ఓం ఆపదబాంధవాయ నమః !
కొందరికి సాయి అశరీరవాణి ద్వారా తమ సాన్నిధ్యమిచ్చి ఆపదలను తొలగిస్తున్నారు. కీ.శే. వెంకట నారాయణరాజు, మైసూరు సాయి మందిరంలో పూజారి. ఆయన సుమారు 17 సం.ల పాటు రోజూ ఉదయమే కొన్ని ఆలయాలు చిమ్మి, ముగ్గులువేసి, పూజ చేసేవాడు. తర్వాత కోర్టువద్ద దస్తావేజులు వ్రాసి రోజుకు రూ 2/- లు సంపాదించేవాడు. ఒకరోజు అతడు ఈ కష్టజీవితాన్ని అంతమొందించాలని విషం దగ్గరుంచుకొని, ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు. అపుడు, “నీవలన ఎన్నో జరగాలి, చనిపోవద్దు” అన్న మాటలు విన్పించాయి. వెంటనే రమణమహర్షి శరీరంతో దర్శనమిచ్చి, పై మాటలు అని, అతని చేయి పట్టుకుని, గేటు అవతల దించి వెళ్ళిపోయారు. అప్పటినుండి రాజుగారు వారినే తన గురువని తలచాడు. ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చి, “నీ గురువు నేనుగాదు, శిరిడీ సాయిబాబా!” అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పటినుండీ రాజుగారు సాయి భక్తుడయ్యాడు. శ్రీ సాయి తరచూ వారికి కన్పించి మాట్లాడేవారు. ఎన్నోసార్లు కాకి, కోతి, ఆవుల రూపాలలో వారింటికొస్తే రాజుగారి భార్య గుర్తించక అదలించేవారట. తర్వాత బాబా అతనితో, “నేను వస్తే అమ్మ అదలించింది” అనేవారు. రాజుగారు కొంతకాలం ఒక మర్వాడీవద్ద లెక్కలు వ్రాసేవారు. ఒకరోజు బాబా, “నీవిక కలం పట్టవద్దు. నా సేవ చేసుకో. అన్నమదే వస్తుంది!” అన్నారు. రాజు వెంటనే ఆ పని మానేశాడు.
ఒకరోజు వారింట్లో బియ్యం లేవు. నాడు ఆ మార్వాడీ భార్యకు బాబా పటంలో నుంచి, “వెంటనే రాజుకు బియ్యం పంపించు” అని ముమ్మారు వినిపించి, ఆమె వెంటనే బస్తా బియ్యం పంపింది గాని, రాజుగారు, “ఇవి తీసుకొమ్మని సాయి నాతో చెప్పాలి గదా!” అన్నారు. బాబా తర్వాత అతనిని అలానే ఆజ్ఞాపించారు. మరొక రోజు అతని భార్య బెంగుళూరు వెళ్ళారు. ఇంట్లో తినడానికేమీ లేదు. రాజుగారు సాయియే తనకన్ని యేర్పాట్లు చేస్తున్నారు గదా అని తలచి, దక్షిణ నుండి రూ. 10/- లు తీసుకోబోయారు. వెంటనే బాబా చెంపమీద కొట్టి, “నా డబ్బు తీసుకుంటావట్రా” అన్నారు. అతడు నివ్వెరబోయి వీధిలోకి వెళ్ళగానే అతని బాల్య స్నేహితుడు కన్పించి, బలవంతంగా హోటల్లో భోజనం పెట్టించాడు. తర్వాత ఆ మిత్రుడు ఆ రోజు వూళోనే లేడని తెలిసింది. రాజుగారు మైసూరు సాయిబాబా మందిరంలో చాలాకాలం సేవచేసి యిటీవలే పరమపదించారు.
యఫ్.యం. భంగారా (కొత్త ఢిల్లీ) యిలా వ్రాసాడు: “నా భార్య, బాబాలను నమ్మదు. నేను మాత్రం నమ్ముతాను సం. 1956 లో ఒక సాయిబాబా క్యాలెండరు మా యింట్లో వుండేది ఒకరోజు అనాలోచితంగా ఆయనకు నమస్కరించి, ఆయన గురించి ఏమీ తెలియకుండానే అలా యెలా చేసానని ఆశ్చర్యపోయాను. ఇల్లు సర్దుతుండగా నా భార్యకు ఆ గదినుండి, ‘బిడ్డా! నాకు మాలవెయ్యి. మేలు జరుగుతుంది’ అని విన్పించిందట. ఆమె వెంటనే ఆ కేలండరుకు మాల వేసింది అప్పటినుండి దానిని పూజిస్తున్నాము. అప్పట్లో మేము ఆర్థిక యిబ్బందులలో వున్నాము. ఆమె మా కుటుంబ శ్రేయస్సు కోసము, మాకు బాబు పుట్టాలనీ సాయిని ప్రార్థించింది. ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు. నా జీతంగూడ పెరిగి, మంచి బ్యాంక్ ఆఫీసర్ గా పేరొచ్చింది. అలా మేము కోరుకున్నదల్లా జరిగేది. అవసరంలో ఆయన సందేశంగూడ అందేది. కాని యివన్నీ మా భ్రాంతులేమోననుకునే వాళ్ళం. ఒకరోజు నేను ఇన్ స్పెక్షన్ కోసం వెళ్తుంటే, సాయంత్రానికి తిరిగి రావాలని నా భార్య పట్టుబట్టింది కాని బాబా దగ్గర నాకు, ‘నీవిరోజు తిరిగి రాలేవు!’ అని విన్పించింది. దారిలో ఒకచోట రైలుగేటు వేస్తే ఆగాము. ప్రక్క బస్సులోని పెద్దమనిషి మా డైవరుతో మాట్లాడి, మా కారులో కూర్చున్నాడు. నాకు కోపమొచ్చిందిగాని, అతనిని బాబా పంపారని సర్దుకున్నాను. తర్వాత ఒక ఘాట్ రోడు మలుపులో కారు బ్రేకులు విరిగిపోయాయి. కారు వేగంతో పల్లానికి దిగుతోంది. ఎడమవైపు పెద్ద లోయ వున్నది. డ్రైవరు కారును కుడివైపు కొండకు సాటింప జూచినప్పుడు, ఏదో ఒకటి ఎదురొచ్చి, కొద్దిలో ప్రమాదం తప్పుతోంది. బాబా మాటలు జ్ఞాపకం మొచ్చి నాకు మరణం తప్పదనిపించింది. నా హస్తరేఖలూ అలానే సూచిస్తున్నాయి. నేను భయంతో ‘సాయి, నా కుటుంబం కోసమైనా నన్ను రక్షించు” అని ప్రార్థించాను. వెంటనే టైరుబ్రద్దలై కారాగింది. డ్రైవరు టైరుమార్చి బయల్దేరాక మర్నాడే యిల్లు చేరగలిగాను. బాబా మాటే నిజమైంది ”