షిరిడీలో ఒక నిండు పౌర్ణమి రోజున ఒక భక్తుడు లఘుశంక కి గాను ఇంటి బయటికి వస్తాడు, పౌర్ణమి రోజు కావడం వలన ఎటు చూసినా పిండి ఆర పోసినట్టు నిండు వెన్నెల వున్నది ఆరోజు. ఆ వెలుతురులో సూదిమొన కూడా స్పష్టంగా కనిపించేలా ఉంది. సమయం అర్ధరాత్రి దాటింది. అప్పుడు ఆ భక్తుడు లఘుశంక కి కాను తమ ఇంటి నుండి బయటికి వచ్చి దీక్షిత్ వాడా వెనుకనున్న రావి చెట్టు దగ్గరికి వస్తాడు. అప్పుడతనికి ఎండిపోయి రాలిపడిన ఆకుల పై నుండి ఏదో పాకుతున్నట్టు గా కనిపించింది. పామే అనుకుని నిశ్చేష్టుడై నిలబడతాడు. సరిగ్గా చూడగా, తెల్లని వస్త్రం లలో ఒక దుష్ట ఆత్మని ఒక పురుషుని రూపంలో కనిపిస్తుంది. ఆ దుష్ట ఆత్మ అతనితో, “ఈ స్థావరము నాది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లడం నీకే మంచిది ” అంటుంది.. అతడు భయకంపితులై అలాగే వింటూ ఉన్నాడు. ఇంకా ఆ దుష్ట ఆత్మ ఇలా అతనితో అన్నది,”నీకు ఆ ముసలివాని ( బాబా) రక్షణ మీద చాలా నమ్మకం ఉంది కదా. చెప్పు ఉందా లేదా? “అని అన్నది. వెంటనే అతనికి బాబా గుర్తుకు వచ్చి, ధైర్యంగా లేచి నిలుచుని, “అవును, నాకు బాబా రక్షణ ఉన్నది. నా దగ్గరికి వచ్చి నీ రూపాన్ని స్పష్టంగా చూపెట్టు” అని అడగగా, ఆ దుష్ట ఆత్మ అతనికి రెండు మూడు అడుగుల దూరంలో వచ్చి నిలబడింది, వెంటనే ఆ భక్తుడు, “ఆగు అక్కడే ఆగిపో, లేదా మా బాబా వచ్చి నిన్ను బస్మం చేసేస్తాడు” అని అనగానే ఆ దుష్ట ఆత్మ రావి చెట్టు పైకి ఎగిరి మాయం అయిపోయింది.
తరువాత అతను తన గదికి తిరిగి వచ్చాడు, ఈ విషయాన్ని అంతా తన తల్లితో చెబుదామని అనుకున్నాడు. కానీ తన తల్లి భయపడగలదని ఆ ఆలోచన విరమించుకున్నా డు. మరుసటి రోజు స్నానాదికాలు ముగించుకుని బాబా దర్శనార్థం ద్వారకామాయికి వెళ్లి బాబా కి ప్రమాణం చేసి బాబా ముందు మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. బాబా అతనితో “భావు, నిన్న రాత్రి నువ్వు ఏమి చుసావు? ” అని స్పష్టం గా అడిగాడు. ఆ భక్తుడు బాబాతో, “బాబా నిన్న నేను ఒక భూతాన్ని చూశాను” అని చెప్పాడు. అప్పుడు బాబా, “భావు, ఆ భూతాన్ని నేనే! “అని అనగానే అతను ఆశ్చర్యపోతాడు. తనకి ఏమీ అర్థం కాక, “కాదు బాబా, అది ఒక భూతం ఉంది, నేను దానితో మాట్లాడాను కూడా” అని జవాబిచ్చాడు. అప్పుడు బాబా, “కాదు అది నేనే ఉన్నాను, కావాలంటే మీ అమ్మని అడుగు” అని చెప్తాడు. అప్పుడు అతను తన తల్లి వైపు తిరగగా, ఆమె, “అవును బాబా అన్నింటిలో అందరిలో నివాసమై ఉన్నాడు. మనుషులు పశువులు పక్షులు మరియు భూతాల తో సహా అన్నింటా నిండి ఉన్నాడు “అని సమాధానం ఇచ్చింది. “అన్ని ప్రాణులు చివరికి భూతాలు అన్నీ బాబాకు ఆధీనంలో ఉంటాయి” అని కూడా చెప్పింది.
ఈ విధంగా ఆ భక్తుడు బాబా సాహెబ్ తార్ఖడ్ ఈ అమూల్యమైన విషయాన్ని ఈ విధంగా గ్రహించడం జరిగింది.