శ్రీ సాయినాధాయ నమః
ఈరోజు సాయి నాకు చాలా ఆనందకరమైన లీల చూపించారు. అదే ఈ నా పోస్ట్ కి కారణం, కాదు కాదు జీవితాంతం ప్రతిరోజు ఇక నేను ఏదో ఒకటి తప్పకుండా ఈ website లో పోస్టులు పెట్టడానికి ఈ లీల కారణం గా ఉండబోతోంది.
అసలు విషయానికి వస్తే, నేను గత మూడు నాలుగు రోజుల నుండి ఒక ముఖ్యమైన తాళం చెవుల గురించి వెతుకుతున్నాను. మా కన్స్ట్రక్షన్ సైట్ లో దొంగతనం జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే, అందుకోసమే రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నా ఫ్లాట్ ఉన్నది ఒక గ్రామము లో కావడం వలన, నెట్ కనెక్టివిటీ కోసం వైఫై ఏర్పాటు చేయడానికి కష్టమవుతుందని తెలిసి, డేటా కార్డ్ ని డి.వి.ఆర్ కి సెట్టింగ్ చేయించాలని అనుకున్నాను. అయితే సీసీ కెమెరాల యొక్క డి.వి.ఆర్ మరియు స్టెబిలైజర్ అమర్చిన రాక్ బాక్స్ యొక్క తాళం చెవులు ఎంత వెతికినా కనిపించలేదు. నాకు బాగా గుర్తు. ఆ తాళం చెవుల ని నేను భద్రంగా బీరువాలో దాచి పెట్టాను. కాబట్టి బీరువా లో సుమారు పది సార్లు వెతికాను. కానీ కనిపించలేదు. చాలా కంగారు తో, సెల్ఫ్ లోను, రూమ్ అంతా వెతికాను. ఎన్నిసార్లు వెతికినా, ఇల్లంతా చూసిన, తాళం చెవులు మాత్రం దొరకట్లేదు. సీసీ కెమెరా అమర్చి చాలా రోజులు అవుతుంది. కానీ నెట్ కనెక్టివిటీ కోసమే చాలా ఆలస్యం అవుతోంది ఈ తాళం చెవులు దొరకక పోవడం వలన. మూడు నాలుగు రోజుల నుండి బాబాకి విన్నవించుకుంటూ నే ఉన్నాను, దయచేసి తాళం చెవులు దొరికేలా చేయమని. కానీ బాబా వినలేదు తాళం చెవులు దొరకలేదు.చాలా నిరాశ పడ్డాను.” బాబా నా వైపు లేడు నాకు సహాయం చేయట్లేదు “అని అనుకున్నాను. “ఉన్న సమస్యలకి తోడు కొత్తగా ఈ సమస్య ఏంటి బాబా? “అని చాలా వేదన పడ్డాను. ఎందుకంటే, మళ్లీ నా ఫ్లాట్ లో దొంగతనము జరగడము, ఆ నష్టం నేను భరించలేను. నా రూమ్ లోనే బీరువాలో తాళంచెవులను భద్రపరచడం సరిగ్గా నాకు గుర్తుంది. అలాంటిది విచిత్రంగా ఎలా మాయమయ్యాయి అనేది చాలా వింతగా బాధగా అనిపించింది.”ఇన్ని కష్టాలు ఎందుకు బాబా “అని చాలా వేదన పడ్డాను.
ఈరోజు ఉదయము చివరగా, ఒకటికి పది సార్లు, నా రూమ్ లో ని సెల్ఫ్ లో ఉన్న చిన్న బ్యాగులో, మడత పెట్టిన బట్టల క్రింద తాళం చెవులు ఉన్నాయేమోనని వెతికాను. కానీ లేవు..
చివరికి బాబాకు ఒక విన్నపం చేసుకున్నాను. బాబా ఫోటో లోని బాబా చేతిలో చేయి వేసి, “బాబా.. ఈ ఉదయమే నాకు ఆ తాళం చెవులు ఎక్కడున్నాయో చూపించు. నా తాళం చెవులు నాకు ఇప్పుడు నువ్వు చూపించినట్లయితే, నీవు నా చే ప్రారంభింప చేసిన వెబ్సైట్లో, నేను మరణించే చివరి రోజు దాకా, ప్రతిరోజు తప్పకుండా నీ తత్వాన్ని తెలిపే విషయాలను కానీ నీ లీలలను కానీ ఏదో ఒకటి ఆపకుండా పోస్ట్ చేస్తూనే ఉంటాను. నీ పాదాల మీద ఒట్టు. ” అని ప్రమాణం చేశాను.
తర్వాత కొద్ది సేపటికి, మా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ యధాలాపంగా, నా రూమ్ లోనే సెల్ఫ్ లోని చిన్న బ్యాగు తీశాను. ఆశ్చర్యంగా, ఆ బ్యాగ్ తీసిన చోటనే తాళం చెవులు ఉన్నాయి. అంతకుముందే ఆ బ్యాగు బయటికి తీసి మూడు నాలుగు సార్లు వెతికి ఉంటాను. అప్పుడు కనిపించని తాళం చెవులు ఇప్పుడు ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యాయి!!! అని చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. ఎంతో భావోద్వేగంతో బాబా కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఎందుకంటే వస్తువు చిన్నదే అయినా, ఇప్పుడు దాని అవసరం నాకు చాలా ఉంది. మన ప్రతి ఆలోచనను బాబా ఎంత చక్కగా గమనిస్తూ ఉంటాడు. నేను చాలా రోజులుగా ఈ సాయిసన్నిధి website సరిగా నిర్వహించడం లేదు. ఈ వెబ్సైట్ బాబా అనుమతి ఆదేశాలతో ప్రారంభమైనది. దీని ప్రాముఖ్యతని నేను గుర్తించకుండా, website నిర్వహణ ని చాలా అశ్రద్ద చేసాను.. అందుకే కావచ్చు, నాచే బాబా ప్రతిరోజూ వెబ్సైట్ కోసం పోస్ట్ చేయించడానికి, ఇలా తాళం చెవులు కనబడకుండా చేసి, ప్రతి రోజు తప్పకుండా పోస్టింగ్ చేస్తానని ప్రమాణం చేశాక మాత్రమే నా తాళం చెవులు నాకు కనిపించేలా చేశాడు.
సాయి లీలలు మనం ఊహించలేము. బాబా చూపే ప్రతి లీల వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.
“హే సాయి. నా ప్రమాణాన్ని నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఈ వెబ్ సైట్ నిర్వహణ ద్వారా, నీ సేవ చేయడానికి తగిన శక్తిని భక్తిని పెంపొందించు కుంటాను. అందుకు నీవు కూడా నాకు సహాయం చేయుము.”
సాయి బంధువులందరికీ ఒక విన్నపం. మీరు మీకు తెలిసిన లేదా మీకు జరిగిన సాయి అనుభవాలను తప్పకుండా నాతో పంచుకోగలరు అని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఏ చిన్న అనుభవమైన అది గొప్ప భావన. ఇతరులలో సాయి భక్తి ని పెంపొందించడానికి చిన్న అనుభవం చాలు. మీకు కలిగిన ఏ సాయి భావన నైనా నాతో పంచుకోవడానికి దయచేసి ముందుకు రాగలరు. నా కోసం కాదు, కానీ సాయి కోసం!!
మీ అనుభవాలను, సాయి భావనలను 9515507396 కి కాల్ చేసి అయినా చెప్పగలరు. లేదా హోమ్పేజి దిగువన ఉన్న నా వాట్స్అప్ నంబర్ కి పంపగలరు. లేదా నా ఈమెయిల్ ఐడి saibhavanaa999@gmail.com కి మెయిల్ ద్వారా పంపగలరని మనవి🙏🙏🙏
సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః🙏🙏🙏🙏🙏🙏