“ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి “
శ్రీ సాయి నాధాయ నమః !
సాయి స్మరణ ఇహ పరములని సాధించేలా చేయగలదు. భవ తారకమయి సాయిదేవుణ్ణి చేర్చే నావ వంటిది సాయి నామ స్మరణ . సాయి స్మరణ సంజీవనిలా మనలని కాపాడుతూ, కల్పతరువయ్యి మన కోరికలను తీర్చే సర్వ సమర్ధత కలది .సాయి నామ మహిమ మనము సంపూర్ణము గా వర్ణించలేము..ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది . ఆ మధుర నామం గ్రోలుతూ వున్నా తనివి తీరనిది .
సాయి ఈ మధ్య ఒక కల ద్వారా తన నామ మహిమ మరోసారి నిరూపించడం జరిగింది .ఆ అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను .
మేము సాయిమందిర నిర్మాణం కోసం సుమారు మూడు సంవత్సరాలుగా తగిన స్థలం కోసం ప్రయత్నించగా , ఎక్కడ కూడా కుదరలేదు . కొన్ని ప్రయత్నాలు చివరివరకు వచ్చినా సఫలం కాలేదు . సాయి సేవ కి నేను అర్హురాలిని కానేమో అని చాల బాధ కలిగింది . చివరికి సాయినాధుని ప్రేరణ , అనుగ్రహం తో నా ప్లాట్ లో ఇంటి నిర్మాణము కి కొంత స్థలము పోగా మిగిలిన స్థలము లోనే ఒక చిన్న సాయి మందిరము నిర్మించుకోవాలని డిసెంబర్ లో ప్లాన్ వేయించాము . అక్కడ కూడా కొన్ని అభ్యంతరాలు మా కుటుంబ సభ్యుల నుండి వచ్చినా , సాయి దయ తో వారు అంగీకరించడము ,నిర్మాణం కయి ప్లాన్ వేయించడం జరిగింది .శంకుస్థాపన జరిగింది , బోర్ వేసాము కానీ మా ప్లాట్ ఒక గ్రామ శివారు లో ఉండడం వళ్ళ కరెంటు సప్లై , దానికి పర్మిషన్ సమస్యలు యిలా కొన్ని సమస్యలు ఒక్కోటి గా రాసాగాయి .అతి కష్టంపయి చాల డబ్బులు వెచ్చిస్తే, అపుడు కరెంటు సమస్య తీరింది . అయినా మళ్ళీ యేవో సమస్యలు . నాకేం చేయాలో అర్థం కాక బాబా తో, “బాబా గుడి నిర్మాణం ఎలా ?” అని మనసులో వేడుకునే దాన్ని …ఒక రోజు రాత్రి ఒక కల .. కొంచం ఎత్తయిన ప్రదేశం లో చాల మంది వరుసల్లో కూర్చున్నారు . నేను ముందు వరుసలో కూర్చున్నాను . మా ఎదురు గా, గురుగారు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారు ఒక ఆసనం పై కూర్చున్నారు . నేను వారిని చూస్తున్నాను . అంతలోనే వారి స్థానం లో సాయి నాధుడు కాలు పై కాలు వేసుకుని కూర్చుని కనిపించారు . క్రింద ఉన్న వారి పాదం దగ్గర ఒక చిన్న బాలుడు ఒక చిన్న రాతి పై కాలు పై కాలు వేసుకుని కూర్చున్నాడు . నేను సాయి పాదం పై నా తల ఉంచి, “బాబా, గుడి ఎలా ?” అని అడగ్గానే,.. సాయి ,“ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి “ అని అన్నారు , సాయి పెదవుల కదలిక స్పష్టంగా కనిపించింది ..ఇది కల ..(ఆర్ధిక వనరుల కొరత కారణం గా , మందిరం లో విగ్రహ ప్రతిష్ట కోసం ఒక చిన్న పాలరాతి విగ్రహం సుమారు అడుగున్నరది ప్రతిష్టింప చేసి ,ఆ విగ్రహం వెనకాల తక్కువ కాస్ట్ ఉన్న వేరే మెటీరియల్ తో చేసిన పెద్ద విగ్రహం భక్తుల దర్శనం కోసం పెట్టాలని మనసు లో ప్లాన్ వేసుకున్నాను .సరిగ్గా అనుకున్నట్లు గానే కల లో బాబా ముందు బాబా పాదాల దగ్గర ఒక చాల చిన్న పిల్లవాడు కాలు పై కాలు వేసుకుని కూర్చుని కనిపించడం విశేషం !!)
