన్ను చంపినా సరే, మీ సన్నిధి విడిచి పెట్టను. శిరిడీలో మిమ్ము తిట్టిన వారిని నేను దండిస్తాను. మీకు శిరిడీ రాకపోవడం యిష్టం లేకపోతే నేను మీ దగ్గరుండిపోతాను, నేనూ యిక్కడే వుంటాను. మిమ్మల్ని విడిచిపోను. ఆ విషయం యింట్లో వారికి గూడా చెప్పి వచ్చాను!” అన్నాడు. అతని పట్టుదల చూచి సాయి రాళ్ళు రువ్వడం మాని వేసారు గాని, అతనిని తన పాదాలనంటనివ్వలేదు. ”నేనిక ఆ గ్రామానికి రాను. మేము ఫకీర్లం, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీవు సంసారివి. నీవు ఇల్లు విడిచి మావెంట రాగూడదు. నీవు తిరిగి యింటికి వెళ్ళు” అని నచ్చచెప్పారు. వారి కంఠంలో ధ్వనించిన నిశ్చయం చూచి మహల్సాపతి నివ్వెరబోయాడు. చివరికి ఆయన తనతోగూడ శిరిడీకి రాకపోతే అన్నము, నీళ్ళు ముట్టుకోనని ఆయన చెంతనే కూర్చున్నాడు. ఆయన తిరిగి అతనిని తిట్టిపోసారు. నచ్చచెప్పారు. కనీసం రూయీ గ్రామంలోకి వెళ్ళయినా భోజనం చేయమని చెప్పారు. వీరిద్దరిమధ్య సాయంత్రం వరకూ యిదే నాటకం కొనసాగింది. చివరికి భక్తుడిమాట నెగ్గింది. ఆ యిద్దరూ తిరిగి శిరిడీ చేరారు. మనందరికీ సాయి తిరిగి లభించారు. మనందరికీ శిరిడీ దర్శనం ప్రాప్తిస్తుందంటే అది మహల్సాపతి చలువే.

ఒకరోజు రాత్రి మశీదులో వారిద్దరూ పడుకోడానికి అతడు గుడ్డ పరవగానే బాబా, ”ఈరోజు యిద్దరమూ మెలకువగా వుందాము. క్రూరుడైన ఆ రోహిల్లా (మృత్యుదేవత) నిగోజ్ పాటిల్ భార్యను తీసుకుపోవాలని చూస్తున్నాడు. ఆమెను రక్షించమని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. అంతరాయం కల్గకుండా చూడు!” అన్నారు. తర్వాత మహల్సాపతి అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. అర్థరాత్రి నెవాసానుండి ఆ గ్రామ మమల్తదారు, అతని పరివారము శిరిడీ చేరారు. అదేమి చిత్రమో, అంతటి అర్థరాత్రి సమయంలో అతడు బాబాను దర్శించాలని తన జవానును మశీదుకు పంపాడు. ఆ జవాను తన అధికారమంతటితోనూ అచటికి వచ్చి, మహల్సాపతి ఎంత చెప్పినా వినకుండా తమకప్పుడే దర్శనము, ఊదీ కావాలని పొగరుగా కేకలు వేస్తున్నాడు. ఇక గత్యంతరం లేక అతడికి ఊదీ యిచ్చి పంపివేయాలనుకున్నాడు మహల్సాపతి. కాని అప్పటికే ఆ గోలకు మహల్సాపతి మశీదులోకి నడచిన సవ్వడికి బాబాకు అంతరాయం కలిగింది. ఆయన కోపంతో పెద్దగా తిట్టి అతడు పరచిన దుప్పటి నేల పై నుండి లాగి అతడి మీదకు విసిరి, ”అరే భగత్, నీకూ పెళ్ళాం పిల్లలున్నారుగదా, నిగోజ్ పాటిల్ యింట ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? ఈ అంతరాయమువలన అతని భార్య మరణించింది!” అన్నారు. మహల్సాపతి కృంగిపోయాడు. మరుక్షణమే ఆయన శాంతించి, ‘సరే, జరిగిందేదో మంచికే జరిగింది. ఆమె మరణించింది!” అన్నారు.

అంతటి కీలక సమయం లో బాబా మహల్సాపతి ని కాపలా గా ఉన్చుకున్నాడంటే, వారికీ మహాల్సాపతి పై నమ్మకము, సన్నిహిత్యము ఏపాటిదో మనకి తెలుస్తోంది ..

జై సాయిరాం !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close