ఓం శ్రీ సాయినాధాయ నమః
నానా సాహెబ్ చాలా ధనవంతుడు. అతడి ఊరిలో అతనికి ఒక పెద్ద భవంతి ఉండేది. అతను తన ఉమ్మడి కుటుంబం తో అక్కడ నివసించే వాడు. తన కి చాలా ఎకరాల భూమి ఉండేది. ఆయన దాన్ని సాగుచేసే వాడు. ఒకసారి వారి గ్రామంలో చాలా భయంకరమైన కరువు వచ్చింది. మొదట గ్రామస్తులు వారి గోదాముల్లో, నిల్వ ఉంచుకున్న ధాన్యాన్ని వాడుకుని ఆ భయంకరమైన పరిస్థితిని కొంతవరకు తట్టుకున్నారు. కానీ చాలా రోజులు గడిచినా వర్షపు ఛాయలే కనిపించలేదు. గ్రామస్తుల సాగుభూమి బీడు బారి పోయింది. బీడు వారిన తన భూమిని, ఎండిపోయిన పొలాలు చూసి నానా చాలా నిరాశ చెందాడు. ఇక తన భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కానీ బాబా అనుమతి లేనిదే అతడు ఏ పని చేయడు కనుక షిరిడి వెళ్లి బాబా తో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుని శిరిడి బయలుదేరాడు. ద్వారకామాయిలో అడుగుపెట్టగానే, బాబా కోపంతో ” లక్ష్మిని అమ్మాలని చూస్తున్నావా? ఇప్పుడే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళు” అని అన్నాడు. నానా కి బాబా యొక్క ఉద్దేశం అర్థం అయ్యి తన భూమిని అమ్మవద్దనే బాబా ఆజ్ఞని పాలించాలని అనుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా, దారిలో ఇతర గ్రామాల్లోని బీడు బారిన భూమిని చూస్తూ చాలా బాధతో అలా నడుస్తూ వెళ్తున్నాడు. తన గ్రామానికన్నా 12 మైళ్ల ముందు ననాగ్ అనే గ్రామాన్ని చేరుకున్నాక అక్కడి పొలాల్లో నీటితో నిండిపోయిన కాలువలని చూసి అతని హృదయంలో ఆనందము తో పొంగింది.అలాగే తన గ్రామానికి చేరుకోగానే తన పొలాల్లో నీరు ఉండటం చూసి చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు.ఇంటికి చేరుకున్నాక తన కుటుంబ సభ్యులని ఆత్రంగా ప్రశ్నించగా, “మీరు శిరిడి కి బయలుదేరగానే, ఇక్కడ కుండపోతగా వర్షం కురిసింది. అన్ని పొలాలు నీటితో నిండిపోయాయి. కురిసిన వర్షంతో బావులు కూడా నిండిపోయాయి. ” అని వివరించారు.
బాబా ఈ లీల ద్వారా నిరాశతో బీడు బారిపోయిన తమ మనో భూమి పై కుండపోతగా అనుగ్రపు జల్లులు కురిపించారు అని తెలిసి వారంతా అమిత ఆనందాన్ని అనుభవించారు.
కొంతకాలానికి నానా యొక్క చిన్న చెల్లెలి వివాహం నిశ్చయమయింది. వివాహ తేదీని నిచ్చయించుకున్నాక, నానా షిరిడి వెళ్లి బాబా ని తన చెల్లెలి వివాహానికి విచేయమని ఆహ్వానించాడు. బాబా అతనితో తప్పనిసరిగా వస్తాను అని సమాధానం ఇచ్చాడు.
బాబా వస్తాడని నానా ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేకమైన ఆసనంపై, రకరకాలైన రుచికరమైన వంటకాలు వడ్డించబడిన భోజన పళ్లాన్ని ఉంచి బాబా కొరకు వేచి చూశాడు. ఆ తర్వాత అతిథులను ఆహ్వానించడంలో నిమగ్నం అయ్యి బాబా విషయాన్ని మర్చిపోయాడు. అదేసమయంలో భిక్ష కొరకు ఒక ఫకీరు అక్కడికి వచ్చాడు. ఎవరో వారిని ఇంటి అరుగులో ఒక స్తంభం వద్ద కూర్చోబెట్టి తినడానికి భోజనాన్ని ఇచ్చారు. ఫకీర్ ఆ భోజనాన్ని స్వీకరించి ఆశీర్వాదాలను ఇచ్చి వెళ్లిపోయారు. నానా కు ఈ విషయం తెలియదు.ఏ ప్రదేశం లో అయితే పకీర్ కూర్చున్నారో నానా అక్కడ తన పాదరక్షలను వదిలేవాడు.
కొన్ని రోజుల తర్వాత నానా శిరిడీ వెళ్లినప్పుడు, బాబా తన ఇంట్లో జరిగిన శుభకార్యానికి రాలేదు అని తలచి చాలాఉదాసీనం గా కూర్చున్నాడు. అప్పుడు బాబా అతని తో “నేను వివాహానికి హాజరు అయ్యాను. నాకు స్తంభం దగ్గర భోజనం వడ్డించ బడింది కూడా” అని చెప్పారు. నాను బాబా మాటలు విని తను చేసిన పొరపాటు గ్రహించి పశ్చాత్తాప పడ్డాడు. పాదరక్షలను విడిచే ప్రదేశంలో బాబాని కూర్చుండ పెట్టారు అని నానా చాలా బాధ పడి బాబాను క్షమాపణ వేడుకున్నాడు. తర్వాత బాబా నానా కి ఒక జత పాదుకలనుఇచ్చాడు. నానా వాటిని తన ఇంటికి తీసుకెళ్లి ప్రతిరోజు భక్తిభావంతో అభిషేకము మరియు పూజ జరిపేవాడు. ఇప్పటికీ వారి వంశస్థులు ఆ పాదుకలను పూజిస్తూ ఉన్నారు. బాబా నానా సాహెబ్ నిమోన్కర్ కి ఇచ్చిన పాదుకలు