కానీ నేను ఈ కల ని అజ్ఞానం తో అంతగా పట్టించుకోలేక పోయాను .బాబా ఇచ్చిన ఈ ఖచ్చితమయిన సందేశం బాబా ఇచ్చిన సలహా గా అనిపించినా దాన్ని సరిగ్గా నెరవేర్చలేక పోయాను .
పునాదులు తవ్వడం ప్రారంభించిన రోజు నుండి, నిర్మాణ ప్రదేశం కి వెళ్లి కేవలం అర్ధ గంట మాత్రమే నామం చెప్పి వచ్చేసేదాన్ని.మధ్యలో ఏరోజయినా కుదరక పోతే మానేసేదాన్ని. ఆలా ఒక నెల చేసి బాబా నామ స్మరణ ని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేస్తున్న టైం లోనే సమస్యలు మళ్ళీ మొదలయ్యాయి .పక్క ప్లాట్ వాళ్ళు కాంపౌండ్ వాల్ ప్లాన్ విషయం లో గొడవలు , ఆ ప్లాట్ ఉన్న ఏరియా లోనే, ట్రాన్స్ఫార్మర్ లో ఏదో ప్రాబ్లెమ్ వచ్చి కరెంటు వోల్టేజి లో తేడాల వళ్ళ బోరు మోటార్ కాలిపోయి పనులు ఆగిపోయాయి ..మళ్ళీ కొత్త మోటార్ వేసినా నీళ్లు సరిగ్గా రాకపోవడం యిలా సమస్యలతో ఊపిరాడని స్థితి కల్గిన సమయం లో చాలా వేదన పడ్డాను , సాయి ని మళ్ళీ మనస్పూర్తి గా, “ఈ సమస్యలేంటి బాబా? ” అని ప్రశ్నించగా,.. అదే రోజు saimaharajsannidhi fb పేజీ లో “నామస్మరణ -ప్రాణ రక్షణ” అనే శీర్షిక లో(మార్చ్ 27 ) ,ఒక భక్తుడి హార్ట్ ఆపరేషన్ బాబా నామ స్మరణ తో సక్సెస్ అయిన విషయం మరియు సాయి నామ స్మరణ తో ఆ భక్తుడు ఏ పని నయినా దిగ్విజయం గా పూర్తి చేసుకోగలిగారు అనే విషయం బాబా నాచే చదివేలా చేసి, నాకు కల లో యిచ్చిన ” సాయి నామ స్మరణ” సందేశం మరలా గుర్తు చేశారు. (అదే పేజీ లో మార్చ్ 26 నాడు ప్రచురించబడిన “సాయిబాబా నామమే నన్ను కాపాడింది ” లీల కూడా చదవడం జరిగింది) . ఆ తరువాత నుండి నేను క్రమం తప్పకుండా భక్తి గా ప్లాట్ వద్ద సాయి నామ స్మరణ మళ్ళీ ప్రారంభించాను . ప్రారంభించిన మరుసటి రోజే ఎన్ని సార్లు పిలిచినా దాటి వేస్తున్న ఆ ఏరియా లైన్ మాన్ తనంతట తానే వచ్చి ఆ కరెంటు సమస్య ని పరిష్కరించడం , మోటార్ బాగు అవడం , నీళ్లు ధారాళం గా రావడం ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి . సాయినాధుని అనుగ్రహం తో పనులు వేగవంతం అవుతున్నాయి .
సాయి నామ స్మరణ ఏ పని కి అయినా అడ్డు వచ్ఛే దోషాలను అన్నింటినీ తొలగించి ఆ పని ని సక్రమంగా దిగ్విజయం గా పూర్తి చేయించగలదు . సాయి నామ మహిమ అనంతం ..సాయి బంధువులారా ! మన జీవితం లో అడుగడుగునా సాయి ఉండి మనలని నడిపిస్తుంటాడు .ఏదో విధం గా తగు సలహాలు ఇస్తుంటాడు . మనము వాటిని గ్రహించి ఆ సలహాల ప్రకారం నడచుకుంటే , మనం సాయి నుండి పొందే ప్రయోజనం అనంతం గా ఉంటుంది.
జై సాయిరాం !
.