బాలకృష్ణ వామన వైద్య రెండవ భాగం
“మా షిరిడీ యాత్రలో ఒక విచిత్రమైన ఘటన కూడా జరిగింది. బాబా యొక్క ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “నాకు కొన్ని రూపాయలు ఇవ్వండి, నేను మీకు నుదుటిపైన పెట్టే ఒక పవిత్రమైన శక్తివంతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాను..” నేను వద్దు అని నిరాకరించగా, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నేను తిరిగి ఆలోచించి ఆ వ్యక్తిని తిరిగి రమ్మని, “సరే నేను నీకు కొన్ని నాణాలను ఇస్తాను. నన్ను ఆశీర్వదించు ” అన్నాను. కానీ అతను బాబా నుంచి అతనికి ఇప్పుడు అనుమతి లేనందువలన నిరాకరించాడు. నేను బాబా దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా వివరించాను. బాబా ” సరే మంచిది ” అని అన్నారు.
మేము తిరిగి వెళ్లడానికి బాబా అనుమతి కోరాము, మేము వెళ్లొచ్చు అని బాబా మాకు అనుమతి ఇచ్చారు. మేము టాంగా తీసుకుని కోపర్గావ్ రైల్వే స్టేషన్ వరకు చేరుకున్నాము. మేము రైలు స్టేషన్ చేరేసరికి మేము ఎక్కాల్సిన రైలు మా ముందు నుండే వెళ్ళిపోయింది. మేము రాత్రి కొన్ని గంటలు అక్కడే స్టేషన్లో గడిపి, మరుసటి రోజు ఉదయమే మన్మాడ్ వెళ్లడానికి వేరే రైలు ఎక్కాము. మన్మాడ్ చేరుకున్నాక మాకు తెలిసిన విషయం ఏమిటంటే, ముంబై వెళ్లడానికి ఏ రైలు అయితే మేము ఎక్కకన్నా ముందే వెళ్లి పోయిందో, అదే రైలు కి ఆక్సిడెంట్ అయింది అని తెలిసింది. బాబా దూరదృష్టితో, మాతృ ప్రేమ తో ఆ రైలు మేము అందుకోకుండా చేసి యాక్సిడెంట్ నుండి మా అందర్నీ కాపాడాడు.
నేను మళ్ళీ 1912లో షిరిడి వెళ్లాను. ఈసారి నా కుటుంబ సభ్యులతో కాకుండా, మా కార్యాలయంలో పనిచేసే ఇద్దరు మిత్రులతో పాటు షిరిడి వెళ్లాను. ఈసారి బాబా కి నా యొక్క కష్టాలని సమస్యలని విన్నవించుకోవాలి అని అనుకున్నాను. బాబా నన్ను చూస్తూనే నా మనసులోని విషయాలను గ్రహించి, నేను చెప్పకుండానే, “శాంతం గా ఉండు. భయపడకు!” అన్నారు. “మీరు నా రక్షకుడిగా ఉండగా నాకు ఏ విధమైన భయం లేద”ని నేను సమాధానం ఇచ్చాను. మేము ఆఫీసులో ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్నాము. అందువలన నేను బాబాతో, తిరిగి వెళ్ళడానికి అనుమతి కొరకు ప్రార్థించాను. కానీ బాబా నాకు అనుమతిని ఇవ్వలేదు. బాబా ఈ విధంగా చేసి, నన్ను కష్టాలనుండి కాపాడుతున్నారని నేను గ్రహించాను. అందువల్ల నేను అక్కడే షిరిడీలో ఆగి పోయాను. మా ఆఫీస్ లో చెప్పకుండా, అన్నిరోజులు షిరిడిలో ఉండిపోవడానికి నా మిత్రులు భయపడ సాగారు. కానీ నేను షిరిడీ లో ఉండి పోవడం చూసి వాళ్లు కూడా ధైర్యంగా నాతోపాటు షిరిడీ లో ఉన్నారు. అలా బాబా మమ్మల్ని రెండు మూడు రోజులు షిరిడీలోనే ఉంచి వేశారు. తర్వాత మమ్మల్ని తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మా కార్యాలయం వెళ్లాక మేము, సెలవులని పొడిగించమని అర్జీ పెట్టుకున్నాము. ఎటువంటి అవాంతరం లేకుండా మాకు సెలవులు పొడిగించబడినాయి. ఇది బాబా యొక్క అద్భుత శక్తి.
ఇక అదే నా చిట్ట చివరి శిరిడీ యాత్ర. 1916లో నేను బాంద్రాలో ఉండసాగాను. 1917 లేదా 1918లో మా ఇంటి బయట ఒక సాధువు వచ్చాడు. అతడు మమ్మల్ని ఒక పైసా అడిగాడు, నా పుత్రుడు అతడికి ఒక పైసా ఇస్తూ, మీరెవరో నాకు తెలుసు ఆన్నాడు. అతడు ఒక సాధువు వేషంలో ఉన్న సాయిబాబాయే అని నా పుత్రుడి నమ్మకం. నేను ఆ సాధువు పాదాల కి మొక్కి ఇంటిలోపలికి ఆహ్వానించాను. మా ఇంటిలోకి సాధు రాగానే నేను మళ్ళీ అతని పాదాలకు మొక్కగా, “నీకు ఇప్పుడు తృప్తిగా ఉన్నదా? “అని ఆ సాధువు ప్రశ్నించారు. నేను అవునని సమాధానం చెప్పాను. అతడు నన్ను భోజనం తయారు చేసుకోవడానికి అవసరమయ్యే పిండి మొదలైన వస్తువులను అడిగాడు. నేను వాటిని భక్తిగా సమర్పించుకున్నాను. ఆ సాధువు వెళ్తూ, “నేను ఎప్పటికీ నీతోనే ఉన్నాను. నీవు షిరిడి రావాల్సిన అవసరం లేదు.” అని అన్నారు. దాని తర్వాత, ఇక నేను షిరిడి వెళ్ళలేకపోయాను.
తర్వాత నా జీవితంలో కొన్ని దురదృష్టకర పరిస్థితులు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ బాబా నా తోడుగా ఉన్నారు. దీంతో నేను ఎంతో ధైర్యంగా ఆయా పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది.”
జై సాయి రామ్