శ్రీ సాయినాథాయ నమః!
సాయి తన భక్తులు ఏ చిన్న తప్పు అయినా చేయడం అస్సలు సహించరు. అలాంటి వారిని సాయి సరిదిద్దే శైలి అమోఘము.. అలాంటి భక్తుల పట్ల వారికిగల ప్రేమలో కొంచెం కొరత చూపించి, తద్వారా వారు ఆశ్చర్యంతో ఆలోచనలో పడేలా చేసి వారి తప్పిదాన్ని వారికే జ్ఞప్తికి తెచ్చి వారిని సన్మార్గంలో పెడతారు. తిరిగి సాయి ప్రేమను పొందడానికి అయినా తనా భక్తులు అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకొని సక్రమమైన నడవడిక కలిగి ఉండాలని వారి ఉద్దేశ్యం.
ఎవరైనా నిన్ను ఏదైనా యాచించినాచో నీ శక్తి కొలదీ సమర్పించు. ఇంకా అడిగితే వీలుకాదని సౌమ్యంగా చెప్పు. అంతేగాని కోపించ వద్దు అని సాయి చెప్తారు కదా. ఒకసారి నానాసాహెబు చాందోర్కరు ఇంటికి కళ్యాణ్ లో ఒక బిచ్చగత్తె వచ్చి, పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుపట్టింది. అప్పుడు నానాసాహెబ్ తన సేవకుని తో, “పెట్టింది తీసుకు పొమ్మను, లేకుంటే మెడపట్టి గెంటు “అని అన్నాడు. నానాసాహెబు చాందోర్కరు వంటి గొప్ప భక్తుడు నోటిద్వారా ఈ మాటలు రావడం మనకి ఆశ్చర్యంగా ఉంది కదా. మాయ శక్తి అలాంటిది. ఎంతటివారినైనా ఎప్పుడో ఒకప్పుడు తన వశం చేసుకుంటుంది. సాయి తప్ప ఎవరు కూడా మనల్ని ఈ కలిమాయ బారినుండి కాపాడలేరు.
తర్వాత నానాసాహెబ్ షిరిడి వెళ్ళినప్పుడు, బాబా అతనితో మాట్లాడక, పలకరించక ఊరుకున్నాడు. నానా సాహెబ్ ఆవేదనతో, సాయి ని కారణం అడగగా, “నా మాట వినని వారితో నాకేం పని. ఆ బిచ్చగత్తె ను అధికంగా భిక్ష కోరినందుకు అంత మాట అన్నావు. ఆమె నీ వాకిట్లో కూర్చుంటే నీదే పోయింది” అన్నారు. వెంటనే నానాసాహెబ్ తన తప్పు తెలుసుకుని బాబాను క్షమాపణ కోరాడు.
నా అనుభవానికి ( సాయి సుమ)వస్తే, కొద్ది రోజుల క్రితం నేను నా ప్లాట్ దగ్గరికి వెళ్లడానికి నా ఫ్లాట్ ఉన్న ఊరికి వెళ్లే ఒక ఆటోను ఆపాను. ఆటోలో ఉన్న ఒక ముసలావిడనీ చూసి కొంచెం జంకుతూ కూర్చున్నాను.. కారణం, పేద అయిన ఆ ముసలావిడ చాలా మాసిన బట్టలు వేసుకుని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా చేతి కర్ర పట్టుకుని కూర్చుంది. నాలో నాకు నచ్చనిది ఇదే. ఇలా చాలాసార్లు ఆటోలో ఎక్కేటప్పుడు, మురికి బట్టలు ధరించి ఎవరైనా కూర్చుంటే వారికి తగలకుండా కూర్చుంటాను. ఈ నా వ్యవహారం వల్ల నా మీద నాకే చాలా కోపంగా అనిపిస్తుంటుంది. ఆ విధంగా నేను, ఆ ముసలావిడ ని కొంచెం జరిగే కూర్చోమని చెప్పాను. పాపం ఆవిడ నా ఫీలింగ్ ని గమనించి, తన చీర నాకు తగలకుండా, నొచ్చుకుంటూ ముడుచుకొని కూర్చుంది. అది గమనించి, నా వ్యవహారం తప్పని నాకనిపించి,” ఈ రోజు బాబా తప్పక నాకు గుణపాఠం చెప్తారు” అని అనిపించింది. సరిగ్గా అలాగే జరిగింది. ప్లాట్ చేరుకున్నాక, కూలి వాళ్ళతో మాట్లాడుతూ అనుకోకుండా కాలు స్లిప్ అయి వారి ముందర కింద పడిపోయాను. నా డ్రెస్ కి మట్టి అంటింది. ఏ మట్టి అయితే నాకు తగలకూడదు అని ఆ ముసలావిడని అలా అవమానించానో, అదే మట్టిలో నేను పడిపోయాను. “బాబా నాకు తగిన గుణపాఠం చెప్పారు “.అని నాకు అనిపించింది. తర్వాత ఈ మధ్య ఎప్పుడు ఆటో ఎక్కిన, పక్కన ఎవరైనా పేదవారు ఉంటే, వారిపట్ల ఇప్పుడు ముందటిలా నేను ప్రవర్తించడం లేదు.
సాయి తన భక్తులకు, నడవడిక దోషం అనే మురికి అంటకుండా ఎలా కాపాడుతారు చూశారా. అసలైన మురికి అంటే ఇదే. భౌతిక మురికి ఒకసారి నీళ్లతో శుభ్రపరుచుకుంటే పోతుంది. కానీ మనసుకి పట్టిన మురికి పోవాలంటే ప్రతి దినం సాధన చేయాల్సిందే.
అందుకే అనుక్షణం మనల్ని మనము ఆత్మవిమర్శ చేసుకుందాము. సాయి మార్గంలో నడుద్దాము. మాయ మనల్ని పక్కకి లాగాలని చూసిన, నిరంతర దివ్య సాయి స్మరణతో కలిమాయని తరిమేద్దాం.