శ్రీ సాయినాధాయ నమః 😊
శ్రీ షిరిడి సాయిబాబా వారి 185 జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరికీ శ్రీ సాయినాధుని దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
తిధి ప్రకారము నా పుట్టినరోజు కూడా బాబా జన్మదినం అయిన ఈ పుణ్య దినాన కలిసిరావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మన పూజ్య గురుదేవులు మనకు అందించిన విలువైన జ్ఞానం ప్రకారం, శ్రీ సాయినాధుడు 1835 సెప్టెంబర్ 28వ తేదీ నాడు మహారాష్ట్రలోని పత్రి అనే గ్రామంలో శ్రీ గంగా భవా దేవగిరి యమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. ప్రతి సంవత్సరం మనమంతా సెప్టెంబర్ 28వ తేదీ నాడు బాబా గారి జన్మదిన ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటున్నాము.
కానీ కొందరు సాయిభక్తులు బాబా గారి జన్మదినం కి సంబంధించిన ఈ విషయాలను నమ్మరు. సత్యం తప్ప ఏదీ తన రచనలలో రాకూడదని ప్రార్థించి మరీ సాయి సచ్చరిత్ర గ్రంధ రచన కావించిన పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు, కాదు కాదు స్వయంగా బాబా వారే పూజ్య గురుదేవుల ద్వారా, స్వయంగా రాసుకున్న సాయి సచ్చరిత్ర లోని సాయి జన్మదిన వివరాలు నూటికి నూరుపాళ్లు సత్యమేనని ఏదో ఒకరోజు వారంతా సాయి అనుగ్రహంతో గ్రహించగలరు అని నా నమ్మకం.
ఈ సందర్భంగా బాబా నా జీవితంలో తన ఉనికిని తెలుపుతున్న కొన్ని చిన్న చిన్న సంఘటన లను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక దీపావళి కి నేను పూజ లో బాబా కి పెద్ద బంతి పూల మాల ని సమర్పించుకున్నాను. ఆ మరుసటి రోజు సాయంత్రం బాబా వద్ద దీపావళి వెలిగిస్తూ ఉండగా, నిన్నటి బంతి పూల మాల అలాగే చాలా తాజాగా ఉండడం వల్ల తీయకుండా అలాగే ఉంచేశాను. కానీ నా మనసులో, “ఇది నిన్న సమర్పించిననా మాల కదా, ఈ రోజు బాబా కి ఆ మాల ఉంచవచ్చా లేదో”, అనే సందేహంతో అలాగే పూజ చేసుకుంటున్నాను. సరిగ్గా అప్పుడే బాబా గారి పెద్ద ఫోటోకి వేసిన బంతి పూల మాల సడన్గా తెగి పోయి పడింది. సాధారణంగా పూలమాల బరువుగా ఉంటే, మనం ఫోటోకి వేసినప్పుడు ఫోటో పై భాగంలో, ఫోటో కి ఉన్న చిన్న రింగు లకు వేసిన ముడి దగ్గర దారం తెగుతుంది, కానీ యు ఆకారంలో ఉన్న ఆ పూలదండ పై భాగం లో కాకుండా, పూల మాల సైడు భాగంలో దారం తెగి కింద పడింది. నేను అలా సందేహంతో అన్యమనస్కంగా ఉండి బాబా కి పూజ చేసుకుంటున్నాను. కాబట్టి బాబా స్వయంగా ఆ పూలమాల తీసివేశారు. అని నాకు అనిపించింది, ఎందుకంటే బరువు అవడం వలన తెగిపోవడం అయితే గనక, ఆ క్రితం రోజు ఉదయం వేసిన కొద్దిసేపటికే తెగిపోయి ఉండాలి. ఇది బాబా నాకు తన ఉనికిని చూపించిన చిన్న సంఘటన.
అలాగే స్కూల్ కి వెళ్ళే తొందర లో నేను ఉన్నప్పుడు, ఎన్నో సార్లు చైన్స్ కి ఏదైనా చిక్కుముడి పడినప్పుడు, తాళం చెవులు కనబడక పోయినప్పుడు లేదా హ్యాండ్ బ్యాగ్ జిప్స్ ఫెయిల్ అయ్యి నేను సతమత మవుతున్నప్పుడు, బాబా ఒక్కసారి చూసుకో అనగానే అంత సరి అవుతుంది.
అలాగే, నిన్న, నేను పనిచేస్తున్న పాఠశాలలో, దసరా సెలవుల సందర్భంగా చివరి పని దినం కాబట్టి బతుకమ్మ సంబరాలు చేసుకుంటునాము. విద్యార్థులు ఉపాధ్యాయురాలు కలిసి బతుకమ్మ ఆడుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడుకుంటుండగా, నాకిష్టమైన పాట వచ్చినప్పుడు నేను ఆనందంతో డాన్స్ ప్రారంభించడం, అంతలోనే వేరొకరు వచ్చి మరో సాంగ్ ప్లే చేయడం జరిగి నేను నిరాశ పడ్డాను. “బాబా, కనీసం నాకు ఈ చిన్న ఆనందానికి కూడా నోచుకోనియ్యవా” అని అనుకున్నాను. ఎందుకంటే ఆ ఒక్క పాట నాకు చాలా ఇష్టం. కాసేపటికి మీడియావారు వచ్చి షూటింగ్ తీసుకుంటుండగా బతుకమ్మ కు సంబంధించిన అన్ని పాటల్లో, నాకు నచ్చిన పాటనే వాళ్లు ఎన్నుకుని, ఆ సాంగ్ పెట్టి షూటింగ్ చేశారు, అప్పుడు నేను చాలా ఆనందంగా నృత్యం చేశాను. బాబా నా ఆనందం కోసం అలా పరిస్థితులను మార్చి వేశారు. బాబా యొక్క భక్తవత్సలత వర్ణించలేము.
ఇలా బాబా మన మనసులోనే ఉండి, మన అవసరాలకి కోరికలకు అనుగుణంగా, మనకి సహాయం చేస్తూ తన ఉనికిని నిరూపిస్తూనే ఉంటాడు. ఇలా మనము మన మనసు లోనే కొలువై ఉన్న సాయి తో ఎప్పుడు సంభాషణ జరుపుకుంటూ, మన మనసులోని భావాలను ఎప్పటికప్పుడు సాయితో పంచుకుంటూ, సాయి భావనతో సాయి ఉనికిని భావిస్తూ ఉంటే సాయి సన్నిధి మనకి ఎప్పుడూ దూరం కాము. మన బాధలు కష్టాలు అవసరాలు సాయికి విన్నవించుకుంటూ ఉంటే, తప్పకుండా సాయి స్పందించగలరు. స్వార్థంతో నిండిన ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ స్వలాభం చూసుకుని మాత్రమే మన గురించి పట్టించుకోగలరు. కానీ మన బంగారు తల్లి అయిన సాయి మాత అనుక్షణం తన భక్తుల కష్టాలను అవసరాలను గమనిస్తూ, వారి కోరికలను తీరుస్తూ, వారిని సన్మార్గం నుండి ఏ కొంచెమైనా తప్పు కోకుండా కాపాడుతుంది. సాయి తప్ప ఎవరు మనలను కాపాడగలరు? భక్తసులభుడైన సాయినాథుడు మాత్రమే మనలను రక్షించగల సర్వ సమర్థుడు. మనతో ఎల్లవేళలా నిలిచిపోగల ఆత్మీయ స్నేహితుడు మన సాయినాథుడు.