అమ్ముల (పూజ్య గురుదేవులు )బోధించిన సాధనా మార్గాలు-7
ఆధ్యాత్మిక శిఖరారోహణలో కోరికలను వదిలివేయ గలిగిన వారే శిఖరాగ్రానికి చేరగలరు
“సాయినాథుడు మన కోరికలను తీర్చుతూ మెల్లమెల్లగా మనలో మార్పు తీసుకువస్తాడు. ఈ ప్రపంచాన్నే ఒక ప్రయోగ శాలగా చేసి మానవ మనస్తత్వాలను అద్దంలోని బింబాల వలె చక్కగా అర్థం అయ్యేటట్లు చూపుతాడు షిరిడిసాయి దేముడు. ఇతరుల మీద క్రమంగా కోపము, ద్వేషము పోయి వారి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలనే ఒక జాలిగుణాన్ని క్రూరులు,దుర్మార్గులను గురించి కూడ మన మనసులలో నింపుతాడు. అతితెలివి గలవారు, స్వార్థపరులు, అవినీతి పరులందరు అజ్ఞానులుగానే కనబడుతున్నారు. అందువలన వారి మీద జాలి తప్ప కోపం రావటం లేదు. అందువలననే ప్రస్తుత నా సత్సంగాలన్నీ జ్ఞాన మార్గంలోనే సాయి దేముడు నడుపుతున్నారు అనే భావన ఈరోజు స్థిరపడినది. సాధకునిలోని అంతరాత్మకు సాయి నాథుని దివ్యశక్తికి మధ్యలో యింద్రియాలు వాటి కోరికలు చాలా అడ్డంగా వుంటాయి. విశ్వాత్మయైన పరమాత్మ షిరిడిసాయి దేముని నుంచి నిజ సాధకులను దూరం చేసేవి యింద్రియాలే. ఇంద్రియాలను అదుపులో వుంచి, ఆశలను తోలగించి సర్వవిధ కామకోరికలు వదిలిన వారికి షిరిడిసాయి తనలోనే అంతర్లీనమై వున్నాడని తెలుస్తుంది”.
“దాన ధర్మాలు, పరోపకారాల ద్వారా – పుణ్యాన్ని సంపాదించుకుంటాడు నిజభక్తుడు. ఆ స్థితిలోని పుణ్య బలమే జ్ఞానంగా మారుతుంది. స్వార్థ త్యాగం సాధించలేని వారంతా నిజ త్యాగులు కాలేరు”.. త్యాగం మనిషిని దేవునిగా చేస్తుంది. స్వార్థం మనిషిని ఎంత మంచి గుణాలున్నా మానవుడిగానే వుంచుతుంది. నిజంగా లోకాన్ని ఉద్ధరించాలన్నా, షిరిడిసాయి దేముని సేవలో తరించాలన్నా స్వార్థత్యాగం, సర్వస్వ త్యాగాలు ఎంత వరకు చేయగలిగితే అంత వరకే ఫలితాలు సాధించగలుగుతారు. కానీ దురదృష్టవశాత్తూ అందరూ సాయి నాథుడిని ప్రార్థించేది స్వార్థ కోరికలతోనే కదా!”
“ఆధ్యాత్మిక శిఖరారోహణలో సర్వ యింద్రియ కోరికలను యిష్ట పూర్వకంగా వదిలివేయ గలిగిన వారే శిఖరాగ్రానికి చేరగలరు. శరీరము, శరీర యింద్రియాలు కలిగించే మాయా రూప కోరికల బంధాలను ఛేదించుకోలేని వారు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు. స్త్రీ, పురుష సంబంధాన్ని పూర్తిగా జయించిన ఆత్మ సాధకులకు ప్రకృతిని జయించ గల సమర్థత వస్తుంది. గౌరవ అవమాన భావాలు, రుచి, చూచుట, వినుట,ధనకాంక్ష లాంటి ఒక్కొక్క కోరికను జయించిన వారికి ఒకొక శక్తి సిద్ధిస్తుంది. వీటినే అష్టసిద్దులు, నవనిధులు అని అంటారు. యోగసాధనలోని రహస్యాలన్నీ శరీర సహజత్వంలో నుంచి ఆత్మను ప్రత్యేకంగా గ్రహించగలగటమే. ఇందులోని భాగంగానే సాయిదేముడు మూడు రోజులు శరీరం నుంచి ప్రాణాన్ని వేరు చేసి శరీరం, ఆత్మ స్థితులను సమతుల్యంగా గ్రహించి వుంటారని అనిపిస్తూ వుంటుంది. శరీర భ్రాంతి పూర్తిగా నశించని వారికి ఆత్మజ్ఞానం సిద్ధించదు”.
“సర్వ జనుల ప్రయోజనం కోరుకునే వారు తన సర్వ కోరికలను వదలక తప్పదు, తప్పదు, తప్పదు, తన మనసులో నుంచి సర్వ శారీరక కోరికలు, భౌతిక లౌకిక కోరికలు, మమకారపు కోరికలు, సర్వము శూన్యం కానిదే ఆత్మశక్తి విజృంభించి లోకానికి మేలు చేసే సమర్థతను సాధించలేదు, అనే సత్యాన్ని షిరిడిసాయి దేముడు జీవిత అనుభవాల ద్వారా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చూపిస్తున్నాడు. ఇంత కంటే ఎక్కువ వివరాలు సామాన్యులకు అర్థమయ్యేటట్లు వ్రాయటం అసాధ్యమే. నిజసాధకులు త్యాగ మార్గంలో ముందుకు చాలా దూరం ప్రయాణిస్తే గాని అర్థం కాని విషయాలివి. స్వయం సాధనతో పాటు షిరిడిసాయి దేముని అపార కరుణాజ్ఞాన రసాస్వాదన కూడ అనుభవించనిదే ఈ సత్యాలు మనసుకు హత్తుకోలేవు”.
“శారీరక కోరికలు, ఇంద్రియాలు ఆశించే కోరికలు, ధన సంపదలపై కోరికలు, సామాజిక గౌరవ హోదాలు లాంటి సర్వ కోరికలు యిష్ట పూర్వకంగా వదలని వారికి పరోపకార శక్తి పెరగదు. సాయినాథుడు దేముడై సర్వ ప్రపంచాన్ని రక్షించ గలగటానికి మూలకారణం తన సర్వస్వాన్ని త్యాగం చేయటం“
Ur ,100% true.iam just know it
LikeLike
yes.. Our Guru’s teachings are so effective
LikeLike