అమ్ముల (పూజ్య గురుదేవులు )బోధించిన సాధనా మార్గాలు-8
జై సాయినాథాయ నమః !
“సహజంగా సాఫీగా సాగిపోయే జీవితంతో మనిషికి పెద్దగా జ్ఞానం రాదు. అవాంతరాలు, వడిదుడుకులు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడ గలగటమే మనిషికి ఒక ఆత్మబలం లాంటిది. అలాంటి బలాన్ని షిరిడిసాయి తనను నమ్ముకున్న వారందరికీ యిస్తాడని నా మనసుకు అనిపిస్తూ వుంటుంది. కష్టసుఖాలలో రాటుతేలని మనిషికి లోకజ్ఞానం రాదు. ధైర్య సాహసాలు పెరగవు. భయం తొలగదు. షిరిడి సాయిపై భక్తి కూడ స్థిరపడదు”.
“దృఢ మనస్కులే కష్టనష్టాలలో కూడ ప్రశాంతంగ వుండగలరు. అలాంటి వారే ఎలాంటి ప్రలోభాలకు లొంగక అవినీతి పద్దతులను ధైర్యంగా తమ వద్దకు రాకుండ తోసి వేయగలరు. దృఢమైన మనసే నిర్భయ జీవితాన్ని ప్రసాదిస్తుంది. క్రమశిక్షణ గల మనసే మనిషికి స్నేహితుడు. బలహీనమైన మనసును షిరిడిసాయి అనుభవాల ద్వారా బలపరుస్తూ వుంటాడు.”
“శారీరక మానసిక వైకల్యాలు మనిషిని నిరంతరం బాధిస్తూనే వుంటాయి. జీవిత అవరోధాలను దాటుకుంటూ వాటిని అధిగమించి ముందుకు సాగేవారే నిజమైన కర్మయోగులౌతారు. జీవన సమరంలో అలాంటి వారికి సహకరించుటే ఒక పుణ్యము. ఆత్మశక్తి ఆసరాతో, దివ్యశక్తికి ప్రతీకగ నిలుచువారే మార్గదర్శకులగుదురు. ప్రపంచపు పోటీ రంగం లో నెగ్గుకురాగలిగిన వారే సమాజానికి మార్గదర్శకులు కాగలరు. స్వార్థం మోహం వదిలినవారే పరోపకారానికి పనికి వస్తారు.
పవిత్ర స్వార్థరాహిత్యమే మనిషిలో గల అద్భుత ఆత్మశక్తి, ఈ విధమైన స్థిరచిత్తం మనిషి చేత అద్భుతాలు చేయిస్తుంది. చిత్త చాంచల్యం మనిషిని సత్కార్యాలను చేయనివ్వదు. అడ్డాలు ఆటంకాలనే మెట్లుగా చేసుకుని పైకి ఎక్కేవారే జీవన సాఫల్యం పొందగలరు. సకాలంలో ప్రతి పనిని పూర్తి చేయటం సాధకుల ప్రథమ కర్తవ్యం. కరుణ సమానత్వాలు మానవ జీవన సుగంధాలు. ఈ గుణాలు గుబాళించే వారి జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగ వుంటుంది. సోమరితనం కార్య సాధకులకు పరమ శత్రువు. కాల చక్రాన్ని వెనక్కు తిప్పటం ఎవరికీ సాధ్యపడదు. సత్యానికి వక్రభాష్యాలు పతనానికి పునాదులు. నిత్య సంతోషులే సమాజానికి మేలు చేయగలరు”.
“ప్రశాంతమైన మనసు ఇచ్చే సంతోషం ఆనందకరమైన స్థితి, విజయాన్ని పొందినప్పడు కూడ యివ్వలేదు. భౌతిక కోరికలు, శారీరక కోరికలు, ధనసంపదల విజయాలు చాలా తుచ్ఛమైన మురికి వాసనలలాంటివే. శాంతించిన మనసు ఇచ్చే ఆనందం చాలా మందికి తెలియదు. శాంతించిన మనసు అందించే ఆనందం పరమానందం, అదే దివ్యానందం. అందులోని రుచి అనుభవించిన వారికే తెలుస్తుంది. భౌతిక, సామాజిక, శారీరక, ధన సంబంధమైన సర్వ బంధాల నుంచి మనసు దూరమైతే గాని అలాంటి శరీరంలో గల మనసు శాంతించదు. అదే నిజమైన “సన్యాసము”. మనోసన్యాసమే మనిషికి మహోదయం. ప్రాపంచిక సర్వ విషయాలను త్యజించనిదే మనసుకు పరిపూర్ణ ఆనందం అనుభూతికి రాదు. సత్కార్య నిర్వహణ కూడ వదలనిదే సంపూర్ణ ఆనందానుభూతి కలగదు.”