శ్రీ సాయినాథాయ నమః
నెల్లూరు నుండి ఒక సాయి భక్తురాలు తనకు జరిగిన లీలను ఈ విధంగా వివరిస్తున్నారు.
“చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను పూజించుకునే వాళ్ళం. నా పెళ్లి అయ్యాక అందుకు అవకాశమే లేకుండా పోయింది. మానసికంగా కూడా నేను ఎంతో బాధ పడ్డాను. ఒకరోజు పుస్తకం బైండు చేసి పెట్టమని ఎవరో శ్రీ సాయి లీలామృతము నాకు తెచ్చి ఇచ్చారు. అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశం వచ్చింది. తర్వాత తెలిసిన వారి ద్వారా సాయి లీలామృతము పుస్తకం తెప్పించుకొని మూడు సార్లు పారాయణ చేసి, విభూతి వేసిన తీర్థం అందరమూ తీసుకున్నాము. అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాను పూజించు కోవడానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు.
ఆ పారాయణ ముగిసిన రోజున నేను మా వీధిలో వెళుతుంటే ఒక కుక్క నా కాలు పట్టుకుంది. అది ఎందరినో కరిచింది కూడా,. నేను భయంతో “బాబా ” అని అరిచాను. ఆ కుక్క వెంటనే నా కాలు వదిలిపెట్టి దూరం పోయి కూర్చుని నన్ను నిర్లిప్తంగా చూస్తూ ఉంది. “బాబా” పేరు పలకగానే, నన్ను పట్టుకున్న కుక్క కూడా విడిచి పెట్టడమే ఆశ్చర్యంగా ఉంది.
సాయి సర్వజీవులను పంచభూతాలను మన మనో బుద్ధులను శాసించగల సర్వ సమర్థుడు. ఆయన దయ ఉంటే ఏ ప్రాణి కూడా మనలను ఏమీ చేయలేదు.
“నా అనుమతి లేనిదే ఆకు కూడా కదలదు. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు కానీ తేలు కానీ కానిమ్ము. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతు కోటి పాములు తేళ్ల తో సహా సర్వప్రాణులు భగవంతుని ఆజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వారిపై ఆధారపడి ఉన్నది. ఎవరు స్వతంత్రులు కారు” అనే బాబా పలుకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాము. ఇంకెప్పుడైనా మనకు ఇలాంటి సందర్భము ఎదురైనచో, అంటే ఏ క్రూర జంతువు బారిన నైనా మనము పడినప్పుడు, గాభరా పడకుండా , బ్రహ్మాండ నాయకుడైన సాయిని మదిలో తలుచుకుంటే, సాయి మనకు ఏ ఆపద కలగనివ్వడు.
సర్వ సమర్థ సాయి శరణం