శ్రీమతి ఖాపర్దే ఏటా కొన్ని నెలలు శిరిడీలో వుండి, నిత్యమూ భోజనం బాబాకు నివేదించేది. ఆమె అప్పుడప్పుడూ ఆయనను తన యింటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్దిరోజులాయన నవ్వి వూరుకున్నారు. రెండుసార్లు వస్తానన్నారు గానీ రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె వంటచేస్తూంటే ఒక కుక్క వాసనబట్టి యింట్లో జొరబడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టెతీసి దాని పై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే ” బాబా, “నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా?” అన్నారు. మొదట ఆమె నివ్వెరబోయింది గాని, తర్వాత వాస్తవం తెలుసుకున్నది.
ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీసమేతంగా శిరిడీలో కొద్దికాల మున్నాడు. బాబా కృపవలన వ్యాధి తగ్గిందిగాని, సాయి అతనిని పుల్ల పెరుగు సుతరామూ తినవద్దన్నారు. కాని అతడు మూర్థించి భార్యచేత రోజూ పాలు తోడు పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. అదేమి చిత్రమోగాని, రోజూ ఆ యిద్దరూ హారతికివెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు త్రాగిపోయేది. ఒకరోజతడు కోపంతో ఆరతికి గూడ వెళ్ళక, పొంచివుండి, పిల్లివచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా, “ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు. కాని రోజూ అతను తినకుండా చూస్తున్నాను. వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు!” అన్నారు. సాయి ఒకవంక భక్తులను రక్షిస్తూ, మరొకవంక వారినుండి తిట్లు, దెబ్బలు భరించవలసివచ్చేది. ఒకసారి నానాసా హెబ్ డెంగలే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో వుంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరిచారు. వెంటనే ఒక నల్లకుక్క వచ్చి, వాటిని తింటోంది. అదిచూచి, అతడు మనసులో అసహ్యించుకున్నాడు.వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తో సేసి, “దీనిని నీవే తీసుకో, నాకొద్దు! అన్నాడు. ఆ జీవినసహ్యించుకుంటే వారిని అసహ్యించుకున్నట్లే.
ఒకసారి శిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూలముద్ర వేసి, శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడుచేస్తోంది. శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారుగాదు. చివరకు ఊరి పెద్దలంతా కలసి దానిని బందిల దొడ్డిలో వుంచి, తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించి, ఒక నెలఖర్చు యిచ్చి ఒక మార్వాడీతో దానిని యేవలాకు పంపారు. సాయంత్రానికి అతడు శిరిడీవచ్చి ఆ కార్యం ‘ నెరవేర్చానన్నాడు. మరుసటి తెల్లవారుఝామున గ్రామంలో ఒక భక్తునికి సాయి మూడుసార్లు స్వప్నంలో కన్పించి, “నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేసారు. వెంటనే వచ్చి విడిపించు” అన్నారు. తెల్లవారాక అతడాశ్చర్యంతో యేవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతును రూ. 14/- లకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడతడు దానిని విడిపించి, బందిలదొడ్లో అప్పగించి, శిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసాడు. పెద్దలు మార్వాడీకి శిక్ష విధించారు.
ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానాచందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటిమీద ఈగలు, చీమలు చేరాయి. అపుడు సాయి నానాతో, “నేను ఆరగించాను. నీవు తీసుకో!” అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి, అలిగి అన్నంగూడ తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, “నానా, 18 సం.లు నా దగ్గరుండి నీవు గ్రహించినదిదేనా? ఆ చీమలు, ఈగల రూపంలో నేనే ఆరగించాను. నీవు ప్రసాదం తీసుకో!” అన్నారు. “వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు ఋజువేమిటి?” అన్నాడు నానా. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలోలాగే అన్ని జీవులలోనూ బాబాయే వున్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు.
ఈ విషయం లో నా అనుభవం:
ఇలాగే ఒకసారి, బాబా కి బిస్కెట్ నైవేద్యం గా పెట్టాను.ఎందుకో ఆరోజు, బాబా నువ్విరోజు తప్పకుండ బిస్కెట్ తినాలి అనుకున్నాను .కాసేపయ్యాక చూస్తే బిస్కెట్ ఎవరో కొంచం కొరికి తిన్నట్లు గా వుంది. బాబా తిన్నాడేమో అని ఆనందపడుతుండగా,పూజా పీఠం పై చిన్న జల్లిపురుగు కనిపించింది.జల్లిపురుగు బిస్కెట్ తిన్నది కానీ బాబా తినలేదు అని బాధ పడ్డాను. కానీ మళ్ళీ బాబా ఆ జల్లిపురుగు రూపం లో వచ్చారేమో, ఎప్పుడూ లేనిది ఈరోజు ప్రసాదం తినమని అడిగినప్పుడే జల్లిపురుగు పీఠం పై వచ్చి తిన్నది కాబట్టి బాబా నే ప్రసాదం తిన్నారని ఆనందపడ్డాను .