శ్రీ సాయినాథాయ నమః!
మన ప్రతి జన్మలో మన వెంట ఉండి మనల్ని నడిపించే వాడు ఎవరో తెలుసా.. సదా తనను శరణుజొచ్చిన తన భక్తులను ప్రతి జన్మలోనూ కలుసుకుని, వారి సంస్కారాలను ఉన్నతి వైపు మరలిస్తూ, వారిని అక్కున చేర్చుకునే మన సాయి నాథుడే. దీనిని నిరూపించే విషయాలు కొన్ని గమనిద్దాం.
బాబా షిరిడీ లో తన భౌతిక శరీరంతో ఉన్నప్పుడు శ్రీమతి ప్రధాన కు బాబు జన్మించడానికి సంవత్సరం ముందే భక్తులతో బాబా, ఆమె “బాబు”( గణేష్ కేల్కర్ బంధువు యొక్క పేరు) తల్లి అనసాగారు, ఈ బాబు హరి వినాయక్ సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి బాబుకు బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవడం వలన అతడిల్లు విడిచి కాలినడకన శిరిడీ చేరి బాబాను దర్శించాడు. తర్వాత అతడు కోపర్గావ్ మరియు యవల గ్రామాలకు సర్వేర్ అయ్యాడు. బాబు పూర్తిగా బాబా సేవ లో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాటి కేల్కర్ లు బాబాకు ఫిర్యాదు చేశారు. బాబా, “ఆ పనులన్నీ అలా ఉంచి బాబుని నా సేవ చేసుకోనివ్వండి “అన్నారు. అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు ఒక్కొక్కప్పుడు సాయి మంచి మంచి ప్రసాదాన్ని ఈ బాబుకు పెట్టేవారు. 1910వ సంవత్సరంలో ఒకసారి ఆయన “బాబు విషయంలో జాగ్రత్త తీసుకో” అని కేల్కర్ ని హెచ్చరించారు. అతడికి ఏమీ అర్థం కాలేదు.
కొద్దిరోజులలో బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒకరోజు బాబా కేల్కర్ తో, “బాబు ఇంకా జీవించే ఉన్నాడా? “అన్నారు. కొద్ది రోజులలో బాబు షిరిడి లోనే మరణించాడు. అటు తరువాత కూడా బాబా బాబునీ గుర్తుంచుకునే వాడు. కేల్కర్ బంధువైన ఈ బాబు మరణించిన కొద్దికాలానికి, శ్రీమతి ప్రధాన కడుపున మరలా జన్మించాడు. శ్రీమతి ప్రధాన్ తన బిడ్డను తీసుకుని బాబా దర్శనానికి వచ్చింది. 4 మాసాల ఆ బిడ్డని ఎత్తుకుని సాయి ఎంతో ప్రేమగా, ” బాబు ఎక్కడికి వెళ్లావు నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా ?”అన్నారు. ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు. అంతే ఆ బిడ్డ కూడా సాయిని గుర్తించాడు. పుట్టిన శిశువుల్లో, తమ గత జన్మ ని గుర్తుంచుకునే జ్ఞానం ఉంటుందంటారు
అలాగే, మొదటిసారి షిరిడి దర్శించిన నార్కే ను శ్యామ పరిచయం చేయబోతే సాయి,” వీడిని నాకు పరిచయం చేయడమా? 30 జన్మలనుండి వీడు నాకు తెలుసు” అన్నారు. అలాగే తమకు రఘువీర పురందర్ తో ఏడు శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి, “నేను ఇతనిని ఎప్పుడు మర్చిపోను. ఇతడు రెండు వేల మైళ్ల దూరాన ఉన్నా సరే ఇతను లేకుండా నేను తినను “అన్నారు.
అలాగే జోగు, కేల్కర్ శ్యామ దీక్షితులు తమతోపాటు తమ చెంత చిన్న వీధి లో నివసించే వారని ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తన దగ్గర చేర్చుకున్న అని అన్నారు.
యశ్వంతరావు అనే భక్తుడు గూర్చి, బాబా, “వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి గలవాడు. అందుకే ఇప్పుడి తల్లి గర్భాన జన్మింప చేశాను “అన్నారు..
మరణం అనేది అనివార్యం. సాయి భక్తులైన ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. సృష్టి నియమాలని బాబా కూడా కాదనలేడు కదా. ఒక్కొక్కసారి బాబా తన భక్తులను అకాల మరణం నుండి కాపాడిన, మరణం అనేది లేకుండా మాత్రం చేయలేదు కదా.. కానీ బాబా తన భక్తుని ప్రతి జన్మలోనూ వెంటాడుతూ, తన బాగోగులు చూసుకుంటూ, తన ఉన్నతికి అహర్నిశలు పాటు పడుతుంటాడు. మనకు కావలసింది శ్రద్ధ మరియు సహనం. బాబాపై అంతులేని ప్రేమ భక్తులు. ఇవి చాలు మనల్ని బాబా సన్నిధిలోనే శాశ్వతంగా ప్రతి జన్మలోనూ ఉంచడానికి.