శ్రీ సాయినాధాయ నమః
బాలాజీ పిల్లాజీ గురవ్ 1912లో తన 13 సంవత్సరాల వయసులో, తన తల్లిదండ్రులతో కలిసి షిరిడీ వచ్చాడు. బాలాజీ తండ్రికి బాబా స్వప్నంలో కనిపించి షిరిడి రమ్మని, అక్కడ తనకి ఏ లోటు ఉండదని భరోసా ఇచ్చి తనని షిరిడీకి ఆహ్వానించారు. మరియు బాలాజీ తల్లికి కూడా బాబా స్వప్నంలో కనిపించి, ఆమె కు 50 పైసలు ఇచ్చి పూజగదిలో ఉంచుకోమని అన్నారు. అలాగే తనకు ధరించటానికి చిరిగిన బట్టలు ఇవ్వమన్నారు.
బాలాజీ పరివారము రహతా లో జరిగే సంతకు వచ్చినప్పుడు తాత్యా యొక్క మునిముతో పరిచయం కలిగింది. అతను వారిని షిరిడి తీసుకుని వచ్చాడు. అప్పటినుండి బాలాజీ పరివారము షిరిడి లోనే ఉండసాగారు.
బాలాజీ గొప్ప సంగీతకారుడు. అతడు సన్నాయి వాయించడంలో ప్రవీణుడు. అతడు ప్రతి రోజు హారతి సమయంలో దీక్షిత్ వాడాలో సన్నాయిని వాయించేవాడు. కానీ బాబా ముందు సన్నాయి వాయించాలి అంటే బాలాజీ కి భయం వేసేది, అందువలన అతడు ఎప్పుడూ బాబా ముందర సన్నాయి వాయించే సాహసం చేయలేదు.
బాలాజీ మసీదుకు వచ్చినప్పుడు అతనిపై బాబా ఇటుక ముక్కలు విసిరేవాడు, అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆ ఇటుక ముక్కలు బాలాజీ కి తగలలేదు. బాబా ఇటుకలు బాలాజీ పై విసరడం ఆరంభించగానే, అతడు అక్కడినుంచి పరిగెత్తేవాడు. బాబా, బాలాజీ ని, “ఆగు ఆగుఆగు “అని తనని ఆపడానికి ప్రయత్నించేవాడు😊.. ఎప్పుడైనా, పరిగెత్తుతున్న బాలాజీ బాబా కి దొరుకుతే, “నిన్ను మసీదులోనే పాతి పెడతాను” అని బాబా అతన్ని బెదిరించేవాడు. 😊( ఇదంతా బాబా యొక్క లీలా వినోదం అని భావించ గలరు)
కానీ బాబా యొక్క ఈ వ్యవహారం వల్ల బాలాజీ భయపడి దీక్షిత్ కి ఈ విషయం చెప్పాడు. అప్పుడు దీక్షిత్ అతడికి ధైర్యం ఇస్తూ,” బాబా నిన్ను ఎప్పటికీ కొట్టడు. బాబా నీపై ప్రయోగించే ఈ తిట్లు బెదిరింపులు అన్ని నీ మీద తనకి గల కృపకి నీదర్శనాలు మాత్రమే! నువ్వు షిరిడి లోనే ఉండాలని బాబా కోరిక . అందుకే నిన్ను ‘షిరిడీలోనే మసీదులో పాతి పెడతాను’ అని బాబా అన్నారు” అని బాలాజీ కి నచ్చ చెప్పాడు.
ఈ మాటలతో బాలాజీ చాలా ఆనందించాడు. మరుసటి రోజు బాలాజీ ఆనందంతో, ముఖాన చిరునవ్వుతో బాబా సమక్షంలో ఆరతి కై హాజరయ్యాడు. బాబా కూడా చిరునవ్వుతో బాలాజీ వైపు చూశాడు. ఆ రోజు నుండి బాలాజీ కి సమక్షంలో భక్తుడు పాడే హారతిలో సన్నాయి వాయించే అవకాశం, పదవి దక్కింది. అతని పుత్రుడికి కూడా శిరిడి సంస్థానంలో ఉద్యోగం దొరికింది. ఈ విధంగా బాలాజీ పరివారము షిరిడీలో సుఖంగా జీవించసాగారు.