ఓం శ్రీ సాయినాథాయ నమః
దాదాసాహెబ్ ఖాపర్డే మనుమడు కేశవ్ ఖాపర్డే ద్వారా చెప్పబడిన లీల ఇది.. ఈ లీల బాబా యొక్క మహాసమాధి అనంతరం జరిగినది.దాదాసాహెబ్ ఖాపర్డే యొక్క పుత్రుడు బాలకృష్ణ ఒకసారి కారులో గోపాల్ నుంచి పంచమడి వెళ్ళు చుండెను . ఆ దారిలో రోడ్డు అంతా చాలా మలుపులతో కూడి ఉండెను. మరియు రోడ్డు పక్కగా పెద్ద లోయ ఉండెను.
ఈ విధంగా ఆ దారిలో ప్రయాణిస్తుండగా బాలకృష్ణ ఒక రోడ్డుమలుపు దగ్గర కారును తిప్పగానే ఎదురుగా వస్తున్న మరో కారుని ఢీ కొట్టారు. ఆ ఊపు కి కారు రోడ్డు పక్కనే ఉన్న పెద్ద లోయలోకి పడిపోయింది. అంతటి ఊహించలేని సంకట కరమైన క్షణాల్లో, బాలకృష్ణ కి సంకట హరుడు అయినా సాయి నాధుడు గుర్తొచ్చాడు. వెంటనే బాబాను ఎలుగెత్తి రక్షించమని ప్రార్థించారు. గజేంద్రుడిని రక్షించిన శ్రీ మహావిష్ణువు లాగా, వెంటనే అక్కడ తన భక్తుడిని కాపాడడానికి బాబా ప్రత్యక్షమయ్యారు.. ఏమి చేయాలో అర్థం కాక, కారులో చాలా అవస్థ పడుతున్న బాలకృష్ణ కి, హఠాత్తుగా తెల్లని ధరించిన బాబా యొక్క చేతి కనిపించింది. ఆ ఆపన్న హస్తం అతడు ఇరుక్కుపోయిన కార్ డోర్ ని తెరిచింది. అంతలోనే బాలకృష్ణ నీ మరియు డ్రైవర్ని లోయలో ఉన్న కారులో నుండి ఎవరో అమాంతం పైకి లేపినట్లుగా అయి రోడ్డుపైకి నించో పెట్టబడ్డారు . లోయలో పడిపోయిన తను ఎలా పైకి వచ్చాడు అని అతడు ఆశ్చర్యపోయాడు. తెల్లని కఫనీ ని ధరించిన బాబాయే కారు డోరు తెరిచి తనని లోయలో నుండి పైకి తీసుకు వచ్చి, తనను ప్రమాదం నుండి కాపాడాడు అని అతడు గ్రహించాడు. అతడు పైకి రాగానే లోయలో మధ్యలో ఇరికిన కారు పూర్తిగా కిందపడిపోయిన నుజ్జు నుజ్జు అయిపోయింది.
డ్రైవర్ మరియు బాలకృష్ణ కి నుదుటిపై గీరుకు పోయినట్టుగా చిన్న గాయం తప్ప దెబ్బలు ఏమీ తగ్గలేదు.
కారు డోరు తెరిచి, వారిని లోయ నుండి పైకి తీసుకు వచ్చిన తెల్లని కఫనీ తో ఉన్న ఆ ఆపన్నహస్తం బాబా యే అనడంలో సందేహం లేదు. తన భక్తులు కష్టాల లోతైన లోయలో పడినప్పుడు ఆ భక్తవత్సలుడు ఊరక ఉంటాడా మరి??
దాదాసాహెబ్ ఖాపర్డే కుమారుని రక్షించినట్లు గానే, ఆపద పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న ఎందరో భక్తులను బాబా, “నేనున్నాను” అంటూ, మెరుపు లా ప్రత్యక్షమై వారిని రెప్పపాటులో కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఈ జీవన సాగరంలో అడుగడుగున ఎన్నో కష్టాలు, సమస్యలు సుడిగుండాల రూపంలో మనలని ముంచెత్తుతున్నాయి. అలాంటి సమయంలోనే, బాబాపై చెక్కుచెదరని విశ్వాసం, నమ్మకం మనకు చాలా అవసరం. చుట్టూ ఆపద ముంచెత్తిన ఆ క్షణాల్లో బాబా ని మనస్ఫూర్తిగా తలచుకుంటే ఏ విధంగా నైనా, ఏ రూపంలోనైనా వచ్చి మనలను ఆపద నుంచి బయటికి తీసుకు వస్తాడు సాయినాథుడు.
మన కర్మఫలాన్ని మనం అనుభవించక తప్పదు. 100% అనుభవించవలసిన మన కర్మలను, బాబా దయతో నామమాత్రంగా అనుభవించేలా చేసే సాయి దయ వర్ణించలేము. ఆ పది శాతం కర్మఫలాన్ని మనం ఓర్పుతో ఓర్చుకుంటే చాలు. మన కర్మ కి మనమే బాధ్యులము అయినప్పుడు బాబా ని బాధ్యులను చేస్తూ ఉంటాము. బాబా పై కోపం తో బాబా కి దూరం అవుతుంటాము.. అలా కాకుండా, శ్రద్ధ సబూరి లతో భక్తితో బాబా రక్షణకై వేచి చూద్దాం.
జై సాయిరాం
ఆపద్బాంధవ సాయి శరణం- అనాధ రక్షక సాయి శరణం