సాయిబంధువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు .🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ రోజు , గురువు(సాయి ) పై మన భక్తి విశ్వాసాలను అంచనా వేసుకుని మనము ఏ స్థాయి లో ఉన్నామో , మన గురువు కి దగ్గరగా వున్నామా దూరము గ ఉన్నామో తెలుసుకుని , జన్మ జన్మ లకి గురు(సాయి ) సన్నిధి లో నే వుండే భాగ్యం ప్రసాదించమని సాయి ని వేడుకుందాము .గురు బోధల ఆచరణే మనల్ని గురువు కి దగ్గరగా చేస్తాయి . మన వ్యవహారము గురుబోధ లకి విరుద్ధమయినచో మనకి గురువు కానరానంత అంధకారం లో కి మనము నెట్టివేయబడుతాము.గురువే తన శిష్యుడు మేలిమి బంగారమో కాదో అని అన్ని విషయాల్లో ఎన్నో పరీక్షలు పెడుతుంటాడు .గురువు పై నమ్మకం భక్తి మనల్ని అన్ని పరీక్షల్లో విజయులను చేయగలదు .ఆధ్యాత్మిక జీవితం లో ఎన్నో అడ్డంకులు అడుగడుగునా వస్తుంటాయి . మనల్ని మన గురువు కు దూరం గా తీసుకెళ్లడానికి అనుక్షణం మాయ కాచుకుని కూర్చుంటుంది . అందుకే సాయి ఆధ్యాత్మికము పదునయిన కత్తి మీద నడక లాంటిది అని చెప్పారు . మనకు కావాల్సింది శ్రద్ధ విశ్వాసము అనే ఆయుధాలు . ఇవి తోడుంటే సాయి సన్నిధి మనకు ఎన్నడూ దూరం కాదు . విషయాన్ని మనం సర్వదా గుర్తుంచుకునేదము గాక. జై సాయినాథ ! జై గురుదేవ !
గురు పౌర్ణమి సందర్భము గా, మన పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ అమ్ముల సాంబశివ రావు గారికి సాయి పై తన భక్తి విశ్వాసాలను తెలిపే ఒక సాయి లీల ని తెలుసుకుని ఆనందిద్దాము.
గురుదేవులకి దైవంపై వారికున్న నమ్మకాన్ని తెలిపే చిన్న సంఘటన
ఉద్యోగరీత్యా సాంబశివరావుగారికి నిజామాబాద్ జిల్లా మంచిప్ప అనే గ్రామానికి బదిలీ అయింది. ఆ గ్రామంలో కుటుంబం వుండటానికి సరియైన అవకాశములు లేకపోవటం చేత, సాంబశివరావుగారు కుటుంబాన్ని నిజామాబాద్‌లో వుంచి రోజూ మంచిప్ప వెళ్ళి వచ్చేవారు. అక్కడకు దగ్గరలోనే రామడగు అన్న ఊరికి తాత్కాలికంగా కొన్ని రోజులు సాంబశివరావుగారిని మేనేజర్‌గా వేయటం జరిగినది. వీరు రోజూ నిజామాబాద్ నుండి అక్కడకు వెళ్ళి వస్తుండేవారు. సాంబశివరావుగారు అప్పటికే సాయినాధుని దరికిచేరి, వీలున్నప్పుడల్లా అనేక సాయి కార్యక్రమాలు నిర్వహిస్తూ వుండేవారు.
వీరు అక్కడ పనిచేస్తున్న కాలంలో నక్సలైట్లు ఈ బ్యాంక్ ను పేల్చి వేస్తామని నోటీసులు అంటించారు. ఆ ప్రాంతాలలో నక్సలైట్ల ప్రాబల్యం బాగా ఎక్కువ) ఈ నోటీసు చూసిన గ్రామ ప్రజలు, బ్యాంకు ఉద్యోగులూ అందరూ భయపడి బ్యాంకును కొన్ని రోజులు మూసివేస్తే మంచిది అని అనుకున్నారు. బ్యాంకు ఉద్యోగులైతే అందరూ రావటం మానివేశారు. ఈ విషయాన్ని బ్యాంకు హెడ్డాఫీసు వారికి తెలియచేస్తే, ఎట్టి పరిస్థితులలోను బ్యాంకు మూయరాదని, అవసరమైతే పోలీసు వారి సాయం తీసుకోమని ఆదేశాలు వచ్చాయి.
ఉద్యోగులు ఎవరూ బ్యాంకుకు వెళ్ళటానికి సాహసించటం లేదు. అప్పుడు సాంబశివరావుగారు తాను ఒక్కడినే వెళతానని, ఎవరి సహాయాన్ని అర్థించక రోజూ ఒక్కరే వెళ్ళి బ్యాంకు తీసేవారు. వీరిని చూసి కొంతమంది ఉద్యోగులు వచ్చేవారు. ఏ రోజుకారోజు వీరి విశేషాలు తెలుసుకుంటున్న హైదరాబాద్ హెడ్డాఫీసువారు, వీరు పోలీసు వారి సాయం తీసుకోకుండా ఒంటరిగా వెళుతున్నారన్న విషయం తెల్సుకొని, బ్యాంకువారే స్వయంగా నిజామాబాద్ ఎస్.పి. గారికి ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేసి సాంబశివరావుగారికి పోలీసు సాయం అందించవలసిందిగా కోరారు.
నాటినుండి కొన్నిరోజులు, రోజూ ఇద్దరు పోలీసుల సెక్యూరిటీతో సాంబశివ రావుగారు జీపులో బ్యాంకుకు వెళుతుండేవారు. ఇలా వీరు వెళుతున్నప్పుడు ఒకరోజు నక్సలైట్లు చేతిలో తుపాకులతో వీరి జీపును ఆపాలని అడ్డురావటం , మరల ఏ కారణంచేతనో అంతలోనే మనసు మార్చుకొని, జీపును ఆపకుండా ప్రక్కగా పొలాల్లోకి నడచుకుంటూ వెళ్ళిపోయారు. ఊరిలో పోలీసు శాఖకు చెందిన ఒక వ్యక్తిని దారుణంగా హింసించి చంపారు. ఈ వార్తవిని అందరూ హడలిపోయారు. ఇటు కుటుంబసభ్యులు , మిత్రులు, బ్యాంకు ఉద్యోగులు అందరూ సాంబశివరావుగారిని వెళ్ళవద్దని వత్తిడి చేయడం మొదలు పెట్టారు .
అపుడు వారు చెప్పిన మాటలు దైవం పై వారి విశ్వాసాన్ని వ్యక్త పరుస్తున్నాయి.
“దైవం మన నుండి కోరేది నమ్మకం మాత్రమే. నేను సాయినాధునికి సర్వస్య శరణాగతి చేశాను. నన్ను నడిపించే వాడు ఆయనే. ధర్మబద్దమైన నా కర్తవ్యాలను నేను నిర్వహిస్తాను. సర్వస్వ శరణాగతి చేసిన తరువాత సర్వం ఆయనే చు ఒకసారి నమ్మితే ఇక భయానికి తావులేదు. తప్పక ఆ సాయినాధుడు తనను నమ్మినవారిని కంటికి రెప్పవలే కాపాడుతారు. భయపడవలసిన పనిలేదు. ఒకవేళ ఖర్మ ప్రకారం జరుగవలసినది ఏదైనా వుంటే, దాని నుండి సాయి రక్షించక వదలి వేసినట్లైతే ఇక ఏ శక్తి మనను రక్షించలేదు. కనుక దైవానికి సర్వం సమర్పణ చేసి నిశ్చింతగా వుంటూ మన బాధ్యతలు మనం నిర్వర్తిద్దాం. సర్వస్య శరణాగతి అంటే సర్వం ఆయనకు అర్పించటం. ఏ ఒకదాన్నో మన కొరకు వుంచుకొని – ఇది నాది అని – దాని కొరకు పాకులాడటం – లేదా, నేను, నా శరీరం – అనుకుంటూ దానికై భయపడటమూ కాదు – తనువు, మనస్సు, ధనము సర్వం ఆయనకు అర్పణ చేయటం – ఏది వచ్చినా అది కష్టమైనా – సుఖమైనా ఆయన అందించినదిగా భావించి ఆనందంగా స్వీకరించటం – ఇదే నిజమైన శరణాగతి. ఒక్కసారి శరణాగతి చేసిన వారి జీవితంలో భయం అనే పదానికి తావు లేదు”…
… అని చెప్పి రోజూ బ్యాంకుకు వెళ్ళి వస్తుండేవారు. అదే రోజు రాత్రి కలలో సాయినాధుడు సాంబశివరావుగారిని తన ఒడిలో పడుకోబెట్టుకొని తలపై చేయి వేసి నిమురుతూ “నీకు నేనున్నాను. నీ సర్వం నేను చూసుకుంటాను.” అన్న అభయాన్ని అందించారు. ఆ బ్యాంకులో వీరు పనిచేసిన 15 రోజులలోను ఎటువంటి చెడు సంఘటన జరుగలేదు. ఆ గ్రామంలోనికి నక్సలైట్లు రోజూ వస్తున్నారన్న వార్తలు మాత్రం అందుతుండేవి. మరి ఏ కారణం చేతనో వారు బ్యాంకును మాత్రం ఏమీ చెయ్యలేదు. ఇది సాయినాధుని చల్లని కరుణాదృష్టికి నిదర్శనం కాక మరేమున్నది?
పూజ్యగురుదేవులు సాయినాధునికి సర్వస్య శరణాగతి చేసిన విధంగా మనము కూడా చేయగలిగే స్థితి ప్రసాదించమని, వారికి తన ఒడిలో చోటిచ్చిన విధంగానే మనకు కూడా చల్లని ఆ సాయి పాదాల చెంత స్థానం లభించాలని సాయి ని వేడుకుందాము.
With the blessings of SAI I could visit shakhapuram sai ashram and took our guruji’s darshan also. Thank you BABA 🙏🙏🙏🙏