శ్రీ సాయినాధాయ నమః
మనము బాబాకి ఏదైనా సేవచేసి, బాబా కి ఎంతో చేసినట్టుగా అప్పుడప్పుడు భావిస్తుంటాము . మన శ్రేయస్సు కోసమే మనము బాబా సేవ చేయడం మనకు అవసరం. బాబా పట్ల మనకు గల ప్రేమా భక్తులను బాబా సేవ ద్వారా మనము తృప్తి పరుచుకుంటాము..అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినా సాయి మన సేవలు స్వీకరించడమే మహా భాగ్యం.. బాబా సేవ చేసి తాను బాబా కి ఎంతో చేస్తున్నట్టుగా భావించే భక్తులను బాబా ఎప్పటికప్పుడు సరిదిద్దే వారు.
కాశి రామ్ షిరిడీలో బట్టల వ్యాపారం చేసేవాడు. అతడు బాబాని చాలా ప్రేమించేవాడు. అతడు బాబా కోసం కపిన్ని కుట్టించి ఇచ్చేవాడు. ప్రతిరోజు రెండు పైసలు బాబా యొక్క శ్రీ చరణాలకి సమర్పించేవాడు. ప్రేమ భక్తి భావాలతో కాశి రామ్ ఇచ్చే ధనాన్ని బాబా కూడా స్వీకరించేవారు, ఏనాడయిన బాబా అతడిచ్చే ధనాన్ని స్వీకరించక పోతే, కాశి రామ్ చాలా రోదించే వాడు.
కొన్ని రోజుల తర్వాత కాశీరాం తన రోజు వారి ఆదాయాన్ని మొత్తం ఏరోజుకారోజు బాబా కి అర్పించడం ప్రారంభించాడు. ఆ ఆదాయం నుంచి బాబా ని తనకు తోచినంత ధనాన్ని తీసుకోమని చెప్పేవాడు. బాబా అలాగే చేసేవాడు. మాయ మనల్ని కుదురుగా ఉండనిస్తుందా?? మనల్ని ఏదైనా మంచి చేయకుండా ఎప్పుడూ అడ్డుకుంటూ నే ఉంటుంది.. అలాగే, కొన్ని రోజుల తర్వాత కాశి రామ్ మనసులో అహంకారం మొలకెత్తింది. బాబా యొక్క ప్రతి అవసరాన్ని తానే తీర్చుతున్నట్లు అతడు భావించేవాడు. బాబా కాశి రామ్ మనసులోని భావాన్ని గుర్తించాడు. అతన్ని సరిదిద్దడానికి బాబా అతడు సంపాదించిన రోజువారీ ఆదాయాన్ని మొత్తం తీసుకుని తన దగ్గర ఉంచుకోవడం ప్రారంభించాడు. దక్షిణ ద్వారా కూడా ఎక్కువ ధనాన్ని అడగడం ప్రారంభించాడు బాబా. తద్వారా కాశి రామ్ యొక్క ఆర్థిక స్థితి క్షీణించసాగింది. చివరికి అతనికి బాబా తో, తన దగ్గర డబ్బులు లేవని చెప్పక తప్పలేదు. అప్పుడు బాబా అతన్ని షిరిడీలోని వర్తకుల దగ్గరనుంచి డబ్బులు అరువుగా తీసుకుని దక్షిణ చెల్లించమని ఆదేశించారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వర్తకులు కూడా డబ్బులు అరువుగా ఇవ్వడానికి నిరాకరించారు. కాశి రామ్ తన తప్పును తెలుసుకున్నాడు. బ్రహ్మాండ నాయకుడు రాజాధిరాజు అయిన సాయి సమర్ధుడు కి మనము ఏది ఇవ్వడానికైనా సమర్థు లము కాము అని అతనికి తెలిసింది.
ఏ విధంగా అయినా, మనం బాబాకి ఏదైనా సేవ చేస్తున్నప్పుడు, ఆ సేవచేసే భాగ్యాన్ని మనకు కలిగించినందుకు బాబాకి మనము ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. మనలో అహంకారం తలెత్తకుండా, మనల్ని కాపాడమని సాయిని వేడుకుంటూ ఉండాలి.. కలిమాయ చాలా శక్తివంతమైనది. మనల్ని ఏ క్షణం లోబరుచుకుని, అహంకారానికి, గర్వానికి వశం చేసుకుంటుందో మనకి తెలియదు. సర్వ సమర్ధుడైన సాయి నాథుడే మనల్ని మాయ నుంచి కాపాడి, మనలో అరిషడ్వర్గాలు అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, అహంకార మమకారాలు తలెత్తకుండా చూడగల సర్వ సమర్ధుడు. సాయి శరణు వేడితే మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు.
సర్వ సమర్థ సాయి శరణం