ఓం శ్రీ సాయినాథాయ నమః
విట్టల్ వైద్య మొట్టమొదటిసారి 1911లో షిరిడీకి వెళ్లి బాబా భక్తుడు గా మారాడు. ఒకసారి వైద్య బ్రాంకైటిస్ తో బాధపడుతున్నాడు. అతడికి 21 రోజుల వరకు తీవ్రమైన జ్వరం ఉండెను. డాక్టర్ chitkar అనే వైద్యుడు దగ్గరికి వెళ్లగా, అతడు దగ్గు తగ్గించే అనేక రకాలైన మందులను మరియు ఇంజెక్షన్లను ఇచ్చాడు. కానీ అతడి స్థితిలో ఏ విధమైన మార్పు రాలేదు.
జ్వరం వచ్చిన 21వ రోజు రాత్రి 9 గంటలకు అతని జీవితంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు అతడి కుటుంబ సభ్యులు కూడా అతని దగ్గరే ఉన్నారు. ఉన్నట్టుండి వైద్య ఒక్కసారిగా ఇలా అరిచారు, “బాబా వచ్చారు, వారు నాకు సజ్జ రొట్టె మరియు ఉల్లి పాయలు ఇచ్చారు.” కానీ అతడి కుటుంబ సభ్యులకి బాబా కనిపించలేదు.ఈ మాటలను విని, జ్వరం వల్ల కలిగే అచేతన స్థితిలో అతను అలా ఏదేదో మాట్లాడుతున్నాడు అని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు.. అందువల్ల వైద్య వాళ్ళందరూ మీద కసురుకుని వారిని తన గదినుంచినుంచి బయటికి వెళ్ళిపొమ్మన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతని గది బయట నిలబడి ఏం జరుగుతుందో అని వింటూ నిల్చున్నారు. వారికి బాబా మరియు వైద్య ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించసాగాయి. ఎవరో ఇద్దరు వ్యక్తులు వైద్యనీ తమతోపాటు తీసుకెళ్లడం కోసం బాబా తో చేస్తున్న వాదన వారికి వినిపించింది. బాబా ఆ ఇద్దరు వ్యక్తులను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని ఆదేశిస్తున్నారు. అయినా వారు వైద్యనీ తమతో పాటు తీసుకెళ్తామని బాబాతో వాదిస్తున్నారు. బాబా వారి మాటలనుఖండిస్తూ, కోపంతో సట్కా తో నేలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ ఇద్దరి వ్యక్తుల మాటలు వినిపించకపోవడంతో బయట ఉండి వింటున్న వారికి, ఇతర వ్యక్తులు బాబా యొక్క క్రోధానికి భయపడి పారిపోయారు అని అర్థమైంది.. బాబా వైద్య తో జ్వరం తగ్గడానికి చల్లని నీరు తాగమని ఆదేశించి అక్కడినుండి అంతర్థానమయ్యారు.
బాబా ఆదేశానుసారం, వైద్య గది బయట నిల్చున్న తన పుత్రుని పిలిచి చల్లని నీరు అడిగాడు. వైద్య మరియు బాబా యొక్క సంభాషణను విన్న వారి కుమారుడు వెంటనే చల్లని నీళ్ల గ్లాసు తండ్రికి అందించాడు. వైద్య గ్లాస్ నీటిని మొత్తం తాగగానే, అతని శరీరం నుంచి చెమట తీవ్రంగా రాసాగింది. నెమ్మది నెమ్మదిగా తన జ్వరం పూర్తిగా నయం అయిపోయింది. అతని పుత్రుడు డాక్టర్ ని ఇంటికి తీసుకురాగా, వైద్య యొక్క జ్వరం హఠాత్తుగా మాయమవడం గమనించి డాక్టర్ చాలా ఆశ్చర్య పడ్డాడు. కేవలం చల్లని నీరు త్రాగడం వల్ల జ్వరం ఎలా నయం అయింది అతనికి అర్థం కాలేదు.మరుసటి రోజు డాక్టర్ వైద్యకి ఒక ఇంజక్షన్ ఇచ్చి, అతడు ఇక ప్రమాదం నుంచి బయట పడ్డాడు అని అతని కుటుంబ సభ్యులకి సూచించాడు.
ఈ విధంగా బాబా, తన భక్తుడి ప్రాణాలను తీసుకెళ్ళడానికి వచ్చిన యమదూతలను పారద్రోలి తన ప్రియమైన భక్తుడి ప్రాణ రక్షణ చేశారు